Ram Charan Peddi Movie : ‘ఇదయ్యా మీ విశ్వరూపం’- మెగా నీడను దాటి, ప్రపంచాన్ని గెలిచి.. రామ్​చరణ్ విజయగాథ!

Ram Charan Peddi : మెగాస్టార్ వారసుడిగా అడుగుపెట్టి, మోయలేని అంచనాల మధ్య విమర్శలు ఎదుర్కొంటూ, కేవలం తన కష్టం నమ్ముకుని అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన “గ్లోబల్ స్టార్”.. మన మెగా పవర్​ స్టార్ రామ్​చరణ్ తేజ. పెద్ది రిలీజ్​ నేపథ్యంలో ఆయన ఫిల్మోగ్రఫీపై ప్రత్యేక కథనం మీకోసం..

Published on: Jun 4, 2026, 09:58:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ram Charan Peddi Movie : సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరిది ఒక్కో కథ! హీరో అవ్వాలని ఒక సామాన్యుడి పడే కష్టం అంతా ఇంతా కాదు. అదే సమయంలో ఒక లెజెండరీ నటుడికి వారసుడిగా వచ్చే వ్యక్తి ఎదుర్కొనే మానసిక ఒత్తిడి.. ఊహకు అందనిది. మరీ ముఖ్యంగా, తెలుగు సినీ తెరను దశాబ్దాల పాటు ఏలిన తండ్రి నీడలో పుట్టడం ఒక అదృష్టమైతే.. ప్రతి అడుగులోనూ ఆ తండ్రితో పోల్చి చూసే ప్రపంచం ముందు నిలబడటం ఒక నిరంతర యుద్ధం! మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా అడుగుపెట్టిన రామ్​చరణ్ తేజ సరిగ్గా ఇదే యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, తన కష్టాన్నే నమ్ముకుని.. ‘మెగా’ నీడను దాటి, ప్రపంచాన్ని గెలిచారు. నేడు ఆయన ప్రపంచ వేదికపై ‘గ్లోబల్ స్టార్’గా మెరుస్తున్నారంటే.. ఆ వెలుగు వెనుక ఎవరికీ కనిపించని ఎన్నో సందేహాలు, కష్టాలు, కఠోర శ్రమ దాగి ఉన్నాయనడంలో సందేహం లేదు.

పెద్ది సినిమా ఈవెంట్​లో రామ్​చరణ్ తేజ..
పెద్ది సినిమా ఈవెంట్​లో రామ్​చరణ్ తేజ..

పెద్ది సినిమా విడుదలై, బ్లాక్​బస్టర్​ టాక్ సంపాదించుకున్న నేపథ్యంలో మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​ తేజ సినీ ప్రస్థానంపై గుండెను హత్తుకునే విశ్లేషణాత్మక కథనం మీకోసం..

కిరీటం ఇచ్చిన భారం.. తొలి అడుగుల తడబాటు!

2007లో పూరి జగన్నాథ్ ‘చిరుత’ సినిమాతో రామ్​చరణ్‌ను పరిచయం చేసినప్పుడు.. ప్రేక్షకులు ఒక కొత్త నటుడిని చూడలేదు, చిరంజీవి ప్రత్యామ్నాయాన్ని వెతికారు. పరిస్థితులు అలాగే ఉంటాయని మెగా తనయుడికి కూడా తెలుసు. అందుకే ప్రతి దశలోను తన 100శాతం ఇచ్చారు. కానీ గ్రేస్​తో డాన్సులు చేసిన, ఎనర్జీతో ఫైట్లు చేసినా విమర్శలు ఎదురయ్యాయి. తండ్రికి తగ్గ తనయుడు అవ్వగలడా? అన్న సందేహాలు వెల్లువెత్తాయి.

అప్పుడొచ్చింది.. ‘మగధీర’! ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన మగధీర టాలీవుడ్ చరిత్రను తిరగరాసింది. కేవలం రెండో సినిమాతోనే పరిశ్రమ రికార్డులను బద్దలు కొట్టి, పరిశ్రమను శాసించే స్థాయికి చేరారు ఈ మగధీరుడు.​

అయితే, ఆ విజయం తెచ్చిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు.

'ఆరెంజ్' సినిమా వాణిజ్యపరంగా విఫలమవ్వడం, ఆ తర్వాత చేసిన కొన్ని కమర్షియల్ సినిమాలు రామ్​చరణ్ కెరీర్‌ను రొటీన్ ట్రాక్‌లోకి నెట్టేశాయి. ఆ సమయంలో విమర్శకులు ఆయనపై తీవ్రమైన అస్త్రాలు సంధించారు. "చరణ్‌కు ముఖంలో హావభావాలు పలకవు", "కేవలం తండ్రి పేరు వాడుకుని బతికేస్తున్నాడు," అంటూ కొందరు రాసిన రాతలు ఒక యువకుడిగా ఆయన మనసును ఎంతగానో గాయపరిచాయి. కానీ, చరణ్ ఎక్కడా తొందరపడి మాట్లాడలేదు. తన బాధను, ఆక్రోశాన్ని కష్టంగా మార్చుకుని మౌనంగా ప్రయాణం సాగించారు.

