Anne Hathaway : 43ఏళ్లకు మూడోసారి గర్భం దాల్చిన హాలీవుడ్ నటి! ఇంత లేటు వయసులో ప్రెగ్నెన్సీ.. సేఫేనా?

హాలీవుడ్ నటి అన్నే హాత్వే 43 ఏళ్ల వయసులో తన మూడో గర్భధారణను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మారుతున్న కాలంలో 35 నుంచి 40 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చడం వెనుక ఉన్న సామాజిక, వైద్యపరమైన సత్యాలు, ముప్పులు మరియు నిపుణుల సూచనలు మీకోసం.

Published on: Jun 20, 2026, 14:03:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆస్కార్ అవార్డు గ్రహీత, 43 ఏళ్ల హాలీవుడ్ స్టార్ నటి అన్నే హాత్వే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో బార్బరా లూయిస్ పాడిన ‘బేబీ, ఐ యామ్ యువర్స్’ అనే పాటకు డ్యాన్స్ చేస్తూ, తన బేబీ బంప్‌ను చూపిస్తూ చిరునవ్వులు చిందించారు. తన భర్త ఆడమ్ షుల్మన్‌తో కలిసి మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆమె ప్రకటించిన ఈ విధానం కేవలం ఒక సాధారణ సెలబ్రిటీ అప్‌డేట్ మాత్రమే కాదు. ఇది మహిళల సంతానోత్పత్తి వయసు పరిమితులపై సమాజంలో ఉన్న పాత ఆలోచనలను తిరగరాసే ఒక కొత్త ట్రెండ్‌ను ప్రతిబింబిస్తోంది!

43ఏళ్లకు మూడోసారి గర్భం దాల్చిన అన్నే హాత్వే..
43ఏళ్లకు మూడోసారి గర్భం దాల్చిన అన్నే హాత్వే..

జూన్ 19న వచ్చిన ఈ అన్నే హాత్వే ప్రెగ్నెన్సీ ప్రకటన ప్రస్తుత సామాజిక మార్పులకు, ఆధునిక వైద్య సాంకేతికతకు ఒక అద్దం పడుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నటీమణులు కత్రినా కైఫ్, సోనమ్ కపూర్ వంటి ఎందరో ప్రముఖ మహిళలు తమ 35 లేదా 40 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చి విజయవంతంగా పిల్లలకు జన్మనిచ్చారు. ఇప్పుడు అన్నే హాత్వే కూడా అదే బాటలో పయనిస్తున్నారు.

సెలబ్రిటీలు లేటు వయసులో పిల్లలను కనడాన్ని మీడియా ఒక గ్లామరస్ హెడ్‌లైన్‌గా చూపిస్తున్నప్పటికీ, దీని వెనుక ఒక బలమైన సామాజిక మార్పు దాగి ఉంది! యూఎస్ సెన్సస్ బ్యూరో గణాంకాల ప్రకారం.. 20 ఏళ్ల ప్రాయంలో ఉన్న మహిళల్లో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతుండగా, 35 నుంచి 44 ఏళ్ల వయసున్న మహిళల్లో ప్రసవాల రేటు నిలకడగా పెరుగుతోంది.

గతంలో వైద్య పరిభాషలో 35 ఏళ్లు దాటిన గర్భధారణను ‘జెరియాట్రిక్ ప్రెగ్నెన్సీ’ (వృద్ధాప్య గర్భధారణ) అని కాస్త కఠినంగా పిలిచేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో ఇది ఒక సాధారణ విషయంగా మారిపోతోంది. ఈ విషయంలో సమాజంలో ఉన్న అపోహలు, విమర్శలు తగ్గుతున్నప్పటికీ, దీని వెనుక ఉన్న వైద్యపరమైన వాస్తవాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇంతకీ లేటు వయసులో గర్భం దాల్చడం నిజంగా సురక్షితమేనా? లేక ఆధునిక వైద్య సాంకేతికత ఈ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేలా మనల్ని సిద్ధం చేసిందా?

