Morning Habits : నిద్రలేవగానే స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా? ఈ పొరపాట్లే మీ అలసటకు కారణం!

ఉదయం బాగుంటేనే.. రోజంతా బాగుంటుంది! మీరు నిద్రలేచిన తర్వాత గడిపే మొదటి 90 నిమిషాలే ఆ రోజంతా మీ ఆరోగ్యం, మూడ్, పనితీరును నిర్ణయిస్తాయని హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ వివరిస్తున్నారు. మరి ఆ 90 నిమిషాల్లో ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 28, 2026, 12:17:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Best morning habits : హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఉరుకుల పరుగుల జీవితం గడిపే వారు ఉదయం లేవగానే హడావుడిగా సిద్ధమైపోతుంటారు. అయితే, మన శరీరం, మెదడు సహజ సిద్ధమైన గడియారం (Circadian Rhythm) ప్రకారం పనిచేస్తాయి. ఉదయం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు రోజంతా మనల్ని నీరసంగా మార్చేస్తాయని హైదరాబాద్​లోని అపోలో హాస్పిటల్స్ ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఎక్స్ వేదికగా ఆయన పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఉదయం లేస్తూనే ఈ తప్పులు చేస్తే.. రోజంతా నరకమే! (Pexel)
ఉదయం లేస్తూనే ఈ తప్పులు చేస్తే.. రోజంతా నరకమే! (Pexel)

సూర్యరశ్మితోనే అసలైన మేల్కొలుపు..

"నిద్రలేచిన అరగంట నుంచి గంట లోపు కచ్చితంగా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి," అని డాక్టర్ సుధీర్ కుమార్ సూచించారు. సూర్యకాంతి మన శరీరంలో 'కోర్టిసోల్' అనే అలర్ట్‌నెస్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది మనల్ని హుషారుగా మార్చడమే కాకుండా, రాత్రి పూట ప్రశాంతమైన నిద్రకు కారణమయ్యే 'మెలటోనిన్' ఉత్పత్తికి టైమర్ సెట్ చేస్తుంది. కిటికీలో నుంచి కాకుండా నేరుగా బయటకు వెళ్లి 10-20 నిమిషాల పాటు ఎండలో ఉండటం వల్ల మెదడులోని డోపమైన్ వ్యవస్థ మెరుగుపడి మీ మూడ్ ఉత్సాహంగా ఉంటుంది.

కాఫీ విషయంలో పొరపాటు వద్దు..

చాలామందికి బెడ్ కాఫీ తాగడం అలవాటు. కానీ ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు. మనం నిద్రలేచినప్పుడు మెదడులో 'అడెనోసిన్' (నిద్రను ప్రేరేపించే రసాయనం) శుభ్రం అయ్యే ప్రక్రియ మొదలవుతుంది. ఆ సమయంలోనే కెఫీన్ శరీరంలోకి వెళితే ఆ రసాయనాలు అలాగే పేరుకుపోయి, మధ్యాహ్నం వేళలో తీవ్రమైన అలసటకు దారి తీస్తాయి. అందుకే నిద్రలేచిన కనీసం 90 నిమిషాల తర్వాతే కాఫీ లేదా టీ తాగడం ఉత్తమం.

మొదటి పానీయం.. నీరు మాత్రమే!

"నిద్రలో మన శరీరం శ్వాస ద్వారా, చెమట ద్వారా నీటిని కోల్పోతుంది. కాబట్టి ఉదయం ఏ ఇతర పానీయాలు తీసుకున్నా తీసుకోకపోయినా, కనీసం 500ఎంఎల్ నీరు తప్పనిసరిగా తాగాలి," అని డాక్టర్ పేర్కొన్నారు. శరీరంలో నీటి శాతం తగ్గితే మెదడు మందగించడం (బ్రెయిన్ ఫాగ్), తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. నీటితో పాటు బ్రిస్క్ వాకింగ్ లేదా తేలికపాటి స్ట్రెచింగ్ చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

చేయకూడని పనులు ఇవే..

చాలామందికి కళ్లు తెరవగానే స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ చూడటం ఒక వ్యసనంగా మారింది.

డిజిటల్ డోపమైన్ లూప్: నిద్రలేవగానే సోషల్ మీడియా చూడటం వల్ల మెదడు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. ఇది మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. ఫోన్‌ను కనీసం మొదటి గంట పాటు వేరే గదిలో ఉంచడం మంచిది.

స్నూజ్ బటన్ ప్రమాదం: అలారంను ఆపి మళ్లీ పది నిమిషాలు పడుకోవడం వల్ల 'స్లీప్ ఇనర్షియా' కలుగుతుంది. దీనివల్ల మెదడు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతుంది.

చక్కెర తక్కువ - ప్రోటీన్ ఎక్కువ: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీపి పదార్థాలు, మైదా వంటివి కాకుండా ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి. లేదంటే రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగి తగ్గి, మళ్లీ ఆకలి, నీరసానికి కారణమవుతాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More