Sowcar Janaki: చిత్రసీమలో మరో విషాదం- దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత- గర్భంతోనే పరీక్షలు రాయడం నుంచి సీరియల్స్ వరకు!

Veteran Actress Sowcar Janaki Passes Away: భారతీయ సినీ రంగానికి ఎనలేని సేవలు అందించిన దిగ్గజ నటి, పద్మశ్రీ షావుకారు జానకి (94) చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వందల సినిమాల్లో సహజ నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె మృతి పట్ల సినీ లోకం సంతాపం వ్యక్తం చేస్తోంది.

Published on: Aug 21, 2026, 15:21:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Veteran Actress Sowcar Janaki Passes Away At 94 Age: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మరోసారి తీరని లోటు ఏర్పడింది. దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన గొప్ప నటి, పద్మశ్రీ షావుకారు జానకి (94) ఇకలేరు.

చిత్రసీమలో మరో విషాదం- దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత- గర్భంతోనే పరీక్షలు రాయడం నుంచి సీరియల్స్ వరకు!
చిత్రసీమలో మరో విషాదం- దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత- గర్భంతోనే పరీక్షలు రాయడం నుంచి సీరియల్స్ వరకు!

తీవ్ర అనారోగ్యంతో మృతి

వయోభారంతో పాటు తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని ఆళ్వార్‌పేట కావేరి ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న దిగ్గజ నటి షావుకారు జానకి శుక్రవారం (ఆగస్ట్ 21) మధ్యాహ్నం 1:59 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) అధ్యక్షుడు నాజర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో సినీ లోకమంతా దిగ్భ్రాంతికి గురైంది.

రాజమండ్రి నుంచి 'ఆకాశవాణి' ద్వారా వెండితెరకు!

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో సంకరమంచి జానకిగా జన్మించిన ఆమె జీవిత ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. చిన్నతనంలోనే వివాహం చేసుకున్న జానకి గర్భవతిగా ఉన్న సమయంలోనే మెట్రిక్యులేషన్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత గౌహతి విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకున్నారు.

రేడియో జాకీగా కెరీర్ ప్రారంభం

మద్రాస్ ఆకాశవాణిలో రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన జానకి.. ఎల్‌వీ ప్రసాద్ దర్శకత్వంలో 1950లో వచ్చిన 'షావుకారు' చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. తొలి చిత్రమే సంచలన విజయం సాధించడంతో ఆ సినిమా పేరే ఆమె ఇంటిపేరుగా మారి 'షావుకారు జానకి'గా గుర్తింపు తెచ్చుకున్నారు.

నాజర్ అధికారిక ప్రకటన

"లెజెండరీ స్టార్ షావుకారు జానకి మరణం తీరని లోటు. ఆమె భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం తేనాంపేటలోని సెంటోఫ్ రోడ్డు నివాసంలో ఉంచుతాం" అని నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ పేర్కొన్నారు.

బాషల సరిహద్దులు దాటిన నటనా ప్రతిభ

తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో షావుకారు జానకి విలక్షణమైన పాత్రలు పోషించారు. 1952లో 'వలయాపతి' చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టిన ఆమె, 1959లో కన్నడ విలక్షణ నటుడు రాజ్ కుమార్‌తో కలిసి భారతదేశపు తొలి పాన్-ఇండియా చిత్రంగా భావించే 'మహిషాసుర మర్దిని'లో నటించారు.

బుల్లితెర సీరియల్స్‌లోనూ షావుకారు జానకి

ఆమె చెల్లెలు కృష్ణకుమారి కూడా తెలుగులో గొప్ప నటిగా వెలుగొందడం విశేషం. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఆమె, బుల్లితెరపై దూరదర్శన్ నాటి నుంచీ జీ తెలుగులో వచ్చిన 'వరుధినీ పరిణయం' వరకు అలరించారు.

చివరిగా నందినిరెడ్డి సినిమాలో

ఇటీవల బీవీ నందిని రెడ్డి (మా ఇంటి బంగారం డైరెక్టర్) దర్శకత్వం వహించిన 'అన్నీ మంచి శకునములే' (2023) చిత్రంలో చివరిసారిగా కనిపించారు షావుకారు జానకి. చిత్రసీమకు ఆమె చేసిన అసమాన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 2022లో 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరవించింది.

సౌత్ సినీ పరిశ్రమల నుంచి సంతాపం

షావుకారు జానకి భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం సిద్ధం చేశారు. జానకి మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అలాగే, షావుకారు జానకి కుటుంబ సభ్యులకు సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు సానుభూతిని తెలియజేస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More