Gut Health : బ్రెడ్, సోడా, మీట్​తో గట్​ హెల్త్​ నాశనం- ఈ ఫుడ్స్ తింటే​ బెస్ట్!

Gut Health tips : మన పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా మనం తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ తింటే చెడు బ్యాక్టీరియా పెరిగి గ్యాస్, ఎసిడిటీ, బ్లోటింగ్ వంటి సమస్యలు వస్తాయి. గట్ హెల్త్‌ను సహజంగా మెరుగుపరచుకోవడానికి 5 అద్భుతమైన ఆహార మార్పులను ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 24, 2026, 08:14:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Foods to improve gut health : నేటి కాలంలో ‘గట్ హెల్త్’ (పేగుల ఆరోగ్యం) అనేది కేవలం జీర్ణక్రియకు మాత్రమే పరిమితం కాదు. ఇది మన శరీర శక్తి సామర్థ్యాలు, రోగనిరోధక శక్తి, చర్మ సౌందర్యం, మానసిక స్థితిని కూడా నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన జీర్ణవ్యవస్థలో ట్రిలియన్ల కొద్దీ ఉండే సూక్ష్మజీవులను (గట్ మైక్రోబయోమ్) ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఖరీదైన సప్లిమెంట్లు అవసరం లేదంటున్నారు. మనం రోజూ తినే ఆహారంలో 5 చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను ఎలా పెంచుకోవచ్చో ఎయిమ్స్, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాలలో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి వివరించారు. అవి..

గట్​ హెల్త్​ టిప్స్​.. ఈ ఆహారాలు బెస్ట్..
గట్​ హెల్త్​ టిప్స్​.. ఈ ఆహారాలు బెస్ట్..

1. డైట్ సోడాకు ప్రత్యామ్నాయంగా.. లెమన్ స్మార్ల్కింగ్ వాటర్

చాలామంది బరువు తగ్గడానికి లేదా హెల్తీ అనుకుని ‘డైట్ సోడా’ తాగుతుంటారు. కానీ, ఇందులో వాడే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ (కృత్రిమ చక్కెరలు) గట్ మైక్రోబయోమ్‌ను దెబ్బతీస్తాయని పరిశోధనల్లో తేలింది.

చేయాల్సిన మార్పు: సాధారణ సోడా లేదా డైట్ సోడాలకు బదులుగా.. స్మార్ల్కింగ్ వాటర్ (కార్బోనేటెడ్ వాటర్) లో కొద్దిగా నిమ్మరసం పిండుకుని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది.

2. ప్రాసెస్డ్ మీట్‌కు బదులుగా.. ఫ్రెష్ ప్రొటీన్

మార్కెటలో దొరికే సాసేజ్‌లు, డెలి మీట్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో ప్రిజర్వేటివ్‌లు, కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పొట్టలో మంటని పెంచి మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.

చేయాల్సిన మార్పు: వీటికి బదులుగా గ్రిల్డ్ చికెన్, గుడ్లు, చేపలు లేదా శాకాహారులు అయితే టోఫు, పన్నీర్ వంటి సహజమైన, తాజా ప్రొటీన్ ఆహారాలను ఎంచుకోండి.

3. బాగా పండిన అరటిపండ్ల కంటే.. కాస్త పచ్చగా ఉండేవి

పూర్తిగా పండిన అరటిపండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ, కాస్త పచ్చగా, దోరగా ఉండే అరటిపండ్లలో ‘రెసిస్టెంట్ స్టార్చ్’ అధికంగా ఉంటుంది.

చేయాల్సిన మార్పు: ఈ రెసిస్టెంట్ స్టార్చ్ అనేది మన పొట్టలోని మంచి బ్యాక్టీరియాకు అద్భుతమైన ఆహారంగా (ప్రీబయోటిక్) పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

4. ఫ్లేవర్డ్ పెరుగు వద్దు.. ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్ లేదా కెఫిర్ ముఖ్యం

మార్కెట్​లో రకరకాల పండ్ల రుచులతో దొరికే ‘ఫ్లేవర్డ్ యోగర్ట్’లలో విపరీతమైన చక్కెరలు ఉంటాయి. డాక్టర్ సేథి ప్రకారం.. "ఇందులోని చక్కెరలు, మనం పెంచాలనుకునే మంచి బ్యాక్టీరియానే చంపేస్తాయి."

చేయాల్సిన మార్పు: వీటికి బదులుగా ఇంట్లో తోడుపెట్టుకునే సాధారణ పెరుగు, ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్ లేదా కెఫిర్ (ఒక రకమైన పులియబెట్టిన పాలు) తీసుకోవాలి. వీటిలో లభించే సహజమైన ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

5. వైట్ బ్రెడ్ స్థానంలో.. హోల్ గ్రెయిన్ సోర్‌డో బ్రెడ్

సాధారణ మైదాతో చేసే వైట్ బ్రెడ్ వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు పెరుగుతాయి. దీనికి బదులుగా సహజమైన ఫెర్మెంటేషన్ (పులియబెట్టడం) ప్రక్రియ ద్వారా తయారయ్యే సోర్‌డో బ్రెడ్​ని వాడాలి.

చేయాల్సిన మార్పు: ఈ సహజ పద్ధతి వల్ల బ్రెడ్ సులభంగా జీర్ణమవుతుంది, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగవు.

చిన్న మార్పులు - పెద్ద ఫలితాలు..

కఠినమైన డైట్ నియమాలు పాటించడం కంటే, రోజువారీ అలవాట్లలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మంచి ఫైబర్ (పీచుపదార్థం) ఉన్న ఆహారం తీసుకోవడం, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌ను తగ్గించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా పొట్ట ఉబ్బరం తగ్గి శరీరం రోజంతా ఉల్లాసంగా ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More