కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: మార‌ని జ్యో-రివేంజ్ కోసం వెయిటింగ్‌-కాంచ‌న‌కు శ్రీధ‌ర్ కాల్‌-త‌ల్లి గోడు విని కార్తీక్ బాధ

కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 14 ఎపిసోడ్ లో ఇంత జరిగినా జ్యోత్స్న మారదు. దీప, బావకు తాను ఎంత డేంజరో చూపిస్తానని అనుకుంటుంది. మరోవైపు కాంచనకు శ్రీధర్ కాల్ చేస్తాడు. తల్లి గోడు విని కార్తీక్ బాధపడతాడు. 

Published on: Nov 14, 2025 7:02 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే నవంబర్ 14 ఎపిసోడ్ లో బోర్డు మీటింగ్ లో అందరూ నన్ను జోకర్ ను చేశారు. మా తాత, డాడీ, మమ్మీ కలిసి పనిమనిషికి ఉన్న అర్హత కూడా నాకు లేదన్నారని పారిజాతంతో చెప్తూ మండిపడుతుంది జ్యోత్స్న. దీప సీఈఓగా ఉంటే పొడుద్దామనుకున్నా. కానీ అది కూడా ట్విస్ట్ ఇచ్చిందని పారు అంటుంది. ఇవన్నీ జరగడానికి కారణం బావ. ఇప్పుడు అది ఏమై ఉంటుంది గ్రానీ అని అడుగుతుంది జ్యోత్స్న.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

ఎంత డేంజరో?

నీ చేతకానితనం. కంపెనీని చేతుల్లో పెడితే నాశనం చేశావు. మీ తాత, నాన్న లాంటి తెలివైన వాళ్లు ఉన్నా కూడా కంపెనీని నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడలేకపోయారు. తప్పు చేశాననే బాధ లేదు కదా అని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. తప్పుల నుంచి కొన్ని నేర్చుకున్నా. సరిదిద్దుకునేలోపే సెండాఫ్ ఇచ్చారు. దీపను, బావను ప్రశాంతంగా ఉండనిస్తాననుకున్నావా? ఈ జ్యోత్స్న ఎంత డేంజరో తొందర్లోనే అర్థమయ్యేలా చేస్తానని జ్యోత్స్న అంటుంది.

అమ్మానాన్న కలవాలని

అమ్మానాన్నల మధ్య ఏం జరిగింది? ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందనేది పక్కన పెడితే తల్లిదండ్రులు కలిసి ఉండాలని పిల్లలు కోరుకుంటారా? లేదా? మీ అమ్మానాన్నను మళ్లీ కలిపేంతవరకూ మనం సరిగ్గా తినలేదు, పడుకోలేదు. మరి మా అమ్మానాన్న గురించి కూడా అనుకుంటా కదా. భార్యభర్తల బంధం అంటే మా అమ్మానాన్నలది కాదా. మా మాస్టారు తప్పు చేశాడు. కానీ ఎలా సరిదిద్దుకోవాలో అర్థం కాదు. మా అమ్మ దగ్గరకు తీసుకుంటుందో లేదో తెలియదు అని దీపతో చెప్తాడు కార్తీక్.

మా నాన్న గురించి అమ్మ ఆలోచిస్తుందో లేదో అని ఓ ప్రయత్నం చేశా. కానీ అనుకున్నది జరగలేదు. కానీ పైకి చెప్పుకోకపోయినా, ఒప్పుకోకపోయినా వాళ్లిద్దరు ఒకరినొకరు తలుచుకుంటారని దీపతో అంటాడు కార్తీక్. మరోవైపు గతాన్ని తలుచుకుంటూ కాంచన, శ్రీధర్ బాధ పడుతుంటారు. మా నాన్నను అందరూ క్షమించారు అమ్మ తప్పా అని దీపతో కార్తీక్ చెప్తాడు.

మనసు చనిపోయిందని

కాంచనకు కాల్ చేస్తాడు శ్రీధర్. ఫోన్ ఏమైనా కార్తీక్ కు ఇవ్వమంటారా? వాడి కోసం చేశారేమో కాల్ కలవక నాకు చేశారనుకున్నా అని కాంచన అంటుంది. నన్ను విష్ చేయాలని అనిపించలేదా? నీకు అవసరం లేదేమో నేను ఎదురు చూస్తా కదా. క్షమించలేవా అని శ్రీధర్ అడుగుతాడు. క్షమించడానికి మనసు కావాలి. అది చనిపోయి సంవత్సరం అవుతుంది. నా మనసుకు పాడె కట్టి, తలకొరివి పెట్టింది మీరేనని కాంచన ఎమోషనల్ అవుతుంది.

