Ramayana OTT: రామాయణం 2 వేల కోట్లు కొల్లగొడుతుంది, ఓటీటీ చేతుల్లో చిక్కుకోలేదు.. నిర్మాత దిల్ రాజు కామెంట్స్
Dil Raju About Ramayana OTT Deal And Collection: రణ్‌బీర్, సాయి పల్లవి రామాయణం రూ. 1000 కోట్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత దిల్ రాజు రామాయణం ఓటీటీ హక్కులు, కలెక్షన్స్, సాయి పల్లవి సీత పాత్రపై వస్తున్న విమర్శల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Dil Raju About Ramayana OTT Deal And Collection: బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' జైత్రయాత్ర కొనసాగుతోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది.

తెలుగు రాష్ట్రాల్లో రామాయణం సినిమాను పంపిణీ చేసిన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రామాయణం సినిమా సాధించిన భారీ విజయం, భవిష్యత్ కలెక్షన్ల అంచనాలతో పాటు పలు వివాదాలపై ఆయన స్పష్టత ఇచ్చారు.
రూ. 2000 కోట్ల క్లబ్‌పై దిల్ రాజు ధీమా
నవంబర్ 5న థియేటర్లలో విడుదలైన 'రామాయణ'కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పౌరాణిక కథలకు ఎప్పుడూ ఉండే ప్రత్యేక ఆదరణ ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. సినిమా వసూళ్ల వేగంపై దిల్ రాజు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
"సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల మార్కును చేరుకుంది. వసూళ్లు అసాధారణంగా ఉన్నాయి. నా అంచనా ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్ల నుంచి రూ. 2000 కోట్ల వరకు వసూలు చేస్తుంది. భవిష్యత్తులో చైనాతో పాటు ఇతర దేశాల్లో విడుదల చేస్తే ఆ సంఖ్య ఎక్కడికి వెళ్తుందో ఊహించలేం. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ఆశిస్తున్నాను" అని దిల్ రాజు వివరించారు.
ఇప్పట్లో ఓటీటీలోకి 'రామాయణ' రాదా?
ప్రస్తుతం టాలీవుడ్లో నిర్మాతలకు, ఓటీటీ సంస్థలకు మధ్య విడుదల తేదీల విషయంలో నెలకొన్న విభేదాలపై కూడా మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఓటీటీ సంస్థలు పెడుతున్న కఠిన నిబంధనల వల్ల చిన్న, మధ్య తరహా నిర్మాతలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఓటీటీ వ్యాపారం ఎంతవరకు వస్తుంది, మనం సేఫ్ అవుతామా లేదా అని చూసుకున్నాకే ఇప్పుడు సినిమా షూటింగ్‌లు మొదలుపెడుతున్నాం. అదే సమయంలో ఓటీటీ సంస్థలకు కూడా కొన్ని విడుదల ప్రణాళికలు ఉంటాయి. ఒకసారి డేట్ ఇచ్చాక నిర్మాతలు దానికి కట్టుబడి ఉండాలి, లేదంటే ఒప్పందాలు రద్దయ్యే ప్రమాదం ఉంది" అని దిల్ రాజు పేర్కొన్నారు.
అయితే 'రామాయణ' విషయంలో నిర్మాతలు భిన్నమైన వ్యూహాన్ని అనుసరించారని దిల్ రాజు వెల్లడించారు. "నా సినిమాలన్నీ ఓటీటీ డీల్స్ పూర్తయ్యాకే పూర్తి చేస్తాను. కానీ 'రామాయణ' నిర్మాతలు భారీ బడ్జెట్‌తో సినిమా తీసినప్పటికీ, ఇప్పటివరకు దీని ఓటీటీ, శాటిలైట్ హక్కులను విక్రయించలేదు (ఓటీటీ చేతుల్లో చిక్కుకోలేదు). ప్రస్తుతానికి ఈ సినిమాను కేవలం థియేటర్లలో మాత్రమే చూడాలి. నిర్మాతలు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడే ఓటీటీలోకి వస్తుంది" అని దిల్ రాజు స్పష్టం చేశారు.
సాయి పల్లవి సీత పాత్రపై విమర్శలకు కౌంటర్
థియేటర్ అనుభూతిని ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో అందించాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా రామాయణ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటించగా, సాయి పల్లవి సీత పాత్రలో ఒదిగిపోయారు.
అయితే వాల్మీకి రామాయణానికి భిన్నంగా, ఈ సినిమాలో సీతను కేవలం గృహిణిగానే కాకుండా అవసరమైనప్పుడు ఆయుధం పట్టే యోధురాలిగా దర్శకుడు నితేష్ తివారీ చూపించారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై దిల్ రాజు తనదైన శైలిలో స్పందించారు.
"తెలుగు హక్కులు తీసుకోకముందు, అసలు ఈ సినిమా తీస్తున్నారని తెలిసినప్పుడు నాకు కొన్ని సందేహాలు ఉండేవి. అందరికీ తెలిసిన కథను మూడు గంటల పాటు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఎలా తీస్తారా అనిపించింది. కానీ ప్రివ్యూ థియేటర్లో నేను ఒక్కడినే సినిమా చూసినప్పుడు నా కళ్లలో ఆనందభాష్పాలు తిరిగాయి. ఒంటరిగా చూస్తున్న నాకే అంత భావోద్వేగం కలిగితే, థియేటర్లో ప్రేక్షకులు కచ్చితంగా ఆ అనుభూతిని పొందుతారని అప్పుడే అర్థమైంది" అని దిల్ రాజు గుర్తుచేసుకున్నారు.
సినిమాను సినిమాలాగే చూడాలి
విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని దిల్ రాజు తేల్చిచెప్పారు. "ఇంత అద్భుతమైన ప్రయత్నం జరిగినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడం సహజం. కానీ సినిమాను సినిమాలాగే చూడాలని నేను నమ్ముతాను. అప్పుడే థియేటర్లో దాన్ని ఆస్వాదించగలం. సినిమా చూసిన వెంటనే ఉత్తరాదిలో ఇది భారీ విజయం సాధిస్తుందని నాకు అర్థమైంది. ఒకసారి సినిమా ప్రేక్షకులకు చేరువై, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నప్పుడు విమర్శలకు విలువ ఉండదు, కేవలం పాజిటివిటీ మాత్రమే నిలుస్తుంది" అని ఆయన అన్నారు.
రావణుడిగా కన్నడ స్టార్ యశ్ అద్భుత నటన కనబరిచిన ఈ చిత్రంలో, రెండో భాగం కోసం ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్న 'రామాయణ పార్ట్-2' 2028 దీపావళికి విడుదల కానుంది. మొదటి భాగం సృష్టిస్తున్న ఈ కలెక్షన్ల సునామీ రెండో భాగంపై అంచనాలను ఆకాశానికి చేర్చింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


