Cucumber vs Watermelon : ఎండలకు ఏది బెస్ట్? కీరదోసనా? పుచ్చకాయనా? పూర్తి వివరాలు ఇక్కడ మీకోసం
Cucumber vs Watermelon : వేసవి వచ్చిందంటే ఇంట్లో కీరదోస, లేదంటే పుచ్చకాయ ఉంటుంది. కానీ ఈ రెండింటిలో తినేందుకు ఏది బెస్ట్ అని చాలా మంది ప్రశ్న. అందుకే మీకోసం పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
వేసవి వచ్చిందంటే చాలు.. భారతదేశంలోని ఏ ఇంట్లోకి వెళ్లినా కీరదోస, లేదంటే పుచ్చకాయ ఉంటుంది. మధ్యాహ్న భోజనంలో ముక్కలుగా కోసిన కీరదోస లేదా కుటుంబం అంతా కలిసి తినడానికి సిద్ధంగా ఉంచిన పుచ్చకాయ కచ్చితంగా కనిపిస్తాయి. ఇవి రెండూ వేసవి కాలంలో లభించే అద్భుతమైనవి. శరీరానికి చలువ చేస్తాయి. ఎండ తీవ్రతను, డీహైడ్రేషన్‌ను తట్టుకోవడానికి మన పెద్దల కాలం నుండి వీటిని తినడం ఒక ఆనవాయితీగా వస్తోంది.

అయితే పోషకాలు, హైడ్రేషన్, మన శరీరానికి అసలు ఏం కావాలి? అనే విషయానికి వస్తే.. ఈ రెండూ ఒకటి కాదు. వీటి మధ్య ఉన్న తేడాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. కీరదోస vs పుచ్చకాయల మధ్య పోటీ పెడితే ఏది గెలుస్తుంది అనేదాని గురించి కాదు, అసలు ఏది మన శరీరానికి ఎలాంటి పోషకాలను అందిస్తుందో అర్థం చేసుకోవడం ముఖ్యం.
పోషకాల లెక్కలు
కీరదోసలో బరువు పరంగా దాదాపు 96 శాతం నీరు ఉంటుంది. భూమిపై అత్యంత వేగంగా హైడ్రేషన్ అందించే ఆహారాలలో ఇది ఒకటి. 100 గ్రాముల కీరదోసలో కేవలం 15 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో చక్కెర శాతం చాలా తక్కువ. పొటాషియం, విటమిన్-K పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే 'కుకుర్బిటాసిన్స్' అనే సమ్మేళనాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. వేసవిలో ఎండల వల్ల ఒత్తిడికి గురయ్యే చర్మం, కీళ్ల ఆరోగ్యానికి మేలు చేసే 'సిలికా' కూడా ఇందులో లభిస్తుంది.
కీరదోసతో పోలిస్తే పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు, 100 గ్రాములకు సుమారు 30 క్యాలరీలు ఉంటాయి. కీరదోస కంటే ఇందులో సహజ చక్కెరల శాతం కొంచెం ఎక్కువ. అయితే కీరదోసలో లేని ఒక ప్రత్యేకమైన పోషకం పుచ్చకాయలో ఉంది.. అదే 'లైకోపీన్'. పుచ్చకాయకు ఆ ఎరుపు రంగును ఇచ్చే ఈ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. 'న్యూట్రియంట్స్' అనే జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. ఎండలో ఎక్కువ సమయం గడిపేవారికి గుండె సంబంధిత రక్షణ కల్పించడంలో లైకోపీన్ కీలక పాత్ర పోషిస్తుంది.
దీనితో పాటు పుచ్చకాయలో 'సిట్రులైన్' అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఎండలో వ్యాయామం చేసిన తర్వాత వచ్చే కండరాల నొప్పులను తగ్గిస్తుంది. అందుకే వర్కవుట్ తర్వాత తీసుకునేందుకు బెస్ట్ ఇది.
న్యూట్రిషనిస్టుల సలహా ఏంటి?
ఈ రెండూ కూడా వేసవికి అద్భుతమైన ఎంపికలే, కానీ ఇవి వేర్వేరు అవసరాలను తీరుస్తాయి. ఎవరైనా బరువు తగ్గడానికి, తక్కువ క్యాలరీలతో హైడ్రేషన్ పొందడానికి, అలాగే జీర్ణక్రియ, చర్మ సంరక్షణ కోసం చూస్తుంటే.. వారికి కీరదోస సరైనది.
అదే సమయంలో, కడుపు నిండిన అనుభూతి కలగాలి, తక్షణ సహజ శక్తి రావాలి. ఎండలో శారీరక శ్రమ తర్వాత బాడీ రికవరీ అవ్వాలి అనుకుంటే.. పుచ్చకాయ ఉత్తమమైనది.
డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చా?
పుచ్చకాయ గ్లైసిమిక్ ఇండెక్స్ దాదాపు 72 ఉంటుంది. ఇది ఎక్కువని కొందరు ఆందోళన చెందుతుంటారు. కానీ, ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల దీని 'గ్లైసిమిక్ లోడ్' చాలా తక్కువ. అంటే పరిమితంగా తింటే ఇది ఆరోగ్యవంతమైన పెద్దలలో బ్లడ్ షుగర్ స్థాయిలను అంతగా పెంచదు. అయినప్పటికీ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి లేదా వెయిట్ లాస్ ప్లాన్‌లో ఉన్నవారికి కీరదోస అత్యంత సురక్షితమైన ఎంపిక.
కీరదోస ఎప్పుడు తినాలి?
మీరు తేలికపాటి, తక్కువ క్యాలరీలు ఉన్న స్నాక్ కావాలనుకున్నప్పుడు, లేదా మధ్యాహ్న భోజనంలో సలాడ్‌గా కీరదోసను తినండి. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. దీనిలోని ఆల్కలైన్ స్వభావం వేసవి వేడి వల్ల వచ్చే ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది.
పుచ్చకాయ ఎప్పుడు తినాలి?
ఎండలో ఏదైనా శారీరక శ్రమ చేసిన తర్వాత, నీరసంగా అనిపించినప్పుడు లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు పుచ్చకాయ ముక్కలను ఎంచుకోండి. రెండు లేదా మూడు ముక్కలు తింటే శరీరానికి ప్రాసెస్డ్ షుగర్ల ముప్పు లేకుండా మంచి పోషకాలు అందుతాయి.
కీరదోస, పుచ్చకాయలు ఒకదానికొకటి పోటీదారులు కావు.. వేసవిలో మన శరీరాన్ని కాపాడే మంచి మిత్రులు. కీరదోస శరీరాన్ని తేలికగా, చల్లగా ఉంచుతూ చర్మాన్ని కాపాడుతుంది. పుచ్చకాయ శరీరానికి తక్షణ శక్తిని, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. కాబట్టి ఈ వేసవిలో ఈ రెండింటినీ మీ డైట్‌లో చేర్చుకోండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


