Teja Sajja Engagement: అమెరికా అమ్మాయితో తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్- చిరంజీవి నుంచి నిధి అగర్వాల్ వరకు హాజరైన సినీలోకం!
Teja Sajja Engagement Chiranjeevi To Nani Attends: యంగ్ హీరో తేజ సజ్జా అమెరికాకు చెందిన యువతితో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో పాటు మెగాస్టార్ చిరంజీవి, నాని, రానా తదితర సినీ ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు.
Teja Sajja Engagement Chiranjeevi To Nani Attends: బాలనటుడిగా వెండితెరపై అడుగుపెట్టి 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన యంగ్ హీరో తేజ సజ్జా ఓ ఇంటివాడు కాబోతున్నారు. అమెరికాలో స్థిరపడిన యువతితో తేజా సజ్జా నిశ్చితార్థ వేడుక సోమవారం (నవంబర్ 16) హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

ఇరు కుటుంబాల పెద్దలు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. ఈ నిశ్చితార్థపు వేడుకలో తేజ సజ్జా లేత గులాబీ రంగు కుర్తా, పూల డిజైన్ ఉన్న వెయిస్ట్‌కోట్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాబోయే వధువు బంగారు వర్ణం పూసలతో అలంకరించిన లంగాఓణీలో సంప్రదాయబద్ధంగా మెరిసిపోయారు.
తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
పూల పందిరి కింద నిల్చున్న ఈ జంటకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్వయంగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్న వధూవరులు గవర్నర్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
"హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణలో జరిగిన ప్రముఖ సినీ నటుడు తేజ సజ్జా నిశ్చితార్థ వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ప్రేమ, సంతోషం, సామరస్యంతో కూడిన అందమైన జీవితాన్ని ఈ జంట గడపాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను" అని తెలంగాణ గవర్నర్ అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా పంచుకున్నారు.
తరలివచ్చిన టాలీవుడ్ తారాలోకం
రెండేళ్ల వయసు నుంచే తెలుగు చిత్ర పరిశ్రమతో అనుబంధం ఉండటంతో తేజ సజ్జా నిశ్చితార్థానికి టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తేజకు 'జాంబీ రెడ్డి', 'హను-మాన్' చిత్రాలతో భారీ విజయాలు అందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ వేడుకకు ముందుగా విచ్చేశారు.
'హను-మాన్' సహనటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన భర్త నికోలాయ్ సచ్‌దేవ్‌తో కలిసి హాజరయ్యారు. గతేడాది విడుదలైన 'మిరాయ్' చిత్రంలో తేజ సరసన నటించిన హీరోయిన్ రితికా నాయక్ సైతం ఈ వేడుకలో సందడి చేశారు.
బాలనటుడిగా తేజ సజ్జా సినిమాలు
అయితే, మెగాస్టార్ చిరంజీవి రాకతో వేడుకలో ప్రత్యేక ఉత్సాహం నెలకొంది. చిన్నప్పుడు చిరంజీవి సినిమాలైన 'చూడాలని ఉంది', 'ఇంద్ర', 'ఠాగూర్' వంటి చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించిన తేజ సజ్జా ఇప్పుడు ఆయన ఆశీస్సులు తీసుకోవడం విశేషం.
చిరంజీవితో పాటు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్, హీరోలు నాని, రవితేజ, రానా దగ్గుబాటి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, శ్రీకాంత్, దర్శకులు అనిల్ రావిపూడి, మారుతి, రచయిత కోన వెంకట్, నిర్మాత నాగవంశీ, నిహారిక కొణిదెల, నిధి అగర్వాల్ తదితరులు హాజరై కాబోయే దంపతులను అభినందించారు.
వచ్చే నెలలో ఉదయ్‌పూర్‌లో వివాహం
ఇక వచ్చే నెలలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా తేజ సజ్జా వివాహం జరగనుంది. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని తేజ సజ్జా ఇటీవలే వెల్లడించారు.
తనకు కాబోయే భార్య అమెరికాలో పెరిగారని, ఆమెకు సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె తన తండ్రితో కలిసి టెక్ రంగంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే వధువు పేరును మాత్రం గోప్యంగా ఉంచారు.

బాలనటుడి నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు..
రెండేళ్ల పసిప్రాయంలోనే కెమెరా ముందుకు వచ్చిన తేజ సజ్జా, సుమారు 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా అలరించారు. 2006లో వచ్చిన 'బాస్' సినిమా తర్వాత చదువు కోసం సినిమాలకు విరామం ఇచ్చిన తేజ సజ్జా.. 2019లో సమంత ప్రధాన పాత్రలో వచ్చిన 'ఓ! బేబీ' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత హీరోగా మారి 'హను-మాన్'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమైన 'ది ట్రేటర్స్ తెలుగు' షోకు హోస్ట్‌గా వ్యవహరించిన తేజ సజ్జా ప్రస్తుతం 'జాంబీ రెడ్డి నెక్ట్స్ లెవల్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఒకవైపు కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న తేజ సజ్జాకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


