...
...
Next Story

Gaayapadda Simham Review: గాయపడ్డ సింహం రివ్యూ- ట్రంప్‌పై చేతబడి- తరుణ్ భాస్కర్ సెటైరికల్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Gaayapadda Sihmham Movie Review In Telugu And Rating: డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు సెటైరికల్ కామెడీ మూవీ గాయపడ్డ సింహం. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి గాయపడ్డ సింహం రివ్యూలో తెలుసుకుందాం.

Published on: May 1, 2026, 16:39:32 IST
Advertisement

Gaayapadda Sihmham Movie Review In Telugu And Rating: తెలుగు రాష్ట్రాల్లో 'అమెరికా వెళ్లడం' అనేది ఒక ఎమోషన్. ఆ కల చెదిరిపోతే ఒక యువకుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడిపైనే పగ తీర్చుకోవాలనుకుంటే? వినడానికే క్రేజీగా ఉన్న ఈ పాయింట్‌తో వచ్చిన సినిమానే 'గాయపడ్డ సింహం'.

సెటైరికల్ కామెడీగా

గాయపడ్డ సింహం రివ్యూ- ట్రంప్‌పై చేతబడి- తరుణ్ భాస్కర్ సెటైరికల్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
గాయపడ్డ సింహం రివ్యూ- ట్రంప్‌పై చేతబడి- తరుణ్ భాస్కర్ సెటైరికల్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

టాలీవుడ్ డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన సినిమానే గాయపడ్డ సింహం. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సెటైరికల్ కామెడీగా తెరకెక్కించారు. డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 1న అంటే ఇవాళ విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి గాయపడ్డ సింహం రివ్యూలో చూద్దాం.

టైటిల్: గాయపడ్డ సింహం

నటీనటులు: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, జేడీ చక్రవర్తి, కశ్యప్ శ్రీనివాస్, శ్రీవిష్ణు, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, విష్ణు ఓఐ తదితరులు

కథ: సూర్య ప్రకాష్ జోస్యుల

దర్శకత్వం: కశ్యప్ శ్రీనివాస్

సంగీతం: స్వీకార్ అగస్తి

సినిమాటోగ్రఫీ: విద్య సాగర్ చింతా

ఎడిటింగ్: విప్లవ్ నైషాడం

నిర్మాతలు: కల్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమేనని, ఉమేష్ కుమార్ భన్సాల్

విడుదల తేది: మే 1, 2026

కథ:

మధ్యతరగతి జీవితంతో సంతృప్తిగా ఉండే దరహాస్ (తరుణ్ భాస్కర్), ధనవంతురాలైన తన ప్రియురాలిని (మానస చౌదరి) పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ, అమెరికాలో స్థిరపడితేనే తన కూతురుకు ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు అమ్మాయి తండ్రి. దాంతో అంతా ఏర్పాట్లు చేసుకుని అమెరికాకు బయలుదేరుతాడు దరహాస్. తీరా అక్కడికి వెళ్లాక, ఇమ్మిగ్రేషన్ వద్ద డీపోర్ట్ అయి తిరిగి హైదరాబాద్ చేరుకుంటాడు దరహాస్.

అసలు ట్రంప్‌పై దరహాస్ ఎలా చేతబడి చేయాలనుకున్నాడు? అందుకు అతనికి ఎవరు సహాయం చేశారు? మరోవైపు బ్రూటల్ సత్య లాజిస్టిక్ ఓనర్ బ్రూటల్ ధర్మ (జేడీ చక్రవర్తి) గ్యాంగ్ దరహాస్ వెంట ఎందుకు పడింది? మరి ట్రంప్‌పై చేతబడి వర్కౌట్ అయిందా? వంటి విషయాలు తెలియాలంటే ఈ గాయపడ్డ సింహాన్ని చూడాల్సిందే.

