...
...
Next Story

Parvathy Thiruvothu: నాకు ఆ ఆరోగ్య సమస్య ఉంది, ముక్కలైపోయినా మళ్లీ కొత్తగా అతుక్కుంటాం.. హీరోయిన్ పార్వతి కామెంట్స్

Parvathy Thiruvothu Reveals ADHD Diagnosis: విలక్షణ నటి పార్వతి తిరువోతు తన ఆరోగ్య సమస్యపై మొదటిసారి పెదవి విప్పారు. తనకు ఏడీహెచ్‌డీ (ADHD) ఉన్నప్పటికీ, గతం కంటే రెట్టింపు వేగంతో వరుస సినిమాలు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. నాగ చైతన్య దూత 2తో సహా రాబోయే పార్వతి సినిమాల గురించి ఇక్కడ చూద్దాం.

Published on: Nov 24, 2026, 14:30:27 IST
Advertisement

Parvathy Thiruvothu Reveals ADHD Diagnosis: దక్షిణాది సినీ పరిశ్రమలో విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరోయిన్ పార్వతి తిరువోతు తన వ్యక్తిగత ఆరోగ్య సమస్య గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'దూత' ఓటీటీ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు సైతం బాగా దగ్గరైన ఈ మలయాళ బ్యూటీ, ప్రస్తుతం తన 20 ఏళ్ల కెరీర్‌లోనే అత్యంత బిజీగా గడుపుతున్నారు.

నాకు ఆ ఆరోగ్య సమస్య ఉంది, ముక్కలైపోయినా మళ్లీ కొత్తగా అతుక్కుంటాం.. హీరోయిన్ పార్వతి కామెంట్స్
నాకు ఆ ఆరోగ్య సమస్య ఉంది, ముక్కలైపోయినా మళ్లీ కొత్తగా అతుక్కుంటాం.. హీరోయిన్ పార్వతి కామెంట్స్

తాజాగా నటి, వ్యాఖ్యాత రంజిని హరిదాస్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్వతి మాట్లాడుతూ.. తనకు ఏడీహెచ్‌డీ (అటెన్షన్-డెఫిసిట్/హైపర్ యాక్టివిటీ డిజార్డర్) ఉందని బయటపెట్టారు. గతంలో ఏడాదికి కేవలం కొద్ది రోజులు మాత్రమే పనిచేయగలిగే స్థితి నుంచి, ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న తీరును ఆమె వివరించారు.

గతం కంటే భిన్నంగా.. నాన్-స్టాప్ ప్రయాణం

గత ఇరవై ఏళ్ల కెరీర్‌లో పార్వతి ఇంత వేగంగా పనిచేయడం ఇదే మొదటిసారని ఇంటర్వ్యూలో రంజిని హరిదాస్ ప్రస్తావించారు. దీనికి పార్వతి అంగీకరిస్తూ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. 2022లో తాను కేవలం 'ఉల్లోజుక్కు', తెలుగు వెబ్ సిరీస్ 'దూత' అనే రెండు ప్రాజెక్టుల్లో మాత్రమే నటించానని చెప్పారు.

ఆ తర్వాత 2023లో విక్రమ్ హీరోగా వచ్చిన 'తంగలాన్' సినిమా కోసం ఏడాది పొడవునా కేవలం 75 రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నట్లు పార్వతి తెలిపారు. అయితే గతేడాది తాను తీసుకున్న ఒక బలమైన నిర్ణయం తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని పార్వతి పేర్కొన్నారు.

ప్రాణాలేం పోవు కదా

"రాబోయే మూడేళ్ల పాటు మునుపెన్నడూ లేని విధంగా కష్టపడాలని నాకు నేనే చెప్పుకున్నాను. దానివల్ల ప్రాణాలేమీ పోవు కదా. ఒకవేళ ఓడిపోయినా సరే, గొప్పగా ఓడిపోవాలి. వైఫల్యాన్ని ఎదుర్కొనే హక్కును మనమే ఉంచుకోవాలి. ఆ క్రమంలో మనం ముక్కలైపోయినా, మళ్లీ కొత్తగా అతుక్కుంటాం" అని పార్వతి తిరువోతు అన్నారు.

వరుసగా సినిమాలు చేస్తున్నానంటే ఏది పడితే అది ఒప్పుకుంటున్నానని అర్థం కాదని పార్వతి స్పష్టం చేశారు. తనను తాను నిరూపించుకునే ఆసక్తికరమైన కథలనే ఎంచుకుంటున్నానని చెప్పారు. ఈ క్రమంలో తాను పనిచేసిన మహిళా సాంకేతిక నిపుణులు, సహనటీమణులు తనను పూర్తిగా పిండేశారని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

"నాకు ఏడీహెచ్‌డీ ఉంది. కానీ, దానిని ఒక పెద్ద సమస్యగా భూతద్దంలో పెట్టి చూడాలని నేను అనుకోవడం లేదు. నా విషయంలో సమయం అందరిలా పనిచేయదు. నా దృష్టిలో సమయం ఒక ఎలాస్టిక్ లాంటిది. నాకు కావాలంటే దానిని సాగదీయగలను. అలాగని నిద్రను పూర్తిగా త్యాగం చేస్తానని కాదు, నాకు అవసరమైన నిద్ర పోతాను" అని పార్వతి వివరించారు.

'దూత 2' సహా క్రేజీ ప్రాజెక్టుల జాబితా

ఏకాగ్రత లోపం, అతి చురుకుదనం వంటి లక్షణాలు ఉండే ఏడీహెచ్‌డీని ఆమె సానుకూల దృక్పథంతో అధిగమిస్తున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది పార్వతి విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.

బెజోయ్ నంబియార్ దర్శకత్వంలో ఆదర్శ్ గౌరవ్, షనాయా కపూర్ నటించిన 'తూ యా మై' చిత్రంలో పార్వతి తిరువోతు అతిథి పాత్రలో మెరిశారు. పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి నిస్సామ్ బషీర్ తెరకెక్కించిన 'ఐ, నోబడీ' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. షాహద్ నిలంబూర్ రూపొందించిన క్రైమ్ డ్రామా 'ప్రథమ దృష్టియా కుట్టక్కర్'లో క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న పోలీసు అధికారిణిగా ఆకట్టుకున్నారు.

ఓటీటీ సిరీస్‌లో

ప్రస్తుతం పార్వతి చేతిలో భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఇషాన్ రోషన్ నిర్మిస్తున్న అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ 'స్టోర్మ్'లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. అజిత్‌పాల్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఓటీటీ సిరీస్‌లో అలయా ఎఫ్, సృష్టి శ్రీవాస్తవ, సబా ఆజాద్ తదితరులు నటిస్తున్నారు.

ఆరోగ్య సమస్యలను సాకుగా చూపకుండా

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగ చైతన్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లోని సూపర్ హిట్ సిరీస్ 'దూత' సీక్వెల్‌లోనూ పార్వతి నటించనున్నారు. వీటితో పాటు కార్తీక్ ఆర్యన్ హీరోగా షిమిత్ అమీన్ దర్శకత్వం వహిస్తున్న 'కెప్టెన్ ఇండియా' చిత్రంలోనూ ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆరోగ్య సమస్యలను సాకుగా చూపకుండా, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్న పార్వతి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks