...
...
Next Story

The India Story Review: ది ఇండియా స్టోరీ రివ్యూ- విషం లాంటి తిండిపై పోరాటం- కాజల్ అగర్వాల్ కోర్ట్ డ్రామా ఎలా ఉందంటే?

The India Story Review And Rating In Telugu: కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కోర్ట్ లీగల్ డ్రామా 'ది ఇండియా స్టోరీ'. ఆహార కల్తీ, క్రిమిసంహారకాల నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా జూలై 24న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి ది ఇండియా స్టోరీ రివ్యూలో చూద్దాం.

Published on: Jul 25, 2026, 16:35:46 IST
Advertisement

The India Story Review And Rating In Telugu: ఆహార పదార్థాల్లో కల్తీ, పంట పొలాల్లో పరిమితికి మించి క్రిమిసంహారకాల వాడకం.. ప్రస్తుతం సమాజాన్ని వేధిస్తున్న తీవ్రమైన సమస్యల్లో ఇది ఒకటి. ఇలాంటి సామాజిక ప్రాధాన్యత ఉన్న అంశంతో తెరకెక్కిన సినిమా 'ది ఇండియా స్టోరీ'.

ది ఇండియా స్టోరీ రివ్యూ- విషం లాంటి తిండిపై పోరాటం- కాజల్ అగర్వాల్ కోర్ట్ డ్రామా ఎలా ఉందంటే?
ది ఇండియా స్టోరీ రివ్యూ- విషం లాంటి తిండిపై పోరాటం- కాజల్ అగర్వాల్ కోర్ట్ డ్రామా ఎలా ఉందంటే?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే ముఖ్య పాత్రల్లో చేతన్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ కోర్ట్ లీగల్ డ్రామా జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సామాజిక స్పృహ కలిగించే ప్రయత్నంతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ది ఇండియా స్టోరీ రివ్యూలో తెలుసుకుందాం.

కథేంటంటే?

యోగేష్ (శ్రేయాస్ తల్పడే) అనే తండ్రి తన చిన్నారి కూతురిని క్యాన్సర్ వ్యాధితో పోగొట్టుకుంటాడు. పంటల్లో వాడే క్రిమిసంహారకాలు, ఆహారంలో కల్తీ వల్లే తన బిడ్డకు ఈ ఘోరం జరిగిందని భావించిన ఆయన, న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతాడు. ఈ పోరాటంలో అడ్వకేట్ అర్చన (కాజల్ అగర్వాల్) ఆయన తరఫున వకీలు పాత్ర పోషిస్తుంది. ఒక సామాన్య తండ్రి వ్యవస్థపై చేసిన ఈ న్యాయపోరాటం చివరకు ఏ మలుపు తిరిగింది? కోర్టులో కల్తీదారులను వారు ఎలా నిలదీశారనేదే 'ది ఇండియా స్టోరీ' కథ.

విశ్లేషణ:

మంచి ఉద్దేశంతో ఎంచుకున్న కథ ఇది. అయితే, సమాజంలోని లోటుపాట్లను తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు చేతన్ డీకే తడబడ్డారు. సినిమా మొదటి భాగం మొత్తం ఏదో సోషల్ మీడియా సందేశాన్ని సుదీర్ఘంగా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కోర్టు గది సన్నివేశాల్లో కనీసం లాజిక్ కనిపించదు.

ఇంటర్వెల్ తర్వాత సినిమా కథనం పూర్తిగా దారి తప్పిన అనుభూతి కలుగుతుంది. మొదటి భాగంలో లేవనెత్తిన ఆహార కల్తీ, క్రిమిసంహారకాల అంశం పక్కకు పోయి, కేవలం ఎమోషనల్ డ్రామాగా మారిపోతుంది. పాప మరణానికి కేవలం ఆ రసాయనాలే కారణమని రుజువు చేసే సీన్లు బలంగా లేవు. క్యాన్సర్ బాధితుల వేదనను చూపించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అసలు సమస్య పక్కదారి పట్టింది.

రోడ్డు పక్కన అమ్మే టీ తాగడానికి నిరాకరించి, ప్యాక్ చేసిన నీళ్లను కాజల్ పాత్ర ఎంచుకోగానే పక్కనున్న వారు కూడా టీ కప్పును పక్కన పడేసే సన్నివేశం చూస్తే.. అనవసర భయాందోళనలను వ్యాప్తి చేసేలా ఉంది. నిజానికి ఇలాంటి సమస్యలపై సినిమా తీస్తున్నప్పుడు లోతైన పరిశోధన, బాధ్యతాయుతమైన కథనం చాలా అవసరం.

ఎవరెలా చేశారంటే?

నటీనటుల విషయానికి వస్తే, శ్రేయాస్ తల్పడే తన పాత్ర పరిధి మేర చక్కగా నటించారు. బిడ్డను కోల్పోయిన తండ్రిగా ఆయన వేదన ఆకట్టుకుంటుంది. కాజల్ అగర్వాల్ ఎమోషనల్ సీన్లలో పరవాలేదనిపించినా, న్యాయవాదిగా కోర్టు గది సన్నివేశాల్లో తేలిపోయారు. ఒక సీనియర్ అడ్వకేట్‌కు ఉండాల్సిన గాంభీర్యం ఆమె పాత్రలో కనిపించలేదు.

"సమాజానికి అత్యంత కీలకమైన అంశాన్ని ఎంచుకున్నప్పటికీ, కేవలం ఉద్వేగాలను వాడుకోవాలనే తాపత్రయంలో దర్శకుడు కథనాన్ని దారితప్పించారు" అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫైనల్‌గా చెప్పాలంటే?

మొత్తంగా చెప్పాలంటే, 'ది ఇండియా స్టోరీ' తీవ్రంగా చర్చించాల్సిన విషయాన్నే ఎంచుకున్నప్పటికీ, ఆకట్టుకునేలా తీయడంలో విఫలమైంది. ఆలోచింపజేసే పరిశోధనాత్మక కథనానికి బదులు, భయాన్ని పంపే ప్రయత్నం చేయడంతో సినిమా సాధారణ స్థాయికే పరిమితమైంది.

రేటింగ్: 2.5/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe