Physically inactive people : శారీరక శ్రమ లేకపోతే ప్రాణాలకే ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక..

శారీరక శ్రమ కొరవడటం, కదలికల్లేని జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక వ్యాధులు పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్​ఓ తన మార్గదర్శకాల్లో హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ రోజూ చురుగ్గా ఉండాలని సూచించింది.

Published on: Aug 9, 2026, 08:15:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

"శారీరక శ్రమను పెంచుకుంటే ఆయుష్షు పెరుగుతుంది" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. కదలికల్లేని ఆధునిక జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అసంక్రమిత వ్యాధులు (ఎన్​సీడీ) విపరీతంగా పెరుగుతున్నాయని, ఇది వైద్య ఆరోగ్య రంగంపై తీవ్రమైన భారాన్ని మోపుతోందని గతంలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

శారీరక శ్రమ లేకపోతే ప్రాణాలకే ముప్పు! (Pexel)
శారీరక శ్రమ లేకపోతే ప్రాణాలకే ముప్పు! (Pexel)

ప్రాణాంతకంగా మారుతున్న నిశ్చల జీవనశైలి!

మోటారు వాహనాల వాడకం పెరగడం, ఉద్యోగం, చదువు, వినోదం కోసం రోజంతా స్క్రీన్ల ముందు గడపడం వల్ల ఆధునిక జీవితం పూర్తిగా నిశ్చలంగా మారిపోయిందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. శారీరక శ్రమ లేకపోవడం వల్లనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిచెప్పింది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం శారీరక శ్రమ చేయని వ్యక్తులతో పోలిస్తే, తగినంత వ్యాయామం చేసేవారితోనూ పోలిస్తే సోమరితనంతో ఉండేవారిలో మరణ ముప్పు 20 నుంచి 30 శాతం ఎక్కువగా ఉంటుంది.

వివిధ వయసుల వారిపై ప్రభావం ఎలా ఉంటుంది?

క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, నిశ్చల జీవనశైలి వల్ల ఎదురయ్యే ప్రమాణాలను ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

పిల్లలు, కౌమార దశలో ఉన్నవారు రోజూ శారీరకంగా చురుగ్గా ఉంటే దేహదారుఢ్యం, ఎముకల బలం, మానసిక ఉల్లాసం పెరుగుతాయి. అదే సమయంలో ఎక్కువ సమయం కూర్చునే అలవాటు ఉంటే నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి.

పెద్దలు, వృద్ధులు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం వంటి ప్రాణాంతక సమస్యల బారిన పడే ముప్పు తగ్గుతుంది. గంటల తరబడి కదలకుండా కూర్చుంటే క్యాన్సర్ రిస్క్ విపరీతంగా పెరుగుతుంది.

గర్భిణులు, బాలింతలు శారీరకంగా చురుగ్గా ఉంటే ప్రసవ సమయాల్లో ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు ప్రసవానంతర డిప్రెషన్ దూరం అవుతుంది. వ్యాయామం వల్ల పుట్టబోయే బిడ్డ బరువుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని సంస్థ స్పష్టం చేసింది.

ఐదేళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ప్రతి ఒక్కరూ తగిన మోతాదులో వ్యాయామం చేయాలని డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. అసలు శారీరక శ్రమ చేయకపోవడం కంటే ఏదో ఒక రూపంలో శ్రమ చేయడం ఎంతో మేలని, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం అలవాటు చేసుకోవాలని నిపుణులు తేల్చిచెప్పారు. ఐదేళ్ల లోపు పిల్లల కోసం ప్రత్యేకంగా స్క్రీన్ టైమ్​ను తగ్గించేలా 24 గంటల నిద్ర, ఆటపాటల దినచర్యను రూపొందించాలని సూచించారు.

నిపుణుల ప్రకారం.. శరీర కండరాల కదలికల ద్వారా శక్తిని ఖర్చు చేసే ప్రతి పద్ధతినీ శారీరక శ్రమగా పరిగణించవచ్చు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు, ప్రయాణ సమయాల్లో, లేదా ఇళ్లలో పనులు చేసేటప్పుడు చేసే ప్రతి చిన్న కదలిక దీని కిందకే వస్తుంది. నడక, సైక్లింగ్, క్రీడలు వంటి తేలికపాటి లేదా తీవ్రమైన వ్యాయామాలు అన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎటువంటి నైపుణ్యాలతోనైనా, ఏ వయసువారైనా వీటిని సులభంగా ఆచరించవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More