Sandeep Reddy Vanga:ఆ ఇద్దరికంటే చిరంజీవి, కమల్ హాసన్, మమ్ముట్టినే గొప్ప- యానిమల్ పార్క్‌పై సందీప్ రెడ్డి వంగా కామెంట్స్

Sandeep Reddy Vanga On Chiranjeevi Kamal Haasan Mammootty: భారతీయ అగ్ర నటుల ప్రతిభకు ప్రపంచ స్థాయిలో దక్కాల్సినంత గుర్తింపు రావడం లేదని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అభిప్రాయపడ్డారు. ఆ దిగ్గజ నటులకంటే చిరంజీవి, కమల్ హాసన్, మమ్ముట్టి చేసిన సినిమాలు, వైవిధ్యమైన పాత్రలే ఎక్కువని ఆయన ప్రశంసించారు.

Published on: Nov 28, 2026, 10:12:11 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Sandeep Reddy Vanga On Chiranjeevi Kamal Haasan Mammootty: 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరోసారి తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టారు.

ఆ ఇద్దరికంటే చిరంజీవి, కమల్ హాసన్, మమ్ముట్టినే గొప్ప- యానిమల్ పార్క్‌పై సందీప్ రెడ్డి వంగా కామెంట్స్
ఆ ఇద్దరికంటే చిరంజీవి, కమల్ హాసన్, మమ్ముట్టినే గొప్ప- యానిమల్ పార్క్‌పై సందీప్ రెడ్డి వంగా కామెంట్స్

భారతీయ సినీ దిగ్గజాలైన మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, మమ్ముట్టిల నటనా నైపుణ్యాన్ని హాలీవుడ్ లెజెండ్స్ అల్ పాసినో, రాబర్ట్ డి నీరోలతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ సినిమా చర్చల్లో మన భారతీయ నటుల గొప్పతనాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని, వారికి దక్కాల్సినంత గౌరవం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హాలీవుడ్ దిగ్గజాల కంటే మన హీరోల ప్రయాణమే పెద్దది

ప్రముఖ సినీ జర్నలిస్ట్ ఫరీదూన్ షహర్యార్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా భారతీయ సినిమాలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగులో మూడు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న చిరంజీవి, తమిళంతో పాటు పలు భాషల్లో అద్భుత పాత్రలు పోషించిన కమల్ హాసన్, మలయాళ చిత్రసీమలో తిరుగులేని నటుడిగా నిలిచిన మమ్ముట్టిల కెరీర్‌ను ఆయన ప్రస్తావించారు.

"కమల్ హాసన్, మమ్ముట్టి, చిరంజీవి చేసిన సినిమాల జాబితాను గమనిస్తే, హాలీవుడ్ నటులు అల్ పాసినో, రాబర్ట్ డి నీరోల కంటే మన హీరోల పనితీరే చాలా గొప్పది, విస్తృతమైనది అనిపిస్తుంది" అని సందీప్ రెడ్డి వంగా అభిప్రాయపడ్డారు.

ప్రమోషన్ లోపాలు

ఈ ముగ్గురు నటులు తమ తమ చిత్ర పరిశ్రమల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా, ఎన్నో విభిన్నమైన పాత్రల్లో జీవించారని వంగా కొనియాడారు. అయితే మన సినిమాల ప్రమోషన్ విషయంలో ఉన్న ఓ లోపాన్ని కూడా ఆయన ఎత్తిచూపారు.

"ఈ అగ్ర నటులు చేసిన ఎన్నో సినిమాలు నాకు చాలా ఇష్టం. కానీ మన భారతీయ సినిమాల పోస్టర్ క్వాలిటీ మాత్రం అంత బాగుండదు. ఒకవేళ ఆ పోస్టర్ల నాణ్యత కూడా బాగుండి ఉంటే బాగుండేది. కానీ వారు చేసిన సినిమాల సంఖ్య, పోషించిన వైవిధ్యమైన పాత్రలను చూసినప్పుడు మాత్రం హాలీవుడ్ నటుల కంటే మన వాళ్లే ఎంతో గొప్పగా రాణించారని గర్వంగా అనిపిస్తుంది" అని సందీప్ రెడ్డి వంగా వివరించారు. తన సొంత సినిమాల పోస్టర్ల డిజైన్ విషయంలోనూ తాను ఎంతో జాగ్రత్త తీసుకుంటానని ఆయన తెలిపారు.

'స్పిరిట్' తర్వాత 'యానిమల్ పార్క్' పట్టాలపైకి

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' చిత్రాన్ని తెరకెక్కించే పనిలో సందీప్ రెడ్డి వంగా బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బ్లాక్‌బస్టర్ 'యానిమల్' సీక్వెల్‌పై దృష్టి పెట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో జపాన్‌లో 'యానిమల్' ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా సీక్వెల్ విశేషాలను సందీప్ పంచుకున్నారు.

"నా ప్రస్తుత సినిమా పూర్తి కాగానే 'యానిమల్ పార్క్' మొదలుపెడతాను. ఇందులో అజీజ్ పాత్ర కూడా మరో యానిమల్‌లాగే ఉంటుంది కాబట్టి మరిన్ని మృగాలు కనిపిస్తాయి. ఒకే పోలికలతో ఉండే ఇద్దరు సోదరుల మధ్య జరిగే భీకర పోరాటమే ఈ కథ. అందుకే 'యానిమల్ పార్క్' అనే టైటిల్ సరైనదని భావించాను. 2027 మధ్యలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాను" అని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు.

వివాదాలు.. బాక్సాఫీస్ రికార్డుల ప్రస్థానం

2017లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి'తో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రెడ్డి వంగా తొలి చిత్రంతోనే టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఆ తర్వాత 2019లో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా ఇదే చిత్రాన్ని హిందీలో 'కబీర్ సింగ్'గా రీమేక్ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు.

ఇక 2023లో రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'యానిమల్' ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. తన సినిమాల్లోని హీరోల పాత్ర చిత్రణపై విమర్శలు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ సందీప్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.