మారుతున్న జీవన కాలక్రమం..

చరిత్రను పరిశీలిస్తే, వైద్య నిపుణులు ఒక మహిళకు 35 ఏళ్లు నిండటాన్ని సంతానోత్పత్తి సామర్థ్యం వేగంగా తగ్గిపోయే ఒక ప్రమాదకరమైన సరిహద్దుగా భావించేవారు. కానీ వాస్తవానికి ఈ సామర్థ్యం ఒక్కసారిగా కాకుండా చాలా నెమ్మదిగా తగ్గుతుంది.

“ఇటీవలి కాలంలో మహిళలు తమ జీవితంలో ఆలస్యంగా పిల్లలను కనడానికి మొగ్గు చూపుతున్నారు. కెరీర్‌లో స్థిరపడటం, ఆర్థిక భద్రత సాధించడం లేదా మానసికంగా సిద్ధపడిన తర్వాతే కుటుంబ జీవితాన్ని ప్రారంభించాలని భావించడమే దీనికి ప్రధాన కారణం,” అని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్ ప్రసూతి, గైనకాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నీలం సూరి పేర్కొన్నారు.

“జీవితంలో ఆలస్యంగా గర్భం దాల్చడం ఇప్పుడు అంత వింతేమీ కాదు. సరైన వైద్య సంరక్షణ, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది మహిళలు ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిస్తున్నారు,” అని ఆమె వివరించారు. వయసుతో పాటు సమాజంపై అవగాహన పెరిగినప్పటికీ, మన శరీర జీవశాస్త్రం మాత్రం ఒక నిర్దిష్ట పరిమితికి లోబడే పనిచేస్తుందని డాక్టర్ సూరి గుర్తుచేశారు.

మహిళలు పుట్టుకతోనే ఒక పరిమిత సంఖ్యలో అండాలను కలిగి ఉంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ వాటి సంఖ్య, నాణ్యత రెండు తగ్గుతాయి. ఈ కారణం చేతనే 35 ఏళ్ల తర్వాత, ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత సహజ పద్ధతిలో గర్భం దాల్చడం కొంచెం కష్టతరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) వంటి అధునాతన సహాయక పునరుత్పత్తి సాంకేతికత (ఏఆర్​టీ) అవసరమవుతుందని డాక్టర్ సూరి స్పష్టం చేశారు.

భయాలు పక్కన పెడితే.. అసలైన ముప్పులు ఇవే!

40 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చే విషయంలో వైద్యులు కేవలం ధీమా ఇవ్వడమే కాకుండా, కఠినమైన పరీక్షలను కూడా సిఫార్సు చేస్తారు. లేటు వయసు ప్రెగ్నెన్సీలో కొన్ని ముప్పులు ఉన్నప్పటికీ, వాటిని ముందే ఊహించి, సరైన వైద్యంతో అదుపు చేయవచ్చని డాక్టర్ సూరి తెలిపారు. అందులోని ప్రధాన అంశాలు:

1. తల్లి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు-

వయసు పైబడుతున్న కొద్దీ, గర్భధారణ సమయంలో శరీరంపై పడే శారీరక ఒత్తిడి పాత ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రం చేస్తుంది. 35 ఏళ్లు దాటిన గర్భవతులలో క్రింది సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ సూరి వివరించారు:

జెస్టేషనల్ డయాబెటిస్: గర్భధారణ సమయంలో మాత్రమే తాత్కాలికంగా వచ్చే మధుమేహం ఇది.

హైపర్‌టెన్షన్, ప్రీఎక్లాంప్సియా: రక్తపోటు (బీపీ) అకస్మాత్తుగా ప్రమాదకర స్థాయికి పెరగడం వల్ల అటు తల్లికి, ఇటు కడుపులోని బిడ్డకు ఇద్దరికీ ముప్పు వాటిల్లుతుంది.

