రష్యాలో 15ఏళ్ల బాలుడి అరాచకం! యూనివర్సిటీలో విద్యార్థులపై దాడి- నలుగురు భారతీయులకు గాయాలు..
రష్యా ఉఫా నగరంలోని స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో శనివారం రాత్రి జరిగిన కత్తిపోటు దాడిలో నలుగురు భారతీయ విద్యార్థులతో పాటు మరికొందరు గాయపడ్డారు. నిషేధిత నియో-నాజీ ముఠాకు చెందిన 15 ఏళ్ల బాలుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడిస్తున్నాయి.
రష్యాలోని ఉఫా నగరంలో జరిగిన ఒక దాడిలో నలుగురు భారతీయ విద్యార్థులతో పాటు మరికొందరు గాయపడినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యాలోని బాష్‌కోర్టోస్థాన్ రిపబ్లిక్‌లో ఉన్న ఒక స్టేట్ మెడికల్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ కత్తి దాడిలో కనీసం ఆరుగురు గాయపడగా, వారిలో నలుగురు భారతీయులు ఉన్నట్లు భారత మిషన్‌ను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.

“ఉఫాలో ఒక దురదృష్టకరమైన దాడి ఘటన జరిగింది. నలుగురు భారతీయ విద్యార్థులతో పాటు పలువురు వ్యక్తులు గాయపడ్డారు,” అని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా ధృవీకరించింది. తాము స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నామని, గాయపడిన విద్యార్థులకు అవసరమైన సహాయం అందించడానికి కజాన్‌లోని కాన్సులేట్ అధికారులు ఉఫాకు బయలుదేరారని ఎంబసీ తెలిపింది.
అసలేం జరిగింది?
ప్రాథమిక నివేదికల ప్రకారం.. శనివారం ఒక 15ఏఏళ్ల బాలుడు ఉఫాలోని స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. ఆ బాలుడు డార్మిటరీలోకి (వసతి గృహం) చొరబడి, అక్కడ అప్రమత్తంగా లేని విద్యార్థులపై ఆకస్మికంగా దాడికి పాల్పడ్డాడు.
రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పలువురు విద్యార్థులను పొడవడమే కాకుండా, తనను అరెస్టు చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు పోలీసు అధికారులపై కూడా కత్తితో దాడి చేశాడు.
"నిందితుడు అరెస్టును ప్రతిఘటించాడు, ఆ సమయంలో ఇద్దరు పోలీసు అధికారులకు కత్తిపోట్లు తగిలాయి. అంతేకాకుండా, నిందితుడు తనను తాను కూడా గాయపరుచుకున్నాడు," అని మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇరినా వోల్క్ తెలిపారు.
బాధితులు, నిందితుడి పరిస్థితి..
రష్యా ఫెడరల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. దాడికి గురైన వారిలో నలుగురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని 15 ఏళ్ల బాలుడిగా గుర్తించారు. అతడిని కూడా చిన్నారుల ఆసుపత్రిలో చేర్చారు. అతని పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని 'బాజా' అనే టెలిగ్రామ్ ఛానెల్ తెలిపింది.
కాగా గాయపడిన భారతీయుల వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.
దాడి వెనుక భయానక కారణాలు?
ఈ దాడిపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 'బాజా' ఛానెల్ కథనం ప్రకారం.. నిందితుడు 'NS/WP' అనే నిషేధిత నియో-నాజీ ముఠాలో సభ్యుడు. "దాడి చేస్తూ పిచ్చిగా ప్రవర్తించిన సమయంలో అతను హోలోకాస్ట్ గురించి జాతీయవాద నినాదాలు చేశాడుడు," అని నివేదికలు పేర్కొన్నాయి. బాధితుల రక్తంతో గోడపై స్వస్తిక గుర్తును గీసిన ఫోటోను కూడా సదరు టెలిగ్రామ్ ఛానెల్ ప్రస్తావించింది.
వైద్య చదువు కోసం చాలా మంది భారతీయులు రష్యాకు వెళతారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాలో పరిస్థితులు ఇప్పటికే కష్టంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి కత్తిపోటు ఘటనలు కూడా జరుగుతుండటం ప్రజల్లో, మరీ ముఖ్యంగా అక్కడి భారతీయుల్లో ఆందోళనలను రేకెతిస్తున్నాయి.

E-Paper












