...
...
Next Story

30 కోట్ల చీటింగ్ కేసు- డైరెక్టర్ విక్రమ్ భట్, ఆయన భార్యకు కోర్టులో చుక్కెదురు- బెయిల్ రెజెక్ట్- జైలులోనే భార్యాభర్తలు?

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్, ఆయన భార్య శ్వేతాంబరి భట్‌లకు రాజస్థాన్ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. రూ. 30 కోట్ల చీటింగ్ కేసులో అరెస్టయిన వీరికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. విచారణ కీలక దశలో ఉన్నందున ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని స్పష్టం చేసింది.

Published on: Feb 1, 2026, 08:56:42 IST
Advertisement

ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ భట్, ఆయన భార్య శ్వేతాంబరి భట్‌లకు రాజస్థాన్ హైకోర్టులో శనివారం (జనవరి 31) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమపై నమోదైన రూ. 30 కోట్ల చీటింగ్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని వారు పెట్టుకున్న దరఖాస్తును కోర్టు తోసిపుచ్చింది. గతేడాది డిసెంబర్ 7న ముంబైలో అరెస్టయిన ఈ జంట ప్రస్తుతం ఉదయ్‌పూర్ జైలులో ఉన్నారు.

బెయిల్ నిరాకరణకు కారణాలేమిటి?

30 కోట్ల చీటింగ్ కేసు- డైరెక్టర్ విక్రమ్ భట్, ఆయన భార్యకు కోర్టులో చుక్కెదురు- బెయిల్ రెజెక్ట్- జైలులోనే భార్యాభర్తలు? (ANI Video Grab)
30 కోట్ల చీటింగ్ కేసు- డైరెక్టర్ విక్రమ్ భట్, ఆయన భార్యకు కోర్టులో చుక్కెదురు- బెయిల్ రెజెక్ట్- జైలులోనే భార్యాభర్తలు? (ANI Video Grab)

జస్టిస్ వినోద్ కుమార్ భర్వానీ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. నిందితులకు ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం ఏమాత్రం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రాసిక్యూటర్ (SPP) బెయిల్ దరఖాస్తును తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని, నిందితులను మరిన్ని వివరాల కోసం ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన వాదించారు. ఒకవేళ ఇప్పుడు వారికి బెయిల్ ఇస్తే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

అసలు కేసు నేపథ్యం ఇది..

ఉదయ్‌పూర్‌కు చెందిన 'ఇందిరా ఐవీఎఫ్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్' వ్యవస్థాపకుడు అజయ్ ముర్డియా ఫిర్యాదుతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. సినిమా ప్రాజెక్టుల పేరుతో తన వద్ద నుంచి తీసుకున్న నిధులను విక్రమ్ భట్ దంపతులు దారి మళ్లించారని ముర్డియా ఆరోపించారు. సుమారు రూ. 30 కోట్ల మేర అవకతవకలు జరిగాయని, నకిలీ బిల్లులు సృష్టించి తమ వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సినిమా నిర్మాణం కోసం కేటాయించిన సొమ్మును, సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో విక్రమ్ భట్ దంపతులతో పాటు ఉదయ్‌పూర్‌కు చెందిన దినేష్ కటారియా, భట్ మేనేజర్ మెహబూబ్ అన్సారీలను కూడా రాజస్థాన్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

డిఫెన్స్ వాదన ఇలా

"ప్రతి లావాదేవీ ఇరు పక్షాల ఆమోదంతోనే జరిగింది. ఎక్కడా నకిలీ బిల్లులు లేవు. ఒప్పందం ప్రకారం సినిమాలు నిర్మించే ప్రక్రియలోనే ఈ నిధుల వినియోగం జరిగింది" అని విక్రమ్ భట్ న్యాయవాది కోర్టులో పేర్కొన్నారు.

క్రిమినల్ కేసు కాదని

కాగా, అంతకుముందు ఇది సివిల్ వివాదమని, క్రిమినల్ కేసు కాదని పేర్కొంటూ ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని విక్రమ్ భట్ కోరగా, ఆ అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది.

కేవలం నమ్మక ద్రోహమే కాకుండా, నిధుల మళ్లింపు (Misappropriation) కూడా జరిగినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని, కాబట్టి పోలీసు విచారణ ఆగకూడదని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి విక్రమ్ భట్ దంపతులకు జైలు కష్టాలు తప్పేలా కనిపించడం లేదని తెలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks