...
...
Next Story

2026 Assembly Elections : ఎన్నికల కోడ్​ అంటే ఏంటి? ఇందులోని రూల్స్​ ఏంటి?

2026 Assembly Elections : దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 9 నుంచి ఓటింగ్ ప్రారంభం కానుండగా, మే 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. షెడ్యూల్ రావడంతోనే తక్షణమే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. అసలేంటిది? ఇందులోని రూల్స్​ ఏంటి?

Published on: Mar 16, 2026 05:29 AM IST
Advertisement

దేశంలో ఎన్నికల సమరానికి తెరలేచింది. పశ్చిమ్​ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన క్షణం నుంచే ఐదు ప్రాంతాల్లోనూ 'ఎన్నికల ప్రవర్తనా నియమావళి' (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) అమలులోకి వచ్చింది. దీనినే ఎన్నికల కోడ్​ అని కూడా అంటారు. అసలేంటి ఇది? ఇందులోని నిబంధనలేంటి? ఇక్కడ తెలుసుకోండి..

ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అంటే ఏంటి?

2026 అసెంబ్లీ ఎన్నికల అప్డేట్స్..
2026 అసెంబ్లీ ఎన్నికల అప్డేట్స్..

ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా చూడటం కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలనే 'ఎన్నికల ప్రవర్తనా నియమావళి' అంటారు. ఇది షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అమలులోకి వస్తుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అమలులో ఉంటుంది.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక పాటించాల్సిన నిబంధనలు ఇవే:

విద్వేష పూరిత ప్రసంగాలు: కులం, మతం లేదా మతపరమైన భావోద్వేగాల పేరుతో ఓట్లు అడగకూడదు.

వ్యక్తిగత విమర్శలు: విమర్శలు కేవలం పార్టీల విధానాలు, గత పనితీరు, కార్యక్రమాలపైనే ఉండాలి. అభ్యర్థుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోకూడదు.

అధికార మీడియా వినియోగం: అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు ప్రభుత్వ మీడియాను (మాస్ మీడియా) ఉపయోగించకూడదు.

అక్రమ కార్యకలాపాలు: ఓటర్లకు లంచం ఇవ్వడం, భయపెట్టడం, ఒకరి పేరుతో మరొకరు ఓటు వేయడం వంటివి నిషిద్ధం.

ప్రచారాలు: పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ప్రచారం చేయకూడదు.

నిరసనలు: వ్యక్తుల ప్రైవేట్ ఇళ్ల ముందు ప్రదర్శనలు చేయడం లేదా ఇతరుల ఆస్తులను ప్రచారం కోసం వాడటం నిషేధం.

సభలు, ఊరేగింపులు: బహిరంగ సభలు, ఊరేగింపుల కోసం ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. లౌడ్ స్పీకర్ల వాడకానికి తప్పనిసరిగా పర్మిషన్ ఉండాలి.

నిషేధిత చర్యలు: ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడం లేదా దిష్టిబొమ్మలను దహనం చేయడం వంటివి చేయకూడదు. ఇతర పార్టీల ఊరేగింపులతో ఘర్షణలు కలగకుండా చూసుకోవాలి.

పోలింగ్ రోజు నిబంధనలు: పోలింగ్ బూత్‌ల వద్ద అభ్యర్థులు, పార్టీలు అధికారులకు సహకరించాలి. బూత్‌ల వద్ద మద్యం పంపిణీ చేయకూడదు. పార్టీల క్యాంపుల వద్ద ఎటువంటి రాజకీయ గుర్తులు ఉండకూడదు.

ప్రభుత్వ యంత్రాంగం: మంత్రులు లేదా అధికార పార్టీ వారు తమ అధికారిక హోదాను, ప్రభుత్వ నిధులను లేదా యంత్రాంగాన్ని ప్రచారం కోసం వాడుకోకూడదు.

కొత్త హామీలు: ఓటర్లను ప్రభావితం చేసేలా ఎటువంటి కొత్త ఆర్థిక గ్రాంట్లు, ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల హామీలు లేదా తాత్కాలిక నియామకాలు చేపట్టకూడదు.

ప్రభుత్వ వసతులు: రెస్ట్ హౌస్‌లు, డాక్ బంగ్లాలు, ప్రభుత్వ వాహనాలు వంటి వసతులు అన్ని పార్టీలకు సమానంగా అందుబాటులో ఉండాలి.

ఎన్నికల మేనిఫెస్టో: మేనిఫెస్టోలు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉండాలి. అవి ఆచరణ సాధ్యంగా ఉండాలి, పోలింగ్‌కు ముందు నిర్ణీత 'నిశ్శబ్ద కాలం'లో వాటిని విడుదల చేయకూడదు.

ఎలక్షన్​ కోడ్​ ముఖ్యాంశాలు..

2026 అసెంబ్లీ ఎన్నికలు- పోలింగ్ షెడ్యూల్ వివరాలు..

పశ్చిమ్​ బెంగాల్‌లో ఏప్రిల్ 23- ఏప్రిల్ 29 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. ఇక కేరళ, అసోం, పుదుచ్చేరిల్లో ఏప్రిల్ 9వ తేదీన ఒకే విడతలో ఓటింగ్ నిర్వహిస్తారు. తమిళనాడులో ఏప్రిల్​ 23న ఎన్నికలు జరగనున్నాయి. అన్ని ప్రాంతాల ఓట్ల లెక్కింపును మే 4వ తేదీన చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.

పుదుచ్చేరితో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ సీట్లు, వాటి మెజారిటీ మార్కు వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe