The Red Bag Review: ది రెడ్ బ్యాగ్ రివ్యూ- చీకటి ప్రపంచంపై వనితల పోరాటం-ముగ్గురు హీరోయిన్ల రివేంజ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
The Red Bag Review And Rating In Telugu: రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించిన ది రెడ్ బ్యాగ్ నేడు (ఆగస్ట్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోడ్రన్ పాత్రలు, బోల్డ్ లుక్స్ వెనుక ఉన్న ఒక బలమైన మాతృత్వ ఎమోషన్, స్త్రీ శక్తి కథనంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఎలా ఉందో నేటి ది రెడ్ బ్యాగ్ రివ్యూలో చూద్దాం.
The Red Bag Review In Telugu And Rating:

టైటిల్: ది రెడ్ బ్యాగ్
నటీనటులు: రాధ్య, మోనిక, ఆకాంక్ష, రాశి, కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి తదితరులు
దర్శకత్వం: రవి కుమార్ సీరపు
సినిమాటోగ్రఫీ: ప్రియేష్ గురుస్వామి
ఎడిటింగ్: శివ శర్వాణి
సంగీతం: శేఖర్ మోపూరి
నిర్మాత: హరికృష్ణ సోమిశెట్టి
విడుదల తేది: ఆగస్ట్ 21, 2026
ముగ్గురు హీరోయిన్లు రాధ్య, మోనిక, ఆకాంక్ష ప్రధాన పాత్రలో సీనియర్ హీరోయిన్ రాశి కీ రోల్‌లో నటించిన తెలుగు క్రైమ్ మిస్టరీ సస్పెన్స్ రివేంజ్ థ్రిల్లర్ సినిమా ది రెడ్ బ్యాగ్. రవి కుమార్ సీరపు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి ఈ రివేంజ్ డ్రామా మూవీ ఎలా ఉందో నేటి ది రెడ్ బ్యాగ్ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
అరిజోనాలోని ఒక పబ్‌లో విన్ని (రాధ్య) డ్యాన్సర్‌గా పనిచేస్తుంటుంది. ఆ పబ్ ఓనర్ మైక్ (కబీర్ సింగ్) అత్యంత క్రూరుడు. ఒక ద్వీపంలో భారీ రిసార్ట్, పబ్ ప్రారంభించాలనే ఆశయంతో అమ్మాయిల ద్వారా అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో ఈషా, ఈవ్, బేబ్ అనే ముగ్గురు భారతీయ యువతులు కూడా ఆ చీకటి ప్రపంచంలోకి అడుగుపెడతారు.
అసలు విన్ని ఈ రొంపిలోకి ఎలా వచ్చింది? ఆ ముగ్గురు అమ్మాయిలు భారతదేశం నుంచి అరిజోనాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మైక్ బంధీగా మారిన ఈ నలుగురు అమ్మాయిలు అతని బారి నుంచి ఎలా బయటపడ్డారు? ఇందులో 'రెడ్ బ్యాగ్' పోషించిన పాత్ర ఏమిటి? చివరికి ఆ నలుగురు తమ లక్ష్యాలను సాధించారా లేదా అనేదే 'ది రెడ్ బ్యాగ్' కథ.
విశ్లేషణ:
క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో సాగే రివేంజ్ డ్రామా సినిమా ఇది. రవి కుమార్ సీరపు పాత కథాంశాన్నే ఎంచుకున్నప్పటికీ, నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా అత్యంత స్టైలిష్‌గా తెరకెక్కించారు. గ్లామర్ హంగులు చూసి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు, బయటకు వెళ్లేటప్పుడు ఒక బలమైన ఎమోషన్‌తో వెళ్తారు.
మోడ్రన్ శైలిలోనే 'స్త్రీ శక్తి', 'అమ్మ గొప్పదనాన్ని' చాటిచెప్పేలా దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ఆకట్టుకుంటుంది. సినిమా ప్రారంభం కొంత నెమ్మదిగా సాగినప్పటికీ, పబ్ వాతావరణం, అక్కడి అమ్మాయిల అక్రమ కార్యకలాపాలతో కథ ముందుకుసాగుతుంది.
ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ఇంట్రెస్టింగ్‌గా
ముగ్గురు అమ్మాయిల ఫ్లాష్‌బ్యాక్ ఎంట్రీతో కథ ఊపందుకుంటుంది. ప్రస్తుతం, ఫ్లాష్‌బ్యాక్ మధ్య సాగే 'బ్యాక్ అండ్ ఫోర్త్' స్క్రీన్‌ప్లే ఆసక్తిని కలిగిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.
సెకండాఫ్‌లో ఛేజింగ్ సీన్లు, యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ సన్నివేశాలు మాతృత్వపు విలువలని ఎంతో సున్నితంగా ఆవిష్కరించారు డైరెక్టర్. అడ్డదారి తొక్కిన ఒక తల్లి, ఆమెను సమాజం చూసే విధానం వంటి అంశాలను దర్శకుడు హృదయానికి హత్తుకునేలా చూపించారు. సమాజంలో రాబిన్ హుడ్‌లా మారి నలుగురు ధీర వనితలు చేసిన ఈ పోరాటంగా సినిమాను మలిచారు.
నిర్మాణ విలువలు
సాంకేతిక పరంగా చూస్తే ది రెడ్ బ్యాగ్ సినిమాను ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించారు. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. కెమెరా వర్క్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. పబ్ సాంగ్‌తో పాటు రీ రికార్డింగ్ (BGM) సన్నివేశాలకు ప్రాణం పోసింది. నిర్మాణ విలువలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండ్‌గా ఉన్నాయి.
ఎవరెలా చేశారంటే?
విన్ని పాత్రలో రాధ్య తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించింది. మిగతా ముగ్గురు హీరోయిన్లు కూడా తెరపై అత్యంత గ్లామరస్‌గా కనిపించడమే కాకుండా, ఎమోషనల్ సన్నివేశాల్లో సత్తా చాటారు. విలన్‌గా కబీర్ సింగ్ తన మార్కు విలనిజంతో ఆకట్టుకోగా, ప్రసాద్ బెహరా కామెడీ థియేటర్‌లో మంచి నవ్వులు పూయిస్తుంది.
ఫైనల్‌గా చెప్పాలంటే?
గాయత్రి భార్గవి సీన్లు భావోద్వేగానికి గురిచేస్తాయి. సీనియర్ హీరోయిన్ రాశి పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ కథపై బలమైన ముద్ర వేస్తుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు. ఫైనల్‌గా చెప్పాలంటే గ్లామర్ హంగులతో.. క్రైమ్, సస్పెన్స్, రివేంజ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి స్త్రీ గొప్పదనాన్ని చెప్పిన ది రెడ్ బ్యాగ్ సినిమాపై ఓ లుక్కేయవచ్చు.
రేటింగ్: 2.75/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


