Pawan Kumar Chandana : నెలకు 40వేల జీతం నుంచి ఇప్పుడు 1.1 బిలియన్ డాలర్ల సామ్రాజ్యానికి ఫౌండర్​గా..

స్పెస్‌టెక్ రంగంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన 'విక్రమ్-1' రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి చేరుకుని, దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌గా నిలిచింది. ఈ చారిత్రక ఘట్టం వెనుక ఉన్న సంస్థ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన స్ఫూర్తిదాయక విజయగాథ ఇదే!

Published on: Jul 21, 2026, 06:18:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత వాణిజ్య అంతరిక్ష రంగానికి సరికొత్త వెలుగులు లభించాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' రూపొందించిన 'విక్రమ్-1' రాకెట్ భూకక్ష్యలోకి ఇటీవలే విజయవంతంగా దూసుకెళ్లి రికార్డు సృష్టించింది. భారతదేశం నుంచి శాటిలైట్లను కక్ష్యలోకి పంపిన తొలి ప్రైవేట్ రాకెట్‌గా 'విక్రమ్-1' చరిత్ర పుటల్లోకెక్కింది. ఈ చారిత్రక విజయం సాధించిన వేళ, స్మార్ట్ కార్పొరేట్ ఉద్యోగాలను కాదని దేశీయ రోదసి ప్రయోగాలు ఎంచుకున్న స్కైరూట్ సీఈఓ పవన్ కుమార్ చందన గురించి, ఆయన సక్సెస్​ గురించి ఆసక్తికర విషయాలు..

స్కౌరూట్ ఎయిరోస్పేస్ ఫౌండర్, సీఈఓ పవన్.. (PTI)
స్కౌరూట్ ఎయిరోస్పేస్ ఫౌండర్, సీఈఓ పవన్.. (PTI)

ఎవరీ పవన్ కుమార్ చందన?

హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ‘స్కైరూట్ ఏరోస్పేస్’ కో-ఫౌండర్, సీఈఓగా పవన్ కుమార్ చందన వ్యవహరిస్తున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి అయిన పవన్, 2012లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా నేరుగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో సైంటిస్ట్‌గా ఎంపికయ్యారు. ఇస్రోలో దాదాపు ఆరేళ్ల పాటు కీలక ప్రాజెక్టులపై పనిచేసిన ఆయన, తనలోని స్టార్టప్ కలలను నిజం చేసుకునేందుకు 2018లో ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఇస్రోలోని తన సహచర ఇంజనీర్ నాగా భరత్ డాకాతో కలిసి 2018లో 'స్కైరూట్ ఏరోస్పేస్' సంస్థను స్థాపించారు. 2022 నవంబర్ 18న భారతదేశంలోనే తొలి ప్రైవేట్ సబ్‌ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-ఎస్’ను విజయవంతంగా ప్రయోగించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఇటీవల అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమకూర్చుకున్న స్కైరూట్, ఏకంగా 1.1 బిలియన్ డాలర్ల వ్యాల్యుయేషన్ సాధించి, భారత్‌లోనే తొలి 'స్పేస్‌టెక్ యూనికార్న్'గా ఆవిర్భవించింది.

“అధిక జీతం కాదు.. ఆశయమే ముఖ్యం”

ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డ్యూయల్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రైవేట్ రంగంలో భారీ ఆఫర్లు వచ్చినా, ఇస్రో సర్కారీ ఉద్యోగాన్ని ఎంచుకున్నట్టు, అది ఎంతో రిస్క్‌తో కూడుకున్న నిర్ణయమని పవన్ గుర్తుచేసుకున్నారు.

“ఐఐటీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం చాలా అరుదు. ఆ రోజుల్లో నేను ఆ రిస్క్ తీసుకున్నాను. ఇస్రోలో చేరినప్పుడు నా మొదటి జీతం నెలకు కేవలం రూ. 35,000 నుంచి రూ. 40,000 మాత్రమే. కానీ నాకు డబ్బు కంటే పని పట్ల ఉన్న మక్కువ (ప్యాషన్) ప్రధానం. విదేశాలకు వెళ్లిపోకుండా, సొంత దేశంలోనే అత్యాధునిక సాంకేతికతపై రోజుకు 16 గంటలు పనిచేసే అవకాశం దక్కింది. ఆ నిర్ణయే ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది,” అని పవన్ కుమార్ చందన వివరించారు.

యువతకు పవన్ సందేశం..

లక్షల రూపాయల ప్యాకేజీల వెనుక పరుగులు తీయకుండా, నచ్చిన రంగాన్ని ఎంచుకోవాలని దేశంలోని యువతకు పవన్ సూచించారు.

“మనం ఎప్పుడూ ప్రారంభ జీతం గురించే ఆలోచించకూడదు. జీవితంలో పెద్దగా సాధించాలనుకుంటే మన ప్యాషన్‌ను నమ్ముకోవాలి. నేను ఐఐటీలో చేరినప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పెద్దగా అవకాశాలు ఉండవని చాలామంది భయపెట్టారు. కానీ గత మూడేళ్లలోనే భారత ప్రైవేట్ స్పేస్ రంగం దాదాపు 5,000 మందికి పైగా కొత్త ఉద్యోగాలు కల్పించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే, రాబోయే రోజుల్లో అద్భుతాలు జరగబోతున్నాయి,” అని ఆశాభావం వ్యక్తం చేశారు.

విక్రమ్-1 విజయవంతమైన వేళ పవన్ కుమార్ చందన పంచుకున్న ఈ అనుభవాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More