Healthy life : రాత్రి తిన్న తర్వాత 10 అంటే 10 నిమిషాలు నడిస్తే చాలు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు!

Gut health : రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం లేదా ఫోన్ చూస్తూ కూర్చోవడం వల్ల జీర్ణక్రియ మందగించి అనేక జబ్బులు వస్తాయి. డిటాక్స్ జ్యూస్‌లు, ఖరీదైన హెల్త్ ప్యాకేజీలు లేకుండా కేవలం 10 నిమిషాల నడకతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వివరించారు.

Published on: Jul 12, 2026, 08:14:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది రాత్రి వేళల్లో ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. ఇక డిన్నర్ ముగియగానే నేరుగా వెళ్లి సోఫాలో కూర్చోవడమో, టీవీ చూస్తూనో లేదా మొబైల్ స్క్రోల్ చేస్తూనో గడిపేస్తుంటారు. కొందరైతే తిన్న వెంటనే బెడ్ ఎక్కేస్తారు. అయితే, ఈ అలవాటు మన ఆరోగ్యాన్ని ముఖ్యంగా జీర్ణవ్యవస్థను ఎంతలా దెబ్బతీస్తుందో ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి భోజనం తర్వాత చేసే ఒకే ఒక్క చిన్న పని మీ ఆరోగ్యాన్ని సమూలంగా మార్చేస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. దీనికోసం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, గంటల కొద్దీ సమయం కేటాయించాల్సిన పనీ లేదు. కేవలం పది నిమిషాల పాటు నడిస్తే చాలు.

రాత్రి నడకతో ఎన్నో ప్రయోజనాలు!
రాత్రి నడకతో ఎన్నో ప్రయోజనాలు!

భారతదేశంలోని ప్రతిష్టాత్మక ఐయిమ్స్​తో పాటు హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాలలో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి.. తాను ప్రతిరోజూ రాత్రి భోజనం తర్వాత ఎందుకు నడుస్తానో వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు. రాత్రి నడక వెనుక ఉన్న మూడు ముఖ్యమైన ఆరోగ్య రహస్యాలు ఆయన మాటల్లోనే..

1. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది..

భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం వల్ల గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ (తిన్న ఆహారం జీర్ణాశయం నుంచి ప్రేగుల్లోకి వెళ్లే ప్రక్రియ) వేగవంతం అవుతుందని డాక్టర్ సౌరభ్ సేథి తెలిపారు. చాలామంది తిన్న తర్వాత కదలకుండా కూర్చోవడం వల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ లేదా గ్యాస్ రీఫ్లక్స్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అదే తిన్న తర్వాత ఓ పది నిమిషాల పాటు తేలికపాటి నడక సాగిస్తే, అది ప్రేగుల కదలికలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా తిన్న తిండి అరుగుతుంది. జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడకుండా దాని పని అది సులువుగా చేసుకుపోతుంది.

2. బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది..

రాత్రి పూట నడవడం వల్ల కలిగే రెండో పెద్ద ప్రయోజనం రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటం. భోజనం చేసిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.

"భోజనం ముగించిన తర్వాత సోఫాకే పరిమితం కాకుండా, కనీసం 10 నిమిషాల పాటు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకోవచ్చు," అని డాక్టర్ సేథి స్పష్టం చేశారు.

మనం నడుస్తున్నప్పుడు మన శరీరంలోని కండరాలు మనం తిన్న ఆహారం నుంచి విడుదలైన గ్లూకోజ్‌ను ఇంధనంగా వాడుకుంటాయి. దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి, శరీరం చక్కెరను సమర్థవంతంగా నిర్వహించగలుగుతుంది.

3. రూపాయి ఖర్చు లేని హెల్తీ హాబిట్..

ఆరోగ్యంగా ఉండటానికి, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి నేటి తరం రకరకాల డిటాక్స్ జ్యూస్‌లు, ఖరీదైన వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌ల వెనుక పరిగెడుతున్నారు. కానీ, వీటన్నింటికంటే రాత్రి పూట నడిచే 10 నిమిషాల ఉచిత అలవాటు ఎంతో మేలైనదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ అలవాటుకు ఎలాంటి జిమ్ మెంబర్‌షిప్‌లు, ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. పైగా దీని వెనుక దశాబ్దాల క్లినికల్ ఆధారాలు, శాస్త్రీయ పరిశోధనలు ఉన్నాయని డాక్టర్ సేథి పేర్కొన్నారు.

అందుకే బరువు తగ్గాలనుకునే వారు, జీర్ణ సమస్యలతో సతమతమయ్యే వారు భారీ వర్కవుట్లు చేయాల్సిన పని లేదు. ఈ రోజు నుంచే రాత్రి భోజనం కాగానే సోఫాకు గుడ్ బై చెప్పి, హాయిగా సాగిస్తూ ఒక పది నిమిషాల పాటు నడవడాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More