Fitness habits : జిమ్‌లో చెమటోడ్చినా ఫలితం లేదా? ఫిట్‌నెస్‌లో ఈ 8 తప్పులు అస్సలు చేయకండి..
ఫిట్‌నెస్ సాధించడంలో కేవలం జిమ్‌లో వర్కౌట్‌లు చేయడం మాత్రమే సరిపోదు. వర్కౌట్ వెలుపల చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మీ ఆరోగ్యాన్ని, కండరాల బలాన్ని దెబ్బతీస్తాయి. ఆ తప్పులేంటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఫిట్‌నెస్ నిపుణురాలు దీప్తి శర్మ అందించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ప్రతిరోజూ జిమ్‌కి వెళుతున్నాం, గంటల తరబడి చెమటోడుస్తున్నాం.. అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదని బాధపడుతున్నారా? అయితే సమస్య మీ వ్యాయామంలో మాత్రమే కాదు, జిమ్ బయట మీరు పాటిస్తున్న అలవాట్లలో కూడా ఉండవచ్చు! ఫిట్‌నెస్ ప్రయాణంలో కేవలం బరువులు ఎత్తడం మాత్రమే కాదు, శరీరానికి తగిన విశ్రాంతి, సమతుల ఆహారం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. 'మల్టీఫిట్' డైరెక్టర్, ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణురాలు దీప్తి శర్మ వర్కౌట్ చేసేవారు సాధారణంగా చేసే 8 ప్రధాన పొరపాట్లను, వాటి పరిష్కారాలను విశ్లేషించారు.

వార్మప్ చేయకుండా నేరుగా వ్యాయామం ప్రారంభించడం
సమయం లేదనే సాకుతో నేరుగా వెెయిట్స్ ఎత్తేయడం చాలామంది చేసే పెద్ద పొరపాటు. బిగుతుగా ఉండే కండరాలతో వ్యాయామం చేస్తే గాయాలు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
"ప్రధాన వర్కౌట్ ప్రారంభించే ముందు 5 నుంచి 10 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్, ఆర్మ్ సర్కిల్స్, బాడీవెయిట్ స్క్వాట్స్ వంటి తేలికపాటి వ్యాయామాలతో శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి," అని దీప్తి శర్మ సూచించారు.
సరైన ఫామ్ లేకుండా బరువులు ఎత్తడం
ప్రాథమిక సూత్రాలు పాటించకుండా శరీరం తట్టుకోలేనంత ఎక్కువ బరువులు ఎత్తితే నడుము, భుజాలు, మోకాళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. భంగిమ సరిగ్గా లేకపోతే దీర్ఘకాలిక గాయాల బారిన పడతారు. చివరి కొన్ని రిపిటీషన్లలో మీ భంగిమ తప్పుతోందంటే, ఆ రోజుకి ఆ బరువు మీ శరీరంపై ఎక్కువ ఒత్తిడి తెస్తోందని అర్థం చేసుకోవాలి.
విశ్రాంతిని సోమరితనంగా భావించడం..
కండరాలు వ్యాయామం చేసేటప్పుడు పెరగవు. వర్కౌట్ పూర్తయిన తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో మాత్రమే రిపేర్ అవుతాయి. వారంలో 7 రోజులూ విశ్రాంతి లేకుండా వ్యాయామం చేస్తే తీవ్రమైన అలసట, కీళ్ల నొప్పులు వస్తాయి. వారానికి కనీసం 1 లేదా 2 రోజులు పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. ఆ రోజుల్లో తేలికపాటి వాకింగ్ లేదా స్ట్రెచింగ్ మాత్రమే చేయాలి.
నిద్రను నిర్లక్ష్యం చేయడం..
కండరాలు కోలుకోవడానికి నిద్ర అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయాన్నే జిమ్‌కి వెళితే శరీరానికి తగినంత కోలుకునే సమయం లభించదు.
"రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే శక్తి తగ్గిపోవడమే కాకుండా మూడ్, ఆకలి, తర్వాతి వర్కౌట్ పనితీరు దెబ్బతింటాయి," అని దీప్తి హెచ్చరించారు. కండరాల బలానికి రోజూ 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర తప్పనిసరి.
వర్కౌట్ సమయంలో సరైన ఆహారం తీసుకోకపోవడం..
కొందరు ఖాళీ కడుపుతో వర్కౌట్‌లు చేసి ఆ తర్వాత కూడా గంటల తరబడి ఆహారం తీసుకోరు. మరికొందరు క్యాలరీలను దారుణంగా తగ్గించే క్రాష్ డైట్లు పాటిస్తారు. ఈ రెండూ శరీరాన్ని బలహీనపరుస్తాయి. పప్పుధాన్యాలు, పనీర్, గుడ్లు, పెరుగు, మొలకెత్తిన విత్తనాలు, చికెన్ వంటి ప్రొటీన్‌లతో పాటు అవసరమైన కార్బోహైడ్రేట్లు, కూరగాయలతో కూడిన సమతులాహారం తీసుకోవడం వల్ల వర్కౌట్ ఫలితాలు వేగంగా కనిపిస్తాయి.
తగినంత నీరు తాగకపోవడం..
భారతదేశ ఉష్ణోగ్రతల దృష్ట్యా శరీరంలో నీటి శాతం తగ్గితే కండరాలు పట్టేయడం, తలనొప్పి, త్వరగా అలసట రావడం వంటి సమస్యలు వస్తాయి. కేవలం వర్కౌట్ చేసే సమయంలో మాత్రమే కాకుండా, రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగుతుండాలి.
తీవ్రమైన నొప్పులను నిర్లక్ష్యం చేయడం..
వ్యాయామం చేసిన తర్వాత వచ్చే సాధారణ కండరాల నొప్పి వేరు, కీళ్లు లేదా నరాల్లో వచ్చే తీవ్రమైన నొప్పి వేరు. నొప్పి ఉన్నప్పటికీ బలవంతంగా వర్కౌట్ కొనసాగిస్తే చిన్న సమస్య పెద్ద ప్రమాదంగా మారుతుంది. నొప్పి రెండు మూడు రోజుల్లో తగ్గకపోతే తక్షణమే ఫిజియోథెరపిస్ట్‌ను లేదా వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.
ఒకే రకమైన రొటీన్ పాటిస్తూ ఇతరులతో పోల్చుకోవడం
నెలల తరబడి ఒకే రకమైన వ్యాయామాలు చేస్తే శరీరం దానికి అలవాటుపడి మార్పులు ఆగిపోతాయి! క్రమంగా వ్యాయామాల శైలి, రిపిటీషన్లు లేదా తీవ్రతను మారుస్తూ ఉండాలి. అందరి శరీర తత్వం, జీవనశైలి ఒక్కలా ఉండవు. కాబట్టి ఇతరులను అనుకరించకుండా మీ శరీరానికి తగిన సొంత ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు సాగాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