సిజేరియన్ కాన్పులు: ప్రసవ సమయంలో వచ్చే సంక్లిష్టతలు లేదా ఎక్కువ సమయం నొప్పులు రావడం వల్ల సహజ ప్రసవం కంటే సిజేరియన్ (ఆపరేషన్) చేయాల్సిన పరిస్థితి ఎక్కువగా వస్తుంది.

2. శిశువు ఆరోగ్యం, క్రోమోజోమ్ మార్పులు-

వయసు పెరిగే కొద్దీ అండాల నాణ్యత తగ్గడం వల్ల పుట్టబోయే బిడ్డలో జన్యుపరమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ సూరి చెప్పారు. 40 ఏళ్ల వయసులో గర్భం దాల్చితే ‘డౌన్ సిండ్రోమ్’ వంటి క్రోమోజోమ్ లోపాలు వచ్చే ముప్పు గణనీయంగా పెరుగుతుంది. దీనితో పాటు, నెలలు నిండకుండానే కాన్పు కావడం లేదా పుట్టినప్పుడు శిశువు బరువు చాలా తక్కువగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువే.

ఈ సమస్యలన్నీ వినడానికి చాలా భయానకంగా అనిపించినప్పటికీ.. నేటి ఆధునిక వైద్యశాస్త్రం ఎంతో పురోగమించింది. గర్భం దాల్చిన 10వ వారంలోనే తల్లి రక్తాన్ని సేకరించి చేసే ‘నాన్-ఇన్వాసివ్ ప్రినేటల్ టెస్టింగ్’ (ఎన్​ఐపీటీ) ద్వారా కడుపులోని బిడ్డ డీఎన్ఏను పరీక్షించవచ్చు. అలాగే హై-రిజల్యూషన్ టార్గెటెడ్ అల్ట్రాసౌండ్ స్కాన్ల సహాయంతో గైనకాలజిస్టులు కడుపులోని లోపాలను అత్యంత ఖచ్చితత్వంతో ముందే గుర్తించి, పర్యవేక్షించి, చికిత్స అందించగలుగుతున్నారు.

40 ఏళ్ల తర్వాత సురక్షిత గర్భధారణకు 4 సూత్రాలు..

35 ఏళ్లు దాటిన తర్వాత లేదా 40 ఏళ్ల వయసులో గర్భం దాల్చాలని ప్లాన్ చేసుకుంటుంటే.. సురక్షితమైన ప్రసవం కోసం ముందస్తు వైద్య జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. దీనికోసం డాక్టర్ సూరి నాలుగు ప్రధాన సూత్రాలను సూచించారు:

గర్భధారణకు ముందే ప్లానింగ్: గర్భం కోసం ప్రయత్నించే ముందే వైద్యుడిని సంప్రదించి, మీ సంపూర్ణ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించుకోవాలి. పాత ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే ముందే చికిత్స తీసుకోవాలి.

క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు: గర్భం దాల్చిన తర్వాత వైద్యుల పర్యవేక్షణలో తరచూ పరీక్షలు చేయించుకోవడం వల్ల రాబోయే సంక్లిష్టతలను ముందే గుర్తించి అడ్డుకోవచ్చు.

ఆరోగ్యకరమైన జీవనశైలి: సమతుల్య ఆహారం తీసుకోవడం, చిన్నపాటి వ్యాయామాలు చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం, ధూమపానం, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండటం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు.

మానసిక ప్రశాంతత: గర్భధారణ సమయంలో మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవడం, కుటుంబ సభ్యుల మద్దతు లభించడం వల్ల ఈ ప్రయాణం ఎంతో సుఖవంతంగా సాగుతుంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ప్రెగ్నెన్సీ సంబంధిత విషయాలను లోతుగా తెలుసుకునేందుకు మీరు మీ ఫ్యామిలీ డాక్టర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More