కాంచన ఎమోషనల్

చివరకు మామయ్య కూడా క్షమించారు. నువ్వు అలా ఎందుకు చేయలేవని శ్రీధర్ అడుగుతాడు. ఎందుకంటే తండ్రి కంటే ఎక్కువ నమ్మకం నేను పెట్టుకున్నా కాబట్టి అని కాంచన అంటుంది. నాకు మీరు కావాలి. మీతో బతికే అవకాశం అడుగుతున్నా. క్షమించానని ఒక్క మాట చెప్పు చాలు. నీ భర్త ఎవరు? అని అడుగుతాడు శ్రీధర్. బ్రహ్మ దేవుడు నా తలరాతను ఎడమ చేత్తో రాశాడు. అందుకే అక్షరాలన్నీ వంకరగా వచ్చాయి. అన్నీ ఉన్నాయి అమ్మ లేదు. పెళ్లి చేసుకున్నా కొడుకు పుట్టాడు. వాణ్ని ఎత్తుకుని తిరిగేందుకు కాళ్లు లేవు. ఇప్పుడు ముత్తయిదువునే కానీ భర్త లేడు. సీఈఓగా మీకు శుభాకాంక్షలు అని ఫోన్ పెట్టేసి ఏడుస్తుంది కాంచన.

కలిసి ఉండాలని

ఇదంత విన్న కార్తీక్ అమ్మ దగ్గరకు వస్తాడు. నువ్వు ఒంటరిగా మిగిలిపోలేదని చెప్పేందుకు ఇంకా నిద్రపోలేదమ్మా. అంతా విన్నా. నువ్వు అన్న మాటలను బట్టి కొంత అర్థం చేసుకోగలను. ఏం జరిగినా సరే అమ్మానాన్న కలిసి ఉండాలని పిల్లలు కోరుకుంటారా? లేదా? అని కార్తీక్ అడుగుతాడు. ఓ ఆడది గెలుపు కోరుకుంటుంది. తను అన్ని గెలిచిన మనిషిగా ఈ ప్రపంచం ముందు నిలబడాలని అనుకుంటుంది. తను కోరుకున్న గెలుపు తండ్రి ద్వారా దొరకనప్పుడు భర్త ద్వారా లేదా పిల్లల ద్వారా ఆశపడుతుంది. నాకు అన్ని చోట్లా గెలుపు దొరికింది. కానీ నా భర్త తల తీసేశాడని కాంచన బాధపడుతుంది.

రెండో పెళ్లి

ఇదిగో వీళ్లాయనే రెండో పెళ్లి చేసుకున్నాడంటా అని నాకు వినపడేలా ఎక్కడ అంటారో అని బయటకు వెళ్లేందుకు భయపడుతుంటా. భర్త చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఆడదాన్ని నేను. ఆత్మాభిమానాన్ని నిలబెట్టేందుకు కొడుకు ఉన్నాడు కాబట్టి ఈ మాత్రమైనా బతుకుతున్నా. భర్త తప్పులకూ భార్యనే నిందించే లోకం ఇది. నిన్ను చూసుకునే మొండి ధైర్యంతో బతుకుతున్నానని కాంచన ఏడ్చేస్తుంది.

ఎప్పుడూ ఓడిపోవమ్మా

ఆ మనిషి తప్పు చేశాడు. మారాడు. నా కోసం రూ.10 కోట్లు కట్టేందుకు క్షణం కూడా ఆలోచించలేదు. ఆ మనిషిలో పశ్చాత్తాపం చూశా. నాన్న మళ్లీ మనతో కలవాలని కోరుకున్నాడు. నువ్వు చెప్పాల్సింది చెప్పావు. కొడుకుగా తండ్రి, తల్లి గురించి ఆలోచిస్తా కదా. ఆయన కోసం దీప మీద. ఏదైనా పోవాల్సిందే. కోపమైనా, ద్వేషమైనా, ఇద్దరి మధ్య ఉన్న దూరమైనా. నీ కొడుకు ఉండగా నువ్వెప్పుడూ ఓడిపోవమ్మా అని అమ్మను దగ్గరకు తీసుకుంటాడు కార్తీక్.

మీ నాన్న, నేను కలవాలని కోరుకుంటున్నావని నాకు అర్థమైంది. కానీ అది ఈ జన్మలో జరగదని కాంచన అనుకుంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.