ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రివ్యూ.. ఫొటోలు పోయాయని పెళ్లినే చెడగొట్టే ఫొటోగ్రాఫర్.. తిరువీర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
యంగ్ హీరో తిరువీర్ నటించిన లేటెస్ట్ తెలుగు కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీమియర్ షోలను 2 రోజుల ముందే వేశారు. మరి ఈ మూవీ ఎలా ఉందో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రివ్యూలో చూద్దాం.
టైటిల్: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో

నటీనటులు: తిరువీర్, టీనా శ్రావ్య, రోహన్ రాయ్, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్, వాల్తేర్ వినయ్, ప్రభావతి, మాధవి, జోగరావ్, బ్యాంక్ బాష తదితరులు
కథ, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్
సంగీతం: సురేశ్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: సోమ శేఖర్
ఎడిటింగ్: నరేష్ అడుప
నిర్మాతలు: అగరం సందీప్, కల్పన రావు
ప్రీమియర్ షో తేది: నవంబర్ 05, 2025
థియేట్రికల్ రిలీజ్ డేట్: నవంబర్ 07, 2025
మసూదతో మంచి హిట్ అందుకున్న తిరువీర్ హీరోగా నటించిన మరో కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. టీనా శ్రావ్య హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ కథ, దర్శకత్వం వహించారు. నవంబర్ 07న థియేటర్లలో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీని రిలీజ్ కానుంది.
అయితే, రిలీజ్‌కు రెండు రోజుల ముందే అంటే నవంబర్ 05న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ప్రీమియర్ షోలు వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
రమేష్ (తిరువీర్) పెళ్లిళ్లు, ఫంక్షన్స్‌కు ఫొటోలు, వీడియోలు తీస్తూ ఫొటోస్టూడియో నడుపుతుంటాడు. పంచాయతీ సెక్రటరీ హేమ (టీనా శ్రావ్య)ను ప్రేమిస్తాడు.హేమ కూడా రమేష్‌ను ప్రేమించినా ఒకరినొకరు బయటపడరు. ఈ క్రమంలో తన పెళ్లికి ప్రీ వెడ్డింగ్ షూట్‌ను గ్రాండ్‌గా తీయాలని పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఆనంద్ (నరేంద్ర రవి) రమేష్‌ను కలుస్తాడు.
ఆనంద్-సౌందర్య (యామిని)ల ప్రీ వెడ్డింగ్ షూట్‌ను చాలా రిచ్‌గా తీస్తాడు రమేష్. ఆ ఫుటేజ్ అంత ఉన్న చిప్‌ను కాపీ చేయమని తన దగ్గర పనిచేసే అబ్బాయి (రోహన్ రాయ్)కి ఇస్తాడు రమేష్. కానీ, అతను ఆ చిప్‌ను పొగొడతాడు. ఈ విషయం ఆనంద్‌కు తెలిస్తే తనను ఏమైనా చేస్తాడని రమేష్ భయపడతాడు. ఆనంద్ ఎన్నిసార్లు ఫొటోలు అడిగిన తప్పించుకుంటాడు.
ఈ సమస్య నుంచి తప్పించుకోడానికి ఆనంద్ పెళ్లినే చెడగొట్టాలని హేమతో కలిసి రమేష్ ప్లాన్ వేస్తాడు. కానీ, అంతలోనే తన పెళ్లి ఆగిపోయిందని ఆనంద్ వచ్చి ట్విస్ట్ ఇస్తాడు.
మూవీ ట్విస్టులు
అసలు ఆనంద్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? చిప్ ఎలా మిస్ అయింది? రమేష్-హేమ ప్రేమాయణం ఎటు సాగింది? ఆనంద్-సౌందర్యల పెళ్లి జరిగిందా చివరికి ఏమైంది? వంటి విషయాలు తెలియాలంటే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
పెళ్లి ఫొటోలు లేదా ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోలు మిస్ అవ్వడం అనేది నిజ జీవితంలో చాలా చోట్ల జరుగుతుంది. ఈ రియల్ పాయింట్‌తో కామెడీ, ఎమోషన్స్‌తో తెరకెక్కించిన సినిమానే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. సినిమా అంత పల్లెటూరులో సాగుతుంది. ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, రమేష్-హేమ లవ్ ట్రాక్, కామెడీ సీన్స్‌తో అలా వెళ్లిపోతుంటుంది.
ఆనంద్ పెళ్లి, వెడ్డింగ్ షూట్ ఆఫర్ రావడం, ప్రీ వెడ్డింగ్ షూట్‌ను రమేష్ చేసే తీరు, ఆ ఫొటోలు ఉన్న చిప్ పోవడం వంటి సీన్లతో బాగానే సాగుతుంది సినిమా. అయితే, ఇదంతా తెలిసిన కథలా అనిపిస్తుంది. ఆనంద్ పెళ్లి చెడగొట్టాలని రమేష్ ప్లాన్ చేస్తుంటే తనే వచ్చి మ్యారేజ్ ఆగిపోయిందనడం సినిమాలో పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు.
ఇక సెకండాఫ్‌లో ఎమోషన్స్‌కు పెద్ద పీట వేశారు. నటీనటులు చెప్పే డైలాగ్స్ వాళ్ల ఎమోషన్ నిజమే కదా అనిపిస్తుంది. పెళ్లి, దాంతో వచ్చే జ్ఞాపకాలు, అనుభూతులు అన్ని ఫొటోగ్రాఫర్ చేతిలోనే ఉంటాయి. అలాంటి ఫొటోలు మిస్ అవడం, తదితర విషయాలతో వచ్చే డైలాగ్స్, ఎమోషన్స్ బాగా రక్తి కట్టించాయి. ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేలా ఉన్నాయి.
క్లైమాక్స్ అలా
ఎమోషనల్ సీన్స్ తర్వాత మళ్లీ కామెడీతో ఎంటర్‌టైన్ చేశారు. క్లైమాక్స్‌ను కూడా మంచి కామెడీతో ముగించారు. ఇక తిరువీర్ అమాయకంగా, భయపడే పాత్రలో ఒదిగిపోయాడు. టీనా శ్రావ్య క్యూట్‌గా అందంగా అట్రాక్ట్ చేసింది. నరేంద్ర రవి నటన సినిమాకు ప్లస్ అయింది. కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లో బాగా చేశాడు. ఈ సినిమాతో అతనికి మంచి పేరు వస్తుంది.
చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ నటన పర్వాలేదు. మిగతా పాత్రలంతా పరిధి మేర మెప్పించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీకాకుళంలో తెరకెక్కించిన విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. కొన్ని సీన్స్‌కు కత్తెర పడాల్సింది. సంగీతం పర్వాలేదు. పాటలు బాగున్నాయి. రచయితగా, దర్శకుడిగా రాహుల్ శ్రీనివాస్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.
ఫైనల్‌గా చెప్పాలంటే
సాంకేతిక నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాతల ఖర్చు తెలుస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే పాయింట్ ఉన్న సినిమా ఇది. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూస్తే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నవ్వించి మెప్పిస్తుంది.

E-Paper












