...
...
Next Story

సమోసా చూస్తే ఆగలేకపోతున్నారా? వైరల్ ‘10-సెకండ్ల టెస్ట్’ చెప్పే నిజాలివే.. డాక్టర్ గారి మాట ఇది

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న '10-సెకండ్ల సమోసా టెస్ట్' ఆహారపు అలవాట్లపై ఆసక్తికర విషయాలను వెల్లడిస్తోంది. నిత్యం మనం తీసుకునే సరైన నిర్ణయాలే మన దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని శాసిస్తాయని యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఫిజీషియన్, ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ హరికిషన్ బూరుగు ఈ కథనంలో వివరించారు.

Published on: Jul 11, 2026 11:36 AM IST
Advertisement

ఆఫీస్ కేఫ్‌లోకి వెళ్లారు.. చక్కగా బ్లాక్ కాఫీ ఆర్డర్ చేద్దామనుకునే లోపే మీ కళ్ల ముందు వేడివేడి సమోసాల ప్లేట్ ప్రత్యక్షమైంది. ఆ సమోసాను వదిలేసి, కేవలం కాఫీ మాత్రమే తీసుకుని అక్కడ నుంచి బయటకు వచ్చేయగలరా? ప్రస్తుతం సోషల్ మీడియాలో '10-సెకండ్ల సమోసా టెస్ట్' (10-second samosa test) పేరుతో ఒక ఛాలెంజ్ తెగ వైరల్ అవుతోంది. ఈ ఛాలెంజ్ ఉద్దేశం మీకు ఇష్టమైన ఆహారాన్ని జీవితాంతం వదిలేయమని చెప్పడం కాదు. నిరంతరం సరైన ఆహార ఎంపికలు చేసుకోవడమే దీని వెనుక ఉన్న అసలు రహస్యం.

సమోసా చూస్తే ఆగలేకపోతున్నారా? వైరల్ ‘10-సెకండ్ల టెస్ట్’ చెప్పే నిజాలివే
సమోసా చూస్తే ఆగలేకపోతున్నారా? వైరల్ ‘10-సెకండ్ల టెస్ట్’ చెప్పే నిజాలివే

రోజూవారీ అలవాట్లే మన దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. అప్పుడప్పుడు సమోసా తింటే పెద్దగా నష్టం జరగకపోవచ్చు. కానీ, నూనెలో వేయించిన, ప్రాసెస్ చేసిన, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తింటే మాత్రం ఊబకాయం, మధుమేహం, హై కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. అరుదుగా ఏం తింటున్నామనే దానికంటే.. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఏం తింటున్నామనేదే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.

ఆ ప్రలోభాన్ని తట్టుకోవడం ఎందుకు కష్టం?

జంక్ ఫుడ్‌కు 'నో' చెప్పడం అనేది కేవలం మనోబలానికి (Willpower) సంబంధించిన విషయం మాత్రమే కాదు. మన ఆహారపు అలవాట్లను అనేక ఇతర అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. వాటిలో కొన్ని:

  • సమయం దాటిపోయాక భోజనం చేయడం వల్ల వచ్చే తీవ్రమైన ఆకలి
  • మానసిక ఒత్తిడి లేదా భావోద్వేగాలు
  • సరిగ్గా నిద్ర లేకపోవడం
  • ఆఫీసులో బిజీ షెడ్యూల్స్
  • అన్‌హెల్తీ స్నాక్స్ సులభంగా అందుబాటులో ఉండటం

ఒత్తిడితో కూడిన రోజంతా గడిపిన తర్వాత లేదా సరైన ఆహారం తీసుకోనప్పుడు, ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాలు తినాలనిపించడం మానవ సహజం. దీనికి గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బదులుగా ఆరోగ్యకరమైన ఎంపికలు సులభతరం అయ్యేలా అలవాట్లను మార్చుకోవాలి.

సరైన ఆహార ఎంపికల కోసం చిన్న చిట్కాలు

అప్పుడప్పుడు నచ్చిన ఫుడ్ తినడం తప్పు కాదు. కానీ, బయట దొరికే డీప్-ఫ్రైడ్ స్నాక్స్‌ను క్రమం తప్పకుండా తినడమే అసలైన సమస్య. వాడిన నూనెనే మళ్లీ మళ్లీ మరిగించడం వల్ల వాటిలో హానికరమైన 'ట్రాన్స్ ఫ్యాట్స్' (Trans fats) ఏర్పడతాయి. రోజూ వేపుళ్లు, స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి:

  • బరువు విపరీతంగా పెరగడం
  • శరీరంలో ఎల్‌డీఎల్ (LDL - చెడు కొలెస్ట్రాల్) పెరగడం
  • ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలు ఎక్కువవడం
  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడటం
  • రక్తపోటు (High BP) పెరగడం
  • హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరగడం

ఇలాంటి ఆహారాలలో గ్లైసిమిక్ ఇండెక్స్ (Glycaemic Index) ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి, ఆ తర్వాత అంతే వేగంగా పడిపోతాయి. ఫలితంగా తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుంది.

భావోద్వేగాలతో ముడిపడిన ఆకలి

కొన్నిసార్లు మనకు నిజంగా ఆకలి వేయకపోయినా ఏదైనా తినాలనిపిస్తుంది. ఒత్తిడి, బోర్ కొట్టడం, అలసట వంటివి 'ఎమోషనల్ ఈటింగ్‌'కు దారితీస్తాయి. వేయించిన స్నాక్స్ తినే ముందు ఒక్క క్షణం ఆగి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు అడగాలి:

"నాకు నిజంగానే ఆకలిగా ఉందా? లేక అలవాటుగా, ఒత్తిడి వల్ల లేదా బోర్ కొట్టి తింటున్నానా?" అని ప్రశ్నించుకోవాలి. చాలా సందర్భాల్లో ఒక గ్లాసు నీళ్లు తాగడం, కాసేపు నడవడం లేదా చిన్న బ్రేక్ తీసుకోవడం వల్ల ఆ కోరికలు (Cravings) తగ్గిపోతాయి.

పర్‌ఫెక్షన్ కాదు.. సమతుల్యత ముఖ్యం

ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే మీకు ఇష్టమైన వంటకాలను పూర్తిగా దూరం పెట్టడం కాదు. ఇక్కడ కఠినమైన నియంత్రణ కంటే సమతుల్యత (Balance) ముఖ్యం. రోజూ హెల్తీ డైట్ పాటిస్తూ, అప్పుడప్పుడు సమోసా లేదా నచ్చిన స్నాక్ తినడంలో ఎలాంటి తప్పు లేదు. మనం రోజూ తీసుకునే చిన్న చిన్న సరైన నిర్ణయాలే మెటబాలిక్ ఆరోగ్యాన్ని, గుండె పనితీరును మెరుగుపరిచి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

ఈ వ్యాసాన్ని అందించిన వైద్య నిపుణులు

- డాక్టర్ హరి కిషన్ బూరుగు,

కన్సల్టెంట్ ఫిజీషియన్ & ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్,

యశోద హాస్పిటల్స్, హైదరాబాద్.

డాక్టర్ హరి కిషన్ బూరుగు, కన్సల్టెంట్ ఫిజీషియన్ & ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్
 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON