...
...
Next Story

Kangana Nurse: నర్స్ అంటే సెక్సువలైజ్డ్ వృత్తి కాదు.. కంగనా రనౌత్ కామెంట్స్.. బ్రిటీష్ కాలం నాటి డ్రెస్ కూడా మార్చాలంటూ!

Kangana Ranaut On Nursing Profession: మంబై 26/11 ఉగ్రదాడుల నేపథ్యంలో వైద్య సిబ్బంది త్యాగాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన సినిమా భారత్ భాగ్య విధాత రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నర్సింగ్ వృత్తిపై సమాజంలో ఉన్న వివక్ష, బ్రిటీష్ కాలం నాటి డ్రెస్ కోడ్‌పై నటి, ఎంపీ కంగనా రనౌత్ కామెంట్స్ చేశారు.

Published on: Jun 7, 2026, 20:30:17 IST
Advertisement

Kangana Ranaut On Nursing Profession And Dress Code: వైద్యరంగంలో డాక్టర్లకు ఇచ్చే గౌరవం ప్రాణాలు కాపాడే నర్సులకు దక్కడం లేదనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఈ సున్నితమైన అంశంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు.

ప్రాణాలకు తెగించి

నర్స్ అంటే సెక్సువలైజ్డ్ వృత్తి కాదు.. కంగనా రనౌత్ కామెంట్స్.. బ్రిటీష్ కాలం నాటి డ్రెస్ కూడా మార్చాలంటూ!
నర్స్ అంటే సెక్సువలైజ్డ్ వృత్తి కాదు.. కంగనా రనౌత్ కామెంట్స్.. బ్రిటీష్ కాలం నాటి డ్రెస్ కూడా మార్చాలంటూ!

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'భారత్ భాగ్య విధాత' (Bharat Bhhagya Viddhaata) సినిమా జూన్ 12, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. 2008లో జరిగిన ముంబై 26/11 ఉగ్రదాడుల సమయంలో కామా హాస్పిటల్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రోగులను ఎలా కాపాడారనే వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఈ సినిమాలో కంగనా ఒక సాధారణ స్టాఫ్ నర్సు పాత్రలో కనిపించనున్నారు. భారత్ భాగ్య విధాత సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచిన చిత్రబృందం, సమాజంలో నర్సుల పట్ల ఉన్న దృక్పథంపై కొత్త చర్చకు తెరలేపింది.

నర్సింగ్ వృత్తిని కేవలం గ్లామర్‌గా చూస్తున్నారు

సినిమా ప్రమోషన్లలో భాగంగా వార్తా సంస్థ 'ఏఎన్ఐ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ నర్సింగ్ వృత్తిపై సమాజం చూసే చూపు మారాలని ఆకాంక్షించారు. "మన సమాజంలో నర్సుల పట్ల ఉన్న భావన మారాలి. సినిమా పరిశ్రమతో పాటు బయట కూడా నర్స్‌లను ఒక గ్లామర్ లేదా సెక్సువలైజ్డ్ వృత్తిగా మార్చేశారు. నిజానికి వారికి తక్కువ జీతాలు ఇస్తూ, శ్రమను దోచుకుంటున్నారు. అన్నింటికంటే ఎక్కువగా వారిని తక్కువ చేసి చూస్తున్నారు" అని కంగనా ఆవేదన వ్యక్తం చేశారు.

నర్సుల యూనిఫామ్ గురించి కంగనా ఒక ఆసక్తికరమైన కోణాన్ని లేవనెత్తారు. "భారతదేశంలో డాక్టర్లు తమకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉంది, కేవలం పైన వైట్ కోట్ వేసుకుంటారు. కానీ నర్సుల విషయానికి వస్తే శీతాకాలమైనా, ఎండాకాలమైనా బ్రిటీష్ కాలం నాటి పాత డ్రెస్ కోడ్‌ను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా ఒక విదేశీ లుక్‌ను ప్రతిబింబిస్తుంది" అని కంగనా అభిప్రాయపడ్డారు.

అయితే రూపం, పరిమాణంతో సంబంధం లేకుండా యూనిఫామ్ అనేది బాధ్యతకు చిహ్నమని, ఈ సినిమాలో నర్సుల వృత్తిని అత్యంత గౌరవప్రదంగా చూపించామని కంగనా రనౌత్ వివరించారు.

సినిమాకు ఆ పేరు పెట్టడం వెనుక మోదీ స్ఫూర్తి

సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో 'భారత్ భాగ్య విధాత' అనే టైటిల్ పెట్టడం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని కంగనా రనౌత్ బయటపెట్టారు. 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని శ్రామికులను ఉద్దేశించి ఈ పదాన్ని ఉపయోగించారని ఆమె తెలిపారు.

"గతంలో ప్రధాని మోదీ వికలాంగులను 'దివ్యాంగులు'గా, వితంతువుల పథకానికి 'కల్యాణి'గా, చేతివృత్తుల వారిని 'విశ్వకర్మ'లుగా నామకరణం చేశారు. అదే విధంగా దేశాన్ని నిర్మించే కార్మికులను, శ్రామికులను 'భారత్ భాగ్య విధాత' అని పిలిచారు. ఆ మాట మా హృదయాలను తాకింది, అందుకే ఆపద సమయంలో దేశాన్ని కాపాడిన వైద్య సిబ్బందికి గౌరవంగా ఈ టైటిల్ పెట్టాం" అని కంగనా వివరించారు.

నిజమైన హీరోల కథను

పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ సమర్పణలో, మణికర్ణిక ఫిల్మ్స్, పరమహంస క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మనోజ్ తపడియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గిరిజా ఓక్, స్మితా తాంబే, అమృతా నామ్‌దేవ్ కీలక పాత్రలు పోషించారు. ముంబై దాడుల సమయంలో తెరవెనుక ఉండిపోయిన నిజమైన హీరోల కథను ఈ సినిమా ద్వారా ప్రపంచానికి చాటిచెప్పనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe