Healthy food : సీడ్స్ ఎలా తింటున్నారు? ఈ చిన్న పొరపాటు చేస్తే పోషకాలన్నీ వేస్ట్!

చియా, అవిసె, గుమ్మడి, నువ్వులు, సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని మాములుగా తింటే సరిపోదు, సరైన పద్ధతిలో తీసుకుంటేనే పోషకాలు శరీరానికి అందుతాయని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ చెబుతున్నారు. ఏ సీడ్స్​ని ఎలా తీసుకోవాలో ఈ కథనంలో చూద్దాం.

Published on: Sep 23, 2026, 07:30:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇటీవలి కాలంలో చాలా మందికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి, తమ దినచర్యలో రకరకాల సీడ్స్​ని భాగం చేసుకుంటున్నారు. ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మైక్రో న్యూట్రియెంట్లు పుష్కలంగా ఉండే చియా, అవిసె, నువ్వులు వంటి గింజలను సూపర్‌ఫుడ్స్‌గా భావిస్తున్నారు. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. ఆహారంలో గింజలను చేర్చుకోవడం ఎంత ముఖ్యమో, వాటిని సరైన కాంబినేషన్‌లో తీసుకోవడం కూడా అంతే ముఖ్యం! తప్పుడు పద్ధతిలో తింటే వాటిలోని పోషకాలు శరీరానికి సరిగ్గా అబ్బవు.

ఏ సీడ్​ని ఎలా తినాలి? ఇవి తెలుసుకోండి..
ఏ సీడ్​ని ఎలా తినాలి? ఇవి తెలుసుకోండి..

మరి పోషకాలు పూర్తిస్థాయిలో అందాలంటే?

"మనం తీసుకునే విత్తనాల నుంచి శరీరానికి సంపూర్ణ పోషకాలు లభించాలంటే వాటిని సరైన ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవాలి," అని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శ్రుతి కైన్యా తమ 'హెల్త్ విత్ శ్రుతి' ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా స్పష్టం చేశారు. మన ఇళ్లలో రోజూ వాడే ఐదు రకాల గింజల నుంచి గరిష్ఠ ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు ఆమె కొన్ని సులువైన చిట్కాలను పంచుకున్నారు.

ఏ గింజలను ఎలా తీసుకోవాలి?

1. చియా గింజలు - పెరుగు కాంబినేషన్:

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, ఫైబర్ మెండుగా ఉండే చియా గింజలను నేరుగా తినకూడదు. వీటిని కొద్దిసేపు నీటిలో నానబెట్టాలి. అలా నానబెట్టిన చియా గింజలను పెరుగులో కలుపుకుని తింటే శరీరానికి అవసరమైన ప్రోబయోటిక్స్ లభించడంతో పాటు జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.

2. అవిసె గింజలు - సోంపు మిశ్రమం:

అవిసె గింజల్లో (Flaxseeds) ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని దోరగా వేయించి, పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని కొద్దిగా సోంపుతో (Fennel seeds) కలిపి భోజనం తర్వాత 'మౌత్ ఫ్రెష్‌నర్' లాగా తీసుకోవాలి. ఇది తిన్న ఆహారం త్వరగా అరగడానికి సహాయపడటమే కాకుండా కడుపు ఉబ్బరం (బ్లోటింగ్) సమస్యను తగ్గిస్తుంది.

3. నువ్వులు - రాగి పిండితో క్యాల్షియం ధమాకా:

ఎముకల బలానికి నువ్వులు ఎంతో దోహదం చేస్తాయి. నువ్వులను పొడి చేసి, మనం రోజూ చేసుకునే రాగి రొట్టెలు లేదా సంకటి పిండిలో కలిపి వండుకోవచ్చు. నువ్వులు, రాగి రెండింటిలోనూ క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

4. గుమ్మడి గింజలు - పండ్ల ముక్కలు:

గుమ్మడి గింజలలో (Pumpkin seeds) మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని దోరగా వేయించి, రోజూ తినే తాజా పండ్ల ముక్కలపై (ఫ్రూట్ సలాడ్) చల్లుకుని తింటే మంచి రుచితో పాటు శరీరానికి కావలసిన మెగ్నీషియం అందుతుంది.

5. సబ్జా గింజలు - కొబ్బరి నీళ్లు:

మలబద్ధకంతో బాధపడేవారికి ఇది అద్భుతమైన చిట్కా. సబ్జా గింజలను కొద్దిసేపు నీటిలో నానబెట్టి, తాజా కొబ్బరి నీళ్లలో కలుపుకుని తాగాలి. ఈ కాంబినేషన్ శరీరాన్ని చల్లబరచడమే కాకుండా జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి మలబద్ధకం నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

నిత్య జీవితంలో మనం చేసుకునే ఈ చిన్నచిన్న మార్పులు ఆహారంలోని పోషకాలను శరీరం వేగంగా గ్రహించేలా చేస్తాయి. కాబట్టి రేపటి నుంచి ఈ గింజలను సరైన పద్ధతిలో తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More