...
...
Next Story

నామినేషన్లు వేయని చోట గడువు పెంచండి - వైసీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలును అడ్డుకున్నారంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నామినేషన్లు వేయని మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని ఆదేశించింది. స్వేచ్ఛాయుత ఎన్నికలు రాజ్యాంగ మూలస్తంభమని స్పష్టం చేసింది.

Published on: Oct 21, 2026, 12:01:12 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలును అడ్డుకున్నారంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. జస్టిస్ జాయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం… ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను బుధవారం వినింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు నామినేషన్లు వేయని చోట 48 గంటల సమయం పెంచాలని ఆదేశించింది. శాంతిభద్రతల విషయంలో డీజీపీ అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

వైసీపీ తరపు న్యాయవాది వాదనలు…

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

వైసీపీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అమర్‌దీప్ సింఘ్…. ధర్మాసనం ఎదుట సుదీర్ఘ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 600 పురపాలక వార్డుల్లో 19 మున్సిపాలిటీలలో ఏకంగా 63 శాతం మేర వైసీపీ అభ్యర్థులను దౌర్జన్యంగా నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ హాస్యాస్పదంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సిసిటీవీ నిఘా, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలంటూ అక్టోబర్ 16, అక్టోబర్ 19 తేదీల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) జారీ చేసిన ఆదేశాలను పోలీసులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని, దీనిపై అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా ఇచ్చామని వివరించారు. ఈ క్రమంలో అర్హులైన అభ్యర్థులందరూ ఎన్నికల్లో పాల్గొనేలా నామినేషన్ల స్వీకరణ తుది గడువును పెంచాలని, అదనపు రక్షణ కల్పించి నామినేషన్ల తుది జాబితా విడుదలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

వైసీపీ తరపు న్యాయవాది ప్రస్తావించిన అంశాలను…. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ పరమేశ్వర్ పూర్తిగా తోసిపుచ్చారు. అభ్యర్థుల భద్రత కోసం అక్టోబర్ 16నే తగిన చర్యలు తీసుకుంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చామని తెలిపారు. నామినేషన్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో సిసిటీవీ కెమెరాల అమరిక, డీజీపీ పర్యవేక్షణలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైన ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ పూర్తిస్థాయిలో జరిగిందని, కొన్ని తీవ్ర సమస్యాత్మక ప్రదేశాల్లో ఎన్నికల ప్రక్రియను సైతం వాయిదా వేశామని ఎస్‌ఈసీ కోర్టుకు నివేదించింది.

ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ బాగ్చీ ధర్మాసనం ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాధాన్యతను స్పష్టం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. "స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఒక భాగం. అందులో అభ్యర్థులు స్వేచ్ఛగా పాల్గొనే హక్కు ప్రాథమిక అంశం," అని స్పష్టం చేసింది.

ఎన్నికల నిర్వహణ పూర్తి బాధ్యత, అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని అంగీకరిస్తూనే.. రాజ్యాంగబద్ధ కోర్టులు తమ న్యాయ సమీక్షాధికారాన్ని గుడ్డిగా వదులుకోవడానికి వీల్లేదని అభిప్రాయపడింది. శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర యంత్రాంగం పక్షపాతంగా వ్యక్తమవుతోందని పిటిషనర్ ఆరోపిస్తున్నారని, మరోవైపు అవసరమైన చర్యలు తీసుకున్నామని ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నాయని గుర్తుచేసింది.

ఎన్నికల ప్రక్రియ సమయానికి పూర్తి కావాలనే ఉద్దేశంతో సాధారణంగా కోర్టులు కలగజేసుకోవు గానీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కోర్టును ఆశ్రయించి, నామినేషన్ దాఖలుకే తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయని ఆధారాలతో సవాలు చేసినప్పుడు రాజ్యాంగ విలువలకు రక్షకులుగా ఉన్న కోర్టులు మౌనంగా ఉండలేవని ధర్మాసనం తేల్చిచెప్పింది. రాజ్యాంగ ప్రజాస్వామ్యంపై, చట్టపాలనపై ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టడం అత్యంత కీలకమని వ్యాఖ్యానించింది.

గడువు పొడిగింపుపై ఆదేశాలు…

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల గడువు పొడిగింపుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తుది అభ్యర్థుల జాబితా ప్రకటనను అక్టోబర్ 25 వరకు వాయిదా వేయాలని… అభ్యర్థులు నామినేషన్ వేయలేకపోయిన చోట గడువు పొడిగించాలని ఎస్‌ఈసీని ఆదేశించింది.

"రాజకీయ పార్టీల నుంచి, బాధిత అభ్యర్థుల నుంచి వచ్చిన వినతిపత్రాలను , వారు సమర్పించిన సాక్ష్యాలను, డిజిటల్/ఎలక్ట్రానిక్ ఆధారాలను ఎస్‌ఈసీ తక్షణమే నిశితంగా పరిశీలించాలి.

శాంతిభద్రతల సమస్యలు, భౌతిక దాడుల కారణంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని భావించే పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్ల దాఖలు తుది గడువును పొడిగించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన నిర్ణయం తీసుకోవాలి.

అభ్యర్థులు నామినేషన్ వేయలేని ప్రాంతాలను గుర్తించి, అక్కడ నామినేషన్ల గడువును పొడిగించే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం రేపటికల్లా (గురువారం లోపు) నిర్ణయం తీసుకోవాలి " అంటూ సుప్రీంకోర్టు గడువు విధించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks