9 నెలల ముందు వరకు ఫిట్​గా ఉన్నాడు- ఇప్పుడు అనూహ్యంగా అల్జీమర్స్​! కారణం.. మీరు కూడా చేస్తున్న ఈ పనే!

సోషల్ మీడియా స్క్రోలింగ్ వల్ల ఒక వ్యక్తి మెదడు కేవలం 9 నెలల్లోనే క్షీణించిందని ప్రముఖ లైఫ్‌స్టైల్ నిపుణుడు ల్యూక్ కౌటిన్హో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే, దీనివల్ల నేరుగా అల్జీమర్స్ వస్తుందా? అనే అంశంపై న్యూరాలజిస్టులు ఏమంటున్నారు? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 15, 2026 10:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోషల్ మీడియా విప్లవం వచ్చిన తర్వాత చాలా మంది ఇన్​స్టాగ్రామ్​ రీల్స్​ చూస్తూనో, యూట్యూబ్​ షార్ట్స్​ చూస్తూనో లేక ఫ్యాన్​ వార్స్​తో ట్విట్టర్​లో గంటలు గంటలు గడిపేస్తున్నారు. ఇలాంటి వారికి చిన్న వయస్సులోనే అల్జీమర్స్​ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఒక ఘటనను ప్రముఖ ఇంటిగ్రేటివ్, లైఫ్‌స్టైల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ ల్యూక్ కౌటిన్హో వివరించారు. ఇది చాలా ఆందోళనకరంగా ఉంది!

సోషల్​ మీడియాకు మీరు బానిసలా? ఇది చూడండి..
సోషల్​ మీడియాకు మీరు బానిసలా? ఇది చూడండి..

9 నెలల్లోనే మెదడు క్షీణత!

"ఒక వ్యక్తి మెదడు కేవలం 9 నెలల్లోనే క్షీణించడాన్ని నేను గమనించాను.. అది వయసు రీత్యా వచ్చే అల్జైమర్స్ కాదు. మనమందరం ప్రతిరోజూ చేసే ఒక పని వల్లే అది జరిగింది," అని ల్యూక్​ పేర్కొన్నారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శారీరక దృఢత్వంతో పాటు కెరీర్‌లో విజయవంతంగా సాగుతున్న సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తికి అకస్మాత్తుగా 'ఎర్లీ-ఆన్సెట్ అల్జీమర్స్' (వయసు రాకముందే వచ్చే మతిమరుపు వ్యాధి) లక్షణాలు కనిపించాయి. జ్ఞాపకశక్తి తగ్గడం, గందరగోళం, చిరాకు వంటి సమస్యలతో బాధపడుతున్న ఆ వ్యక్తి మెడికల్ రిపోర్టులు పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గత ఐదేళ్ల రిపోర్టుల వరకు అంతా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, ఇటీవల ఆయన ఇన్​స్టాగ్రామ్​ రీల్స్, సోషల్ మీడియాకు బానిసయ్యాడు. రోజుకు 2 నుంచి 4 గంటల పాటు నిరంతరం స్క్రోలింగ్ చేసేవాడు.

"ఆయన ఆ అలవాటును ఆపలేకపోయాడు. డోపమైన్ ప్రభావంతో ఆ వీడియోలకు అతుక్కుపోయాడు. ఆ తర్వాత నిద్ర లేకపోవడం, ఆలోచనలు ముసురుకోవడం, తెల్లవారుజామున జంక్ ఫుడ్, స్వీట్లు తినడం వంటివి ఆయన మెదడును దెబ్బతీశాయి. కేవలం 9 నెలల్లోనే ఆయన ఏకాగ్రత మందగించి, జ్ఞాపకశక్తి క్షీణించింది. సోషల్ మీడియా వ్యసనం వల్ల మెదడు పాడవ్వడానికి (బ్రెయిన్​ రాట్​) ఇది నా దగ్గరకు వచ్చిన మొదటి క్లియర్ కేసు," అని ల్యూక్ రాసుకొచ్చారు.

నిజంగానే సోషల్ మీడియా అల్జీమర్స్‌కు కారణమవుతుందా?

ఈ అంశంపై శాస్త్రీయ దృక్పథాన్ని తెలుసుకునేందుకు దేశంలోని ఓ ప్రముఖ వార్తా సంస్థ.. ఫోర్టిస్ హాస్పిటల్ (ఫరీదాబాద్) న్యూరాలజీ విభాగం డైరెక్టర్, హెడ్ డాక్టర్ వినీత్ బంగాని సంప్రదించింది.

"సోషల్ మీడియా వ్యసనం వల్ల అల్జీమర్స్ వ్యాధి వస్తుందని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అల్జీమర్స్ అనేది మెదడులోని కణాలు క్రమంగా క్షీణించే వ్యాధి. ఇది వయస్సు, జన్యుపరమైన కారణాలు, మెదడులో బీటా అమిలాయిడ్, టౌ ప్రొటీన్ వంటి అసాధారణ ప్రొటీన్లు పేరుకుపోవడం వల్ల వస్తుంది," అని డాక్టర్ బంగా స్పష్టం చేశారు.

అయితే, సోషల్ మీడియా వ్యసనం వల్ల కలిగే ఇతర నష్టాల గురించి ఆయన హెచ్చరించారు:

పరోక్ష ప్రభావం: అధిక స్క్రీన్ టైమ్ వల్ల నిద్ర నాణ్యత తగ్గడం, అటెన్షన్ స్పాన్ క్షీణించడం, ఆందోళన, డిప్రెషన్ పెరుగుతాయి.

కాగ్నిటివ్ ఫెటీగ్: ఇది మానసిక అలసటను కలిగిస్తుంది, తద్వారా తాత్కాలికంగా జ్ఞాపకశక్తి తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ దీనిని అల్జీమర్స్‌గా భావించకూడదు.

నిద్ర లేమి: రాత్రిపూట స్క్రోలింగ్ వల్ల నిద్ర 24 నిమిషాల కంటే ఎక్కువ తగ్గుతుంది. ఇన్సోమ్నియా రిస్క్ 59% పెరుగుతుంది. నిద్ర లేకపోవడం అనేది డిమెన్షియా రిస్క్‌ను పెంచుతుంది.

నిపుణుల సలహా: మెదడును కాపాడుకోండి ఇలా!

డాక్టర్ బంగా, ల్యూక్ కౌటిన్హో ఇద్దరూ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొన్ని సూచనలు చేశారు:

స్క్రీన్ టైమ్ నియంత్రణ: రాత్రి 9 గంటల తర్వాత ఫోన్ వాడటం మానేయాలి.

ప్రత్యామ్నాయాలు: ఫోన్ స్క్రోలింగ్ బదులు పుస్తకాలు చదవడం లేదా నడక వంటి అలవాట్లు చేసుకోవాలి.

డిజిటల్ డెటాక్స్: వారాంతాల్లో సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి.

జీవనశైలి మార్పులు: క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం, సరైన నిద్ర పోవడం, మధుమేహం, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

సోషల్ మీడియా వ్యసనం నేరుగా అల్జీమర్స్‌కు దారితీయకపోవచ్చు, కానీ అది మీ మానసిక సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఫోన్ మీ ఆధీనంలో ఉండాలి కానీ, మీరు ఫోన్ ఆధీనంలోకి వెళ్లకూడదు.