Bhumi Modi: మీ ఇంటి పెద్దలతో బూతులు మాట్లాడతారా? మోదీని తిట్టడంపై హీరోయిన్ భూమి పెడ్నేకర్ కామెంట్స్- తిరగబడ్డ నెటిజన్స్

Bhumi Pednekar On PM Modi: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ ఆందోళనల్లో ప్రధాని నరేంద్ర మోదీపై కొందరు విద్యార్థులు వాడిన భాషను బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ తప్పుపట్టారు. మీ ఇంటి పెద్దలతో ఇలాంటి బూతులే మాట్లాడతరా అని భూమి ప్రశ్నించారు. భూమి కామెంట్స్‌తో నెటిజన్స్ తిరగబడ్డారు. ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

Published on: Aug 3, 2026, 09:43:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bhumi Pednekar On PM Modi: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ (NEET-UG) ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనలు తీవ్ర రూపాంతరం దాల్చాయి. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెల రోజులకు పైగా సాగిన ఈ నిరసనలు, జులై 20న సంసద్ మార్చ్ సందర్భంగా మరింత ఉద్రిక్తంగా మారాయి.

మీ ఇంటి పెద్దలతో బూతులు మాట్లాడతారా? మోదీని తిట్టడంపై హీరోయిన్ భూమి పెడ్నేకర్ కామెంట్స్- తిరగబడ్డ నెటిజన్స్
మీ ఇంటి పెద్దలతో బూతులు మాట్లాడతారా? మోదీని తిట్టడంపై హీరోయిన్ భూమి పెడ్నేకర్ కామెంట్స్- తిరగబడ్డ నెటిజన్స్

విద్యార్థులు వాడిన భాషపై

ఈ నేపథ్యంలో నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు వాడిన భాషపై బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె ట్రోలింగ్‌కు గురయ్యేలా చేశాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు భూమిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"ఇంటి పెద్దలతో ఇలాగే మాట్లాడతారా?": భూమి పెడ్నేకర్ పోస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసిన భూమి పెడ్నేకర్, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కొందరు యువకులు వాడిన భాషే సరికాదని అభిప్రాయపడ్డారు.

"సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తుంటే మన దేశ యువత మాట్లాడుతున్న తీరు తీవ్రంగా కలిచివేస్తోంది. దేశంలో అత్యున్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి మనం ఇలాగేనా మాట్లాడేది? మన ఇంట్లోని పెద్దలతో మనం ఎప్పుడైనా ఇలాంటి బూతులు మాట్లాడతామా? మనం మన సంస్కృతి, సాంప్రదాయాలను మర్చిపోకూడదు" అని భూమి పెడ్నేకర్ పేర్కొన్నారు.

బాధ్యతాయుతమైన పద్ధతిలో, వినమ్రతతో కూడిన భాషలోనే తమ నిరసనను తెలియజేయాలని యువతకు భూమి పెడ్నేకర్ పిలుపునిచ్చారు. ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడటానికి సంస్కారవంతమైన చర్చలు అవసరమని వ్యాఖ్యానించారు.

"ఏసీ కార్లలో కూర్చుని నీతులు చెప్తారా?": తిరగబడ్డ నెటిజన్లు

భూమి పెడ్నేకర్ వీడియో బయటకు రాగానే నెటిజన్లు, విద్యార్థి సంఘాలు ఆమెపై మండిపడ్డాయి. జులై 20న పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం, తుపాకీ ప్రయోగాల గురించి ఏనాడూ మాట్లాడని భూమి, ఇప్పుడు కేవలం నిరసనకారుల భాష గురించి మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"ఒకవైపు ఏకే-47ల బెదిరింపులు, పోలీసు దెబ్బలు తింటుంటే.. ఇంకోవైపు ఏసీ కార్లలో కూర్చుని పూర్తి మేకప్‌తో నీతులు చెప్పడం చాలా తేలిక" అంటూ ఒక నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశారు. "గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు, మన ప్రవర్తనతో సంపాదించుకునేది. మన ప్రజాప్రతినిధులు అసెంబ్లీలు, పార్లమెంట్లలో వాడే భాషపై కూడా భూమి గారు ఇలాగే స్పందిస్తే బాగుంటుంది" అని మరికొందరు ఎద్దేవా చేశారు.

ఉద్రిక్తంగా మారిన నీట్ ఆందోళనలు

విద్యావ్యవస్థలో సంస్కరణలు తేలాలని, పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు. దేశవ్యాప్తంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనల అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ, విద్యార్థులు ఇంకా సంస్కరణల కోసం పట్టుబడుతున్నారు.

జులై 20న సంసద్ మార్చ్ సందర్భంగా సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు విద్యార్థులను దారుణంగా కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘర్షణల సమయంలోనే ఆగ్రహంతో ఉన్న కొంతమంది విద్యార్థులు రాజకీయ నాయకులపై తీవ్రపదజాలం ఉపయోగించారు.

ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దని

కాగా, ఈ నిరసనల్లో పాల్గొన్న పలువురిపై కేసులు నమోదు కావడం, మహిళా విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో లీక్ చేయడం కలకలం రేపింది. ప్రధాని మోదీ మాత్రం తనపై చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయవద్దని స్పష్టం చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More