Protein : మితిమీరిన అమృతం కూడా విషమే! ప్రోటీన్​ ఎక్కువ తీసుకుంటే కలిగే నష్టాలు ఇవి..

కండరాల పుష్టికి, బరువు తగ్గడానికి ఆహారంలో ప్రొటీన్ ఉండటం ఎంతో అవసరమే అయినప్పటికీ.. దానిని మితిమీరి తీసుకుంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు తప్పవని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ప్రొటీన్ వల్ల వచ్చే గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, కిడ్నీ సమస్యల గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాము

Published on: Jun 4, 2026, 07:28:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

High protein diet side effects : శరీర దారుఢ్యానికి, జీవక్రియలు సక్రమంగా సాగడానికి, కడుపు నిండుగా ఉంచడానికి ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కారణంగానే ప్రస్తుతం హై-ప్రొటీన్ డైట్‌కు ఆదరణ విపరీతంగా పెరిగింది. అయితే అమృతం అయినా మితిమీరితే విషమే అన్నట్లు.. అవసరానికి మించి ప్రొటీన్ తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. రోజూ ఒక వ్యక్తి తన శరీర బరువును బట్టి ప్రతి కిలోగ్రాముకు 1.2 గ్రాముల కంటే ఎక్కువ ప్రొటీన్‌ను క్రమంతప్పకుండా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయని మిస్సౌరీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ న్యూట్రిషన్ ప్రొఫెసర్ బెట్టినా మిట్టెన్‌డోర్ఫర్ పేర్కొన్నారు.

అధిక ప్రోటీన్ డైట్​తో కలిగే సమస్యలు..
అధిక ప్రోటీన్ డైట్​తో కలిగే సమస్యలు..

నిపుణులు హెచ్చరిస్తున్న ఆ 5 ప్రమాదాలు ఇవే..

1. గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ముప్పు!

మనం తీసుకునే ప్రొటీన్‌లో ఎక్కువ భాగం జంతు సంబంధిత ఆహారం (మాంసం) నుంచే వస్తుంది. ముఖ్యంగా రెడ్ మీట్ (మేక, గొర్రె, గొడ్డు మాంసం), ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువని మాయో క్లినిక్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ డోనాల్డ్ హెన్రూడ్ తెలిపారు.

రోజూ తినే ఆహారానికి అదనంగా 100 గ్రాముల రెడ్ మీట్ జత చేస్తే గుండె జబ్బుల ముప్పు 11 శాతం పెరుగుతుందని, అదే 50 గ్రాముల ప్రాసెస్డ్ మీట్ తింటే ఆ ముప్పు 26 శాతం పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. రెడ్ మీట్‌లో ఉండే సాచ్యురేటెడ్​ ఫ్యాట్ శరీరంలో ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్)ను పెంచడమే కాకుండా, ఇన్సులిన్ నిరోధకతకు దారితీసి డయాబెటిస్‌ను తెచ్చిపెడతాయని డాక్టర్ హెన్రూడ్ వివరించారు.

2. క్యాన్సర్ వచ్చే అవకాశాలు..

అధికంగా రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్, ముఖ్యంగా కోలొరెక్టల్ (పేగు) క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. రెడ్ మీట్ ఎక్కువగా తినే వారిలో పేగు క్యాన్సర్ ముప్పు 30 శాతం, ప్రాసెస్డ్ మీట్ తినే వారిలో 40 శాతం పెరుగుతున్నట్లు తేలింది.

“కేవలం మాంసం పైనే ఆధారపడకుండా బీన్స్, పప్పుధాన్యాలు, సోయా ఫుడ్స్, డ్రై నట్స్, చేపలు, పెరుగు వంటి ఆరోగ్యకరమైన ప్రొటీన్ వనరులకు ప్రాధాన్యత ఇవ్వాలి” అని టఫ్ట్స్ యూనివర్సిటీకి చెందిన కార్డియాలజిస్ట్ డారిష్ మోజాఫరియన్ సూచించారు.

3. మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలు..

ప్రొటీన్ తీసుకోవడం పెంచే క్రమంలో చాలామంది కార్బోహైడ్రేట్లు, ఫైబర్ (పీచు పదార్థం) ఉండే కూరగాయలు, తృణధాన్యాలను పూర్తిగా పక్కన పెడతారని బోస్టన్‌లోని బ్రిగ్‌హామ్ అండ్ విమెన్స్ హాస్పిటల్ న్యూట్రిషనిస్ట్ మార్క్ ఓమేరా చెప్పారు. జీర్ణక్రియ సజావుగా సాగడానికి, కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధికి ఫైబర్ చాలా అవసరం. పీచు పదార్థం తగ్గితే మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ప్లేటు నిండా ప్రొటీన్ మాత్రమే కాకుండా కూరగాయలు కూడా ఉండేలా చూసుకోవాలి.

4. ఊబకాయం లేదా బరువు పెరగడం..

బరువు తగ్గడానికి ప్రొటీన్ సహాయపడుతుందనే మాట నిజమే అయినప్పటికీ, శరీరానికి అవసరమైన క్యాలరీల కంటే ఎక్కువ ప్రొటీన్ తీసుకుంటే అది బరువు పెరగడానికి కారణమవుతుంది. మన శరీరం ఉపయోగించుకోగా మిగిలిపోయిన అదనపు ప్రొటీన్ క్యాలరీలను కొవ్వు రూపంలో దాచుకుంటుందని డాక్టర్ మోజాఫరియన్ స్పష్టం చేశారు.

5. కిడ్నీలపై తీవ్ర ప్రభావం..

సాధారణ ఆరోగ్యవంతుల్లో ప్రొటీన్ వల్ల కిడ్నీ సమస్యలు రాకపోవచ్చు కానీ, ఇప్పటికే కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మాత్రం ఇది శాపంగా మారుతుందని డాక్టర్ హెన్రూడ్ హెచ్చరించారు. ఎక్కువ మొత్తంలో ప్రొటీన్‌ను ప్రాసెస్ చేయడం వల్ల బలహీనంగా ఉన్న కిడ్నీలపై అదనపు భారం పడుతుంది. అలాగే జంతు ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా పెరుగుతుంది.

ప్రొటీన్ శరీరానికి అవసరమైన పోషకమే, కానీ మితిమీరి తింటే అదనపు ప్రయోజనాలేవీ ఉండవని, పైగా నష్టాలే ఎక్కువని నిపుణులు తేల్చి చెబుతున్నారు. సమతుల్య ఆహారంతో పాటు ప్లాంట్ బేస్డ్ (మొక్కల ఆధారిత) ప్రొటీన్లను డైట్‌లో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో సురక్షితం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More