Peddi: రామ్ చరణ్ పెద్ది సినిమాను ఎందుకు చూడాలి? తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన కారణాలు!

నటుడిగా పునర్జన్మ!

తనపై వచ్చిన విమర్శలకు రామ్​చరణ్ మాటలతో సమాధానం చెప్పలేదు. ‘ధృవ’ సినిమాతో తన రూపాన్ని, ‘రంగస్థలం’ సినిమాతో తన నటనను మార్చి చూపించారు. రంగస్థలం గురించి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో రామ్​చరణ్ చిట్టిబాబుగా..​ నట విశ్వరూపాన్ని ప్రదర్శించి, విమర్శలకు, విమర్శకులకు చెక్​ పెట్టారు. నటన పరంగా చూసుకుంటే, మెగా పవర్​ స్టార్​ కెరీర్​లో ఇప్పటికీ ఇదే హైలైట్​ అని ఆయన ఫ్యాన్స్​ భావిస్తుంటారు.

అప్పటివరకు ఉన్న సూట్, బూట్ స్టైలిష్ ఇమేజ్‌ను పూర్తిగా పక్కనబెట్టి, కాళ్లకు చెప్పులు లేకుండా, మురికి గుడ్డలతో పల్లెటూరి బ్యాక్​గ్రౌండ్​లో, వినికిడి లోపం ఉన్న ‘చిట్టిబాబు’ పాత్రలోకి రామ్​చరణ్ పరకాయ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో తన అన్నయ్య (ఆది పినిశెట్టి) చనిపోయినప్పుడు నోరు రాని ఆక్రోశంతో, గుండెలు పగిలేలా ఆయన ఏడ్చిన దృశ్యం థియేటర్లలో ప్రతి ఒక్కరి కంటి వెంట నీరు తెప్పించింది. ఆ రోజు

ఆ సినిమాతో రామ్ చరణ్ కేవలం స్టార్ కాదు.. నవరసాలు పండించగల అద్భుతమైన నటుడని ప్రపంచానికి తెలిసింది.

ఆర్‌ఆర్‌ఆర్‌తో అంతర్జాతీయ శిఖరం..!

దర్శకధీరుడు రాజమౌళి నమ్మకాన్ని రామ్​చరణ్ ఎప్పుడూ వమ్ము చేయలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో జూనియర్​ ఎన్టీఆర్​తో కలిసి ఆయన చూపిన నటన తెలుగు సినిమా ఉన్నతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పింది. బ్రిటీష్ సైన్యంలో ఉంటూ.. లోపల కసిని, కన్నీళ్లను దాచుకుని కళ్లతోనే హావభావాలు పలికించిన తీరు హాలీవుడ్ దర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. క్లైమాక్స్​లో విల్లు పట్టి రాముడి అవతారంలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించింది. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘నాటు నాటు’ పాటకు ఆయన వేసిన అద్భుతమైన స్టెప్పులు ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా సత్తాను చాటింది.

ఒకప్పుడు "ఎక్స్‌ప్రెషన్స్ లేవు" అన్న నోళ్లే.. నేడు "చరణ్ కళ్లు మాట్లాడతాయి," అని కొనియాడేలా చేయడం మెగా పవర్​ స్టార్​ సాధించిన అసలైన విజయం.

వ్యక్తిత్వం.. తండ్రికి తగ్గ తనయుడు

రామ్​చరణ్ కేవలం గొప్ప నటుడు మాత్రమే కాదు.. అంతకంటే మంచి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. అంతటి గ్లోబల్ స్టార్ అయినా తండ్రి ఒడిలో పసివాడే! తండ్రితో పాటు పెద్దలకు గౌరవం ఇచ్చే విషయంలో రామ్​చరణ్​కి రామ్​చరణే సాటి! వేల కోట్ల ఆస్తులు ఉన్నా సాదా సీదాగా జీవితాన్నే ఆయన ఇష్టపడుతుంటారు. ఏడాది మొత్తంలో 3,4 నెలలు దేవుడి మాలలోనే కనిపిస్తూ, ‘గ్రౌండెడ్​’గా ఉంటూ, తన క్రమశిక్షణతో నలుగురికి ఆదర్శనంగా నిలుస్తున్నారు.

అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, విమర్శలను ఎదుర్కొంటూ, వారసత్వం అనే పెద్ద కొండను దాటి తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న రామ్​చరణ్ ప్రయాణం.. జీవితంలో ఏదైనా సాధించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప స్ఫూర్తి, ఒక అద్భుతమైన పాఠం!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More