Vamsi Paidipally: మీరు ఎదుర్కొన్న ఒత్తిడి, త్యాగాలు నాకు తెలుసు సర్- సల్మాన్ ఖాన్‌పై డైరెక్టర్ వంశీ పైడిపల్లి కామెంట్స్
Vamsi Paidipally About Salman Khan Over Maatrubhumi Trailer Release: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ఆర్మీ బ్యాక్‌డ్రాప్ చిత్రం మాతృభూమి ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా కోసం సల్మాన్ పడిన శ్రమ, ఎదుర్కొన్న ఒత్తిడి తనకు తెలుసని దర్శకుడు వంశీ పైడిపల్లి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Vamsi Paidipally About Salman Khan Over Maatrubhumi Trailer Release: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భారత ఆర్మీ అధికారిగా నటిస్తున్న భారీ చిత్రం 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన మాతృభూమి ట్రైలర్‌ను మంగళవారం (నవంబర్ 10) సాయంత్రం సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

రేపు చేసే పని నేడే చేయి
"రేపు చేసే పని నేడే చేయి.. నేడు చేసే పని ఇప్పుడే చేయి" అంటూ సరదా క్యాప్షన్ జోడించి అభిమానులతో ట్రైలర్‌ను పంచుకున్నారు. ముంబైలో కొద్దిరోజుల క్రితం జరిగిన లాంచ్ ఈవెంట్ తర్వాత అధికారికంగా డిజిటల్ మీడియాలో విడుదలైన ఈ మాతృభూమి ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
సల్మాన్ శ్రమ నాకు తెలుసు: వంశీ పైడిపల్లి
సల్మాన్ ఖాన్ మాతృభూమి ట్రైలర్‌పై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి స్పందించిన తీరు అందరి దృష్టిని ఆకట్టుకుంది. సల్మాన్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ, ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ పడిన శ్రమను కొనియాడారు.
"ఈ సినిమా కోసం మీరు చేసిన త్యాగాలు, ఎదుర్కొన్న ఒత్తిడి నాకు వ్యక్తిగతంగా తెలుసు సర్. మీ పట్టుదల, సినిమా పట్ల ఉన్న నిబద్ధత ప్రతీ దృశ్యంలోనూ కనిపిస్తున్నాయి. మీకు దక్కాల్సిన విజయం, ప్రశాంతత లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని వంశీ పైడిపల్లి పేర్కొన్నారు.
దర్శకుడు అపూర్వ లఖియా, కథానాయిక చిత్రాంగదా సింగ్ సహా చిత్ర బృందానికి వంశీ పైడిపల్లి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 'SVC63'లో నయనతార కథానాయికగా నటిస్తుండగా, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ కలయిక కారణంగానే సల్మాన్ 'మాతృభూమి' చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.
'గల్వాన్' నుంచి 'మాతృభూమి' వరకు..
ఇదిలా ఉంటే మాతృభూమి చిత్రం వెనుక ఒక ఆసక్తికర నేపథ్యం ఉంది. మొదట్లో ఈ చిత్రాన్ని 2020-21 నాటి భారత్-చైనా సరిహద్దు ఘర్షణల ఆధారంగా 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' పేరుతో రూపొందించాలనుకున్నారు.
గల్వాన్ లోయ పోరాటంలో వీరమరణం పొందిన తెలంగాణ సూర్యపేటకు చెందిన కల్నల్ బి.సంతోష్ బాబు పాత్ర ఆధారంగా సల్మాన్ నటిస్తున్నారని ప్రచారం సాగింది. గతేడాదే షూటింగ్ కూడా ప్రారంభించారు. అయితే కొన్ని కారణాల వల్ల స్క్రిప్ట్‌లో మార్పులు చేసి, టైటిల్‌ను 'మాతృభూమి'గా మారుస్తూ రీషూట్ చేశారు.
వివాదాలపై సల్మాన్ ఖాన్ స్పష్టత
స్క్రిప్ట్ మార్పులు, చైనా వ్యతిరేక ప్రచారంపై వస్తున్న కథనాలపై ముంబై ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ స్పందించారు. "మేము చైనాకు వ్యతిరేకంగా సినిమా తీశామని లేదా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి స్క్రిప్ట్ మార్పించిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే" అని సల్మాన్ ఖాన్ తేల్చిచెప్పారు.
"సరిహద్దుల్లో పోరాడే సైనికులు, వారి కుటుంబాలు ఎదుర్కొనే పరిస్థితులను ఈ సినిమాలో చూపించాం. దేశ రక్షణే ధ్యేయంగా జీవించే సైనికుల త్యాగాలకు ఈ చిత్రం ఒక నిదర్శనం. ప్రతికూల వాతావరణంలో సైతం మన సరిహద్దులను ఎలా కాపాడుకుంటారో కళ్లకు కట్టినట్లు చూపించాం" అని ఆయన వివరించారు.
డిసెంబర్ 4న మాతృభూమి విడుదల
చిత్రాంగదా సింగ్, అనూప్ విక్రమ్ షాహి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ దేశభక్తి చిత్రం డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. సైనిక దుస్తుల్లో సల్మాన్ ఖాన్ లుక్ మెప్పిస్తుండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


