ఎంత నిద్రపోయినా, లేచిన వెంటనే అలసటగా అనిపిస్తోందా? ఇవి తెలుసుకోండి..

ఎంత నిద్రపోయినా, అలసటతో మెల్కొంటున్నారా? రోజంతా అలసటగానే ఉంటుందా? ప్రశాంతమైన నిద్ర కోసం 7 చిట్కాలను సూచించారు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పాల్ మణికం. వీటిని ఫాలో అయితే మీ స్లీప్​ సైకిల్​ కచ్చితంగా పెరుగుతుంది అని అంటున్నారు.

Published on: Nov 30, 2025, 06:45:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రాత్రి సరిగా నిద్రపోయినప్పటికీ, ఉదయం లేవగానే అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? బెడ్​ మీద నుంచి లేచేటప్పుడు శరీరం నొప్పిగా, డ్రౌజీగా అనిపిస్తే, మీ రోజువారీ అలవాట్లలో కొన్ని మీ స్లీప్​ సైకిల్​ని దెబ్బతీస్తున్నాయని అర్థం! ఇది మీ శరీరానికి అవసరమైన గాఢమైన, పునరుద్ధరణ కలిగించే విశ్రాంతిని అందకుండా అడ్డుకుంటుంది.

నిద్ర లేచిన వెంటనే అలసట అనిపిస్తోందా? (Unsplash)
నిద్ర లేచిన వెంటనే అలసట అనిపిస్తోందా? (Unsplash)

ప్రివెంటివ్​ గ్యాస్ట్రోఎంటరాలజీలో నిపుణుడు, కాలిఫోర్నియాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ప్రసిద్ధ పాడ్‌కాస్ట్ హోస్ట్ అయిన డాక్టర్ పాల్ మణికం స్లీప్​ సైకిల్​ దెబ్బతిన్న వారు, ఉదయం తాజాగా మేల్కొనడానికి పాటించాల్సిన ఏడు చిట్కాలను షేర్​ చేశారు.

నవంబర్ 28న తన "గట్ ఫీలింగ్ విత్ డాక్టర్ పాల్" అనే పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో ఈ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మాట్లాడుతూ.. "ఎవరైనా సరిపడా నిద్ర లేదా నాణ్యమైన నిద్ర పొందకపోయినా, లేదా నిద్ర సమయాన్ని సరిగ్గా పాటించకపోయినా, పగటిపూట వారు అలసటగా, నిద్రగా, చిరాకుగా ఉంటారు. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి. అందుకే నేను ఎల్లప్పుడూ 'మంచి రోజుకు మంచి రాత్రి నిద్ర చాలా అవసరం,' అని చెప్తాను," అన్నారు.

నిద్ర సమయాన్ని స్థిరంగా పాటించండి

నిద్ర వేళలను స్థిరంగా నిర్వహించాలని డాక్టర్ మణికం సిఫార్సు చేస్తున్నారు. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం వల్ల మీ సర్కేడియన్ రిథమ్ నియంత్రణలో ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. తద్వారా మీరు మరింత తాజాగా మేల్కొనవచ్చు.

నిద్రకు ముందు ప్రకాశవంతమైన కాంతిని తగ్గించండి

ప్రకాశవంతమైన కాంతి మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే, పడుకునే ముందు లైట్లను డిమ్ చేసుకోవడం మంచి నిద్రకు దోహదపడుతుంది. "రాత్రి 7 గంటల తర్వాత వెచ్చని పసుపు రంగు లైట్లకు మారండి," అని డాక్టర్ మణికం సూచిస్తున్నారు.

గది ఉష్ణోగ్రతను చల్లగా ఉంచండి

తక్కువ ఉష్ణోగ్రతలు నిద్రపోయే సమయం దగ్గర పడుతోందనే సంకేతాన్ని మెదడుకు పంపుతాయి, తద్వారా మెదడు రిలాక్స్ అవ్వడానికి సిద్ధపడుతుంది. "పడుకునే ముందు మీ ఏసీని ఒకటి లేదా రెండు డిగ్రీలు తగ్గించుకోండి," అని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సలహా ఇస్తున్నారు.

మంచాన్ని నిద్రకు మాత్రమే ఉపయోగించండి

మంచంపైకి వెళ్లడం అంటే నిద్రపోవడమే అని మీ మెదడుకు శిక్షణ ఇవ్వడం ద్వారా మీరు త్వరగా నిద్రలోకి జారుకోవచ్చు. "మంచంపై పని చేయడం, చదవడం లేదా ఫోన్ స్క్రోల్ చేయడం వంటివి చేయవద్దు. మీ మెదడుకు స్విచ్ ఆఫ్ అయ్యేలా శిక్షణ ఇవ్వండి," అని డాక్టర్ మణికం సూచిస్తున్నారు.

భోజనాన్ని త్వరగా ముగించండి

రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల మీ శరీరం నిద్రకు ముందు విశ్రాంతి తీసుకోకుండా, జీర్ణక్రియ కోసం అదనపు పని చేయాల్సి వస్తుంది. త్వరగా భోజనం చేయడం వలన జీర్ణక్రియ పూర్తయి, శరీరం ప్రశాంతమైన స్థితికి చేరుకోవడానికి తగిన సమయం లభిస్తుంది. "పడుకోవడానికి రెండు నుంచి మూడు గంటల ముందు మీ చివరి భోజనాన్ని ముగించండి," అని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సూచిస్తున్నారు.

మధ్యాహ్నం 3 గంటల తర్వాత కెఫీన్‌కు దూరంగా ఉండండి

కెఫీన్ మన శరీరం నుంచి పూర్తిగా బయటకు వెళ్లడానికి చాలా గంటలు పడుతుంది. అందుకే, మధ్యాహ్నం 3 గంటల తర్వాత కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగడం మీ స్లీప్​ సైకిల్​ని దెబ్బతీస్తుంది. దీనికి బదులుగా, హెర్బల్ టీలు లేదా సాదా గోరువెచ్చని నీటిని తాగాలని డాక్టర్ మణికం సిఫార్సు చేస్తున్నారు.

10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి

పడుకునే ముందు 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని, ఏ కార్యకలాపాలను చేయకుండా ఉండటం వల్ల శరీరం రిలాక్స్ అవ్వడానికి అవకాశం లభిస్తుంది. ఇది గాఢమైన, మరింత ప్రశాంతమైన నిద్రకు సహాయపడుతుంది. డాక్టర్ మణికం ప్రకారం, ఇది "మీ శరీరాన్ని విశ్రాంతి మోడ్‌లోకి మారుస్తుంది."

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More