2026 న్యూ ఇయర్ రిజల్యూషన్ : గుండెను పదిలంగా ఉంచేందుకు ఇవి పాటించండి..

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు పాటించాల్సిన సులభమైన టిప్స్​ని ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ బిపించంద్ర భమ్రే తెలిపారు. వాటిని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 14, 2025 9:10 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2025 ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాది (2026) కోసం రిజల్యూషన్స్​ రాసుకోవడానికి ఇది సరైన సమయం. ప్రతి సంవత్సరం తీసుకునే నిర్ణయాల జాబితాలో జీవనశైలి మార్పులు ప్రధానంగా ఉంటాయి. మీరు మరింత ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులను స్వీకరించాలని చూస్తున్నట్లయితే, 2026 ను ఉల్లాసంగా, సానుకూలంగా ప్రారంభించడానికి మీ దినచర్యలో కొన్ని 'హార్ట్​ హెల్తీ' పద్ధతులను చేర్చుకోవడం చాలా అవసరం.

గుండెను పదిలంగా ఉంచేందుకు ఇవి పాటించండి.. (Picture credit: Pexels)
గుండెను పదిలంగా ఉంచేందుకు ఇవి పాటించండి.. (Picture credit: Pexels)

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు అనుసరించగల సులభమైన అలవాట్లపై ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ అయిన డాక్టర్ బిపించంద్ర భమ్రే తన సిఫార్సులను పంచుకున్నారు.

గుండె ఆరోగ్యంపై ఎందుకు దృష్టి పెట్టాలి?

గుండె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకు ముఖ్యమో కార్డియాలజిస్ట్ వివరించారు. 2025లో గుండె జబ్బులు అతిపెద్ద ఆరోగ్య సమస్యగా మారాయని అన్నారు. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఇది ఏ ఒక్క వయస్సు సమూహానికే పరిమితం కాలేదని డాక్టర్ భమ్రే పేర్కొన్నారు.

"అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, డయాబెటిస్‌తో కూడిన గుండె సమస్యలు, అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వంటివి అన్ని వయస్సుల వారిలోనూ విపరీతంగా పెరిగాయి," అని ఆయన అన్నారు.

"ప్రస్తుతం 25-75 సంవత్సరాల వయస్సు వారికి ఛాతీ అసౌకర్యం, నడిచేటప్పుడు ఆయాసం, నిరంతర అలసట, పాదాల్లో వాపు, తల తిరగడం, ఎసిడిటీ లాంటి ఛాతీ నొప్పి లేదా గుండె దడ వంటి సమస్యలు వస్తున్నాయి."

ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే, అవి గుండెపోటు, స్ట్రోక్స్ లేదా దీర్ఘకాలిక గుండె నష్టం వంటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి. అందుకే, మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మీ జీవనశైలిని తక్షణమే మార్చుకోవడం చాలా ముఖ్యం.

2026 కోసం 5 గుండె-ఆరోగ్యకరమైన నియమాలు..

రాబోయే సంవత్సరంలో గుండె ఆరోగ్యం కోసం 5 నియమాలను పంచుకున్నారు డాక్టర్ భమ్రే. ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాథమిక అంశాలైన ఆహారం, శారీరక శ్రమ, ఒత్తిడి నిర్వహణ, నిద్ర, సాధారణ తనిఖీలను కవర్ చేస్తాయి.

కార్డియాలజిస్ట్ సూచించిన జీవనశైలి మార్పులు ఇక్కడ ఉన్నాయి:

1. కదలండి-

వాకింగ్​, సైక్లింగ్, యోగా లేదా సాధారణ హోమ్ వర్కౌట్‌ల వంటి వ్యాయామాలు కొలెస్ట్రాల్, రక్తపోటు, బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. రోజుకు కనీసం 45 నిమిషాలు తప్పనిసరిగా వ్యాయామం చేయండి.

2. సరిగ్గా తినండి-

పండ్లు: బెర్రీలు (స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు), ఆపిల్స్, నారింజ, కివి, బొప్పాయి వంటి పండ్లను ఎంచుకోండి.

కూరగాయలు: పాలకూర, బ్రోకలీ, క్యారెట్లు, టొమాటోలు, బీట్‌రూట్, బీన్స్ వంటివి ఆహారంలో తీసుకోండి.

నట్స్ అండ్​ సీడ్స్: బాదం, వాల్‌నట్స్, పిస్తా, అవిసె గింజలు, చియా విత్తనాలు, మరియు గుమ్మడికాయ గింజలు వంటివి తినండి.

ముఖ్యమైన పోషకాలు: చేపలు, వాల్‌నట్‌ల నుంచి లభించే ఒమేగా-3 కొవ్వులు; ఓట్స్, కూరగాయల నుంచి ఫైబర్; పాలకూర, చిలగడదుంప నుంచి పొటాషియం; యాంటీఆక్సిడెంట్లు (బెర్రీలు, టొమాటోలు); నట్స్, విత్తనాలు, తృణధాన్యాల నుంచి మెగ్నీషియం; విటమిన్ సీ (సిట్రస్ పండ్లు, కివి) పొందండి.

వేయించిన ఆహారాలు, షుగర్​ స్నాక్స్, అధిక ఉప్పును తగ్గించండి.

3. రాత్రి బాగా నిద్రపోండి-

సరైన నిద్ర లేకపోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నిర్దిష్ట నిద్ర దినచర్యను అనుసరించండి, ఒకే సమయానికి నిద్రపోండి, మేల్కొనండి.

రాత్రి 10:00 గంటలకల్లా పడుకోవడానికి ప్రయత్నించండి. కనీసం 8-9 గంటల నిద్రను పూర్తి చేసి, ఉదయం 6:00- 7:00 గంటల మధ్య మేల్కొనండి.

4. ఒత్తిడిని నిర్వహించండి-

డీప్​ బ్రీథింగ్​, ధ్యానం, పెయింటింగ్, తోటపని లేదా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం వంటి అభిరుచులను అలవాటు చేసుకోండి.

మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోండి.

5. క్రమం తప్పకుండా చెకప్స్​ చేయించుకోండి-

రక్త పరీక్ష, ఈసీజీ, రక్తపోటు చెకప్​లను ఎంచుకోవడం వల్ల ప్రారంభ సమస్యలను గుర్తించి, సకాలంలో చికిత్స ప్రారంభించడానికి సహాయపడుతుంది.

30 ఏళ్లు పైబడిన వారు లేదా కుటుంబంలో గుండె జబ్బుల హిస్టరీ ఉన్నవారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా అవసరం.