విశ్లేషణ:

దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని ఒక పక్కా 'మెటా' కామెడీగా మలిచారు. సినిమా మొదట్లోనే "నవ్వకండి, ఇది సీరియస్ విషయం" అనే టైటిల్ కార్డుతోనే దర్శకుడి ఉద్దేశ్యం అర్థమవుతుంది.

ఆకట్టుకునే సెటైర్లు.. టాలీవుడ్‌పై పేరడీలు

టాలీవుడ్ కమర్షియల్ సినిమాలపై, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ల 'సక్సెస్ మీట్'లపై వేసిన సెటైర్లు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. సైబరాబాద్‌లోని గ్లాస్ బిల్డింగ్‌లను చూసి ఆశ్చర్యపోయే సగటు మధ్యతరగతి మనస్తత్వాన్ని, జెన్-జీ ఇన్‌ఫ్లుయెన్సర్ల పిచ్చిని దర్శకుడు చాలా సహజంగా చూపించారు.

తరుణ్ భాస్కర్ పాత సినిమా 'పెళ్లి చూపులు', ఫరియా అబ్దుల్లా 'జాతి రత్నాలు' పాత్రల మీద కూడా ఇందులో జోకులు పేలాయి. జేడీ చక్రవర్తి ఒక క్రైమ్ బాస్‌గా కనిపించినా, అది కూడా ఒక రకమైన పేరడీగానే సాగుతుంది. అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్లను కూడా ఇందులో వదలకుండా సెటైర్లు వేశారు. హీరో శ్రీవిష్ణు క్యామియో చాలా బాగుంటుంది. చేతబడి చేసే భైరవదాస్ పాత్ర నవ్విస్తుంది.

ప్లస్ పాయింట్స్:

నటీనటుల ప్రతిభ: తరుణ్ భాస్కర్ తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకోగా, ఫరియా అబ్దుల్లా (చిట్టి) ఎనర్జీ సినిమాకు బలం. మానస చౌదరి గ్లామరస్‌గా అట్రాక్ట్ చేసింది.

శ్రీవిష్ణు క్యామియో: సెకండాఫ్‌లో వచ్చే శ్రీవిష్ణు పాత్ర సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా అతని తల్లి (ఝాన్సీ)తో సాగే ఫోన్ సంభాషణ హైలైట్‌గా ఉంటుంది.

డైలాగ్స్: సినిమా ఇండస్ట్రీపై, అమెరికా వ్యామోహంపై రాసిన డైలాగులు పేలాయి.

మైనస్ పాయింట్స్:

కథాంశం కాగితం మీద బాగున్నా, తెరపైకి వచ్చేసరికి కొన్ని చోట్ల నెమ్మదించింది. అమెరికా అధ్యక్షుడిపై పగ, ట్రంప్‌కు చేతబడి చేయాలనే పాయింట్ వినడానికి వింతగా ఉన్నా, కథలో దానికి సరైన ఎమోషనల్ డెప్త్ లేకపోవడంతో కాసేపటి తర్వాత అది ఒక గిమ్మిక్‌లా అనిపిస్తుంది. హీరో డీపోర్ట్ అయిన తర్వాత పడే ఇబ్బందులను ఇంకాస్త బలంగా చూపిస్తే బాగుండేది. క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ స్క్రీన్‌ప్లే పట్టు తప్పినట్లు అనిపిస్తుంది.

ఫైనల్‌గా చెప్పాలంటే?

'గాయపడ్డ సింహం' ఒక విభిన్నమైన ప్రయత్నం. లాజిక్కులు వెతక్కుండా కేవలం వినోదం కోసం చూస్తే ఈ సినిమా నవ్విస్తుంది. సినిమాలో లోపాలు ఉన్నప్పటికీ, నటీనటుల పర్ఫామెన్స్, కామెడీ కోసం ఒకసారి చూడొచ్చు. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని క్లూ ఇచ్చారు. ఆ సినిమా టైటిల్, ఏ హీరోతో చేస్తున్నారనే విషయం ఇంట్రెస్టింగ్‌గా చూపించారు.

రేటింగ్: 3/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe