ఈ వేసవి వేళ తలనొప్పి వేధిస్తోందా..? వైద్యుడి విశ్లేషణలో అసలైన కారణాలు, పరిష్కారాలు

Heatwave Headache Relief : వేడి మైగ్రేన్లను ప్రేరేపిస్తుంది. ఈ వేసవిలో ఎండ తీవ్రతకు ఎక్కువగా గురైతే…. తరచుగా తీవ్రమైన తలనొప్పి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని విశ్లేషిస్తూ… ప్రముఖ వైద్యుడు కీలక విషయాలను చెప్పారు.

Published on: Apr 16, 2026 2:09 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Heatwave Headache Relief : వేసవి వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అదే పరిస్థితులు ఉన్నాయి. వడగాల్పుల పట్ల ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎండలు ముదురుతున్న కొద్దీ కేవలం వడదెబ్బ మాత్రమే కాదు…. తీవ్రమైన మైగ్రేన్ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో వేసవి మైగ్రేన్‌లను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా నివారించాలనే అంశాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం. మైగ్రేన్ అంటే కేవలం ఒక సాధారణ తలనొప్పి మాత్రమే కాదు, అది ఒక తీవ్రమైన నాడీ సంబంధిత రుగ్మత అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వేడిలో ఎక్కువ తలనొప్పి..? డాక్టర్ విశ్లేషణ (Freepik)
వేడిలో ఎక్కువ తలనొప్పి..? డాక్టర్ విశ్లేషణ (Freepik)

వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మెదడులోని నాడీ వ్యవస్థ తీవ్రంగా స్పందిస్తుంది. కాన్పూర్‌లోని రీజెన్సీ హెల్త్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ రూపాలి మెహ్రోత్రా దీని గురించి వివరిస్తూ.. మెదడు యొక్క థర్మోరెగ్యులేషన్ ప్రక్రియే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. "బాహ్య ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, శరీరం ఆ వేడిని తగ్గించుకోవడానికి మెదడులోని రక్త నాళాలను విస్తరింపజేస్తుంది. దీనినే వాసోడైలేషన్ (Vasodilation) అంటారు. మైగ్రేన్ సమస్య ఉన్నవారిలో… ఈ ప్రక్రియ మెదడులోని సున్నితమైన నరాల చివరలను ప్రేరేపిస్తుంది, ఫలితంగా భరించలేని నొప్పి మొదలవుతుంది" అని ఆమె వివరించారు.

వేసవిలో మైగ్రేన్ రావడానికి 'డీహైడ్రేషన్' ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. శరీరంలో ఉండాల్సిన నీటి మట్టం కేవలం 2 శాతం తగ్గినా…. అది మెదడు కణజాలంపై ఒత్తిడి పెంచుతుంది. మెదడు కణజాలం పుర్రె భాగం నుంచి స్వల్పంగా వెనక్కి లాగబడటం వల్ల నొప్పి గ్రాహకాలు యాక్టివేట్ అవుతాయి. దీనికి తోడు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఉండే తీవ్రమైన సూర్యరశ్మి నేరుగా కంటిపై పడటం వల్ల కూడా మెదడులోని విజువల్ కార్టెక్స్ అతిగా ప్రేరేపితమై మైగ్రేన్ దాడికి దారితీస్తుంది. దీంతో నిద్రలేమి సమస్య ఏర్పడటంతో పాటు ఇతర సమస్యలు వస్తుంటాయి.

చాలామంది సాధారణ తలనొప్పిని మైగ్రేన్ అని తప్పుగా భావిస్తుంటారు. మైగ్రేన్ వచ్చే ముందు అలసట, మూడ్ స్వింగ్స్, మెడ పట్టేయడం వంటి లక్షణాలు 12 నుండి 24 గంటల ముందే కనిపిస్తాయి. దీనిని 'ప్రోడ్రోమ్' అంటారు. నొప్పి సాధారణంగా తలకి ఒక పక్కన మాత్రమే వస్తుంది. అదే నిర్జలీకరణ వల్ల వచ్చే తలనొప్పి అయితే తల మొత్తం భారంగా అనిపిస్తుంది, నీరు తాగితే తగ్గుతుంది. కానీ మైగ్రేన్ వచ్చినప్పుడు కేవలం నీరు తాగితే సరిపోదు అని డాక్టర్ మెహ్రోత్రా వివరించారు.

మైగ్రేన్ సమస్య వచ్చినప్పుడు రోగిని మొదట చల్లని, చీకటిగా ఉండే నిశ్శబ్ద గదిలో ఉంచాలని డాక్టర్ మెహ్రోత్రా సూచిస్తున్నారు. ఎలక్ట్రోలైట్స్ కలిపిన నీటిని అందించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. "ప్రారంభ దశలోనే రిప్టాన్స్ వంటి మందులు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే నాప్రోక్సెన్ సోడియం వంటి ఎన్ఎస్ఏఐడి (NSAIDs) మందులు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి" అని ఆమె పేర్కొన్నారు.

  • ప్రతిరోజూ కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి.
  • పగటిపూట ఎండలో తిరగడం తగ్గించుకోవాలి.
  • భోజనాన్ని ఎప్పుడూ స్కిప్ చేయకూడదు.
  • పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి.
  • యువీ ప్రొటెక్షన్ ఉన్న సన్ గ్లాసెస్ మరియు వదులైన దుస్తులు ధరించాలి.

తలనొప్పితో పాటు జ్వరం రావడం, మెడ బిగదీసుకుపోవడం, గందరగోళంగా అనిపించడం లేదా అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావడం వంటివి జరిగితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఇవి సాధారణ మైగ్రేన్ లక్షణాలు కాకపోవచ్చు… ఇతర తీవ్రమైన సమస్యలకు సంకేతాలు కావొచ్చని డాక్టర్డాక్టర్ రూపాలి మెహ్రోత్రా వివరించారు. .

గమనిక: కేవలం ఇక్కడ డాక్టర్ అభిప్రాయాల మేరకు మాత్రమే ఈ ఆర్టికల్ పబ్లిష్ చేయటం జరిగింది. మీ వైద్య పరిస్థితి గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే సంబంధిత వైద్యుడి సలహా తీసుకోండి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More