Diwali Delhi AQI : అత్యంత దారుణంగా దిల్లీ వాయు కాలుష్యం- ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య ముప్పు..
దీపావళి అనంతరం దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో పరిస్థితులు అత్యంత విషమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తులకు సంబంధించి ఆరోగ్య నిపుణులు ఇస్తున్న ముందస్తు హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలు ఇక్కడ చదవండి..
దీపావళి పండుగ సంబరాలు ముగిసిన తర్వాత దేశమంతటా వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చుతోంది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీ విలవిలలాడుతోంది. పటాకుల పొగ, శీతాకాలం ఆరంభంలో పెరిగే పొగమంచు కలగలసి గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) దారుణంగా పడిపోయింది. దిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఏక్యూఐ ఏకంగా 400కు చేరింది. పరిస్థితి చాలా విషమంగా ఉందని ఇది సూచిస్తోంది.

ఈ విషపూరిత వాయువులు ప్రధానంగా మానవ శ్వాసకోశ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. గతంలో ఎలాంటి శ్వాసకోశ వ్యాధులు లేని వారిలో సైతం దగ్గు, గొంతు మంట, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా పండుగ తర్వాతి రోజుల్లో కాలుష్య స్థాయిలు గణనీయంగా పెరుగుతున్నాయి. విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రి శ్వాసకోశ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ ఉదయ్ కిరణ్ జీ తెలిపిన వివరాల ప్రకారం.. వాయు కాలుష్యం పెరిగినప్పుడు అలర్జిక్ రైనైటిస్, ఆస్తమా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) ఉన్నవారికి సమస్యలు మరింత రెట్టింపు అవుతాయి.
పటాకుల పొగ వల్ల ఊపిరితిత్తులకు అసలు ఏం జరుగుతుంది?
దీపావళి సమయంలో వెలువడే పొగలో అత్యంత సూక్ష్మమైన పీఎం2.5 కణాలు (రసాయన కణాలు), విషపూరితమైన వాయువులు అధిక మోతాదులో ఉంటాయి.
"ఈ సూక్ష్మ కణాలు రక్తప్రవాహంలోకి చొచ్చుకెళ్లి శ్వాసనాళాల్లో తీవ్రమైన వాపును, మంటను కలిగిస్తాయి," అని డాక్టర్ ఉదయ్ కిరణ్ స్పష్టం చేశారు.
వాతావరణంలోకి విడుదలయ్యే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి రసాయనాలు ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీస్తాయి. శ్వాసనాళాలు కుంచించుకుపోయి కఫం రావడం పెరుగుతుంది. దీనివల్ల ఆస్తమా రోగులకు అకస్మాత్తుగా తీవ్రమైన ఆయాసం రావడం, గాలి పీల్చడం కష్టంగా మారడం జరుగుతుంది.
ఈ కాలుష్యం వల్ల ఎక్కువ ముప్పు ఎవరికి?
కాలుష్య భారం పెరిగినప్పుడు ప్రధానంగా ఇద్దరు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటారు:
చిన్న పిల్లలు: పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదల పూర్తిగా జరగకపోవడంతో పాటు, వారి శరీర బరువుతో పోలిస్తే శ్వాస తీసుకునే వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు వాతావరణంలోని విష వాయువులను ఎక్కువ పరిమాణంలో పీల్చుకుంటారు.
వయోవృద్ధులు: వయసు మళ్లినవారు, ముందుగానే గుండె లేదా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు కొద్దిసేపు విష గాలికి గురైనా వారి ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది.
ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఇవే..
శరీరంలో శ్వాసకోశ సమస్యలు తీవ్రమవుతున్నప్పుడు కనిపించే ప్రారంభ సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు:
- తగ్గని పొడి దగ్గు, ఛాతీలో బిగుతుగా ఉండటం లేదా ఈలలు వేసినట్లు శబ్దం రావడం.
- ఇన్హేలర్ల వినియోగం సాధారణం కంటే ఎక్కువగా పెరగడం.
- రాత్రి వేళల్లో దగ్గు రావడం వల్ల నిద్రకు భంగం కలగడం.
- రోజూ చేసే సాధారణ శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం కష్టంగా మారడం.
- ఇన్హేలర్లు లేదా మందులు వాడినప్పటికీ ఉపశమనం లభించకపోవడం.
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 6 మార్గాలు..
పండుగ తర్వాత కొద్దిరోజుల పాటు స్వచ్ఛమైన గాలి పీల్చేందుకు, ఊపిరితిత్తులను కాపాడుకోవడానికి ఈ కింది నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు:
ఏక్యూఐ తనిఖీ చేయడం: ప్రతిరోజూ ఉదయం మీ ప్రాంతంలోని గాలి నాణ్యతను (ఏక్యూఐ) తనిఖీ చేయాలి. కాలుష్యం ఎక్కువగా ఉన్న వేళల్లో ఆరుబయట తిరగడం తగ్గించాలి.
ఇంటి వాతావరణం సురక్షితం చేయడం: పండుగ పొగ ఎక్కువగా ఉన్న సమయాల్లో ఇంట్లోకి గాలి రాకుండా తలుపులు, కిటికీలు మూసివేయాలి. హెపా ఫిల్టర్లు ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్లను వాడటం మంచిది.
సరైన మాస్క్ ధరించడం: అత్యవసర పనిపై బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా సరిగ్గా అమరే ఎన్95 లేదా కేఎన్95 మాస్క్ మాత్రమే ధరించాలి. సాధారణ సర్జికల్ మాస్కులు లేదా కాటన్ మాస్కులు పీఎం2.5 కణాల నుంచి రక్షణ ఇవ్వలేవు!
భారీ వ్యాయామాలు వద్దు: ఆరుబయట రన్నింగ్, వాకింగ్ లేదా తీవ్రమైన వ్యాయామాలు చేయకూడదు. వేగంగా శ్వాస పీల్చడం వల్ల విష వాయువులు ఎక్కువ పరిమాణంలో ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి.
ఇంట్లో పొగ కలిగించే వస్తువులు ఆపాలి: ఇంట్లోనే పొగను సృష్టించే అగరబత్తులు, దోమల కాయిల్స్ లేదా సిగరెట్ పొగ లేకుండా చూడాలి.
మందులను క్రమం తప్పకుండా వాడటం: ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సూచించిన ఇన్హేలర్లను నిరంతరాయంగా వాడాలి.
ఎప్పుడు అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి?
కొన్ని రకాల ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి:
- తీవ్రమైన ఆయాసం రావడం.
- పూర్తి వాక్యం కూడా మాట్లాడలేకపోవడం.
- ఛాతీలో నిరంతరం తీవ్రమైన నొప్పి ఉండటం.
- పెదవులు లేదా గోళ్లు నీలం రంగులోకి మారడం.
- అకస్మాత్తుగా గందరగోళం (మతిమరుపు) లేదా స్పృహ తప్పే పరిస్థితి రావడం.
జాగ్రత్తలు పాటిస్తూ, లక్షణాలను ప్రారంభంలోనే గుర్తిస్తే పొగ కాలుష్యం వల్ల వచ్చే ప్రమాదాల నుంచి ఊపిరితిత్తులను సురక్షితంగా కాపాడుకోవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


