...
...
Next Story

6శాతం వార్షిక హైక్, డీఏ మర్జర్.. 8వ పే కమిషన్​ ముందు ఉద్యోగ సంఘాల భారీ డిమాండ్లు.. సాధ్యమేనా?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆశలకు రెక్కలు తొడుగుతూ 8వ వేతన సంఘం ఎదుట ఉద్యోగ సంఘాలు భారీ ప్రతిపాదనలు ఉంచాయి. వార్షిక ఇంక్రిమెంట్‌ను 6 శాతానికి పెంచడంతో పాటు 50 శాతం డీఏ విలీనం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వంటి కీలక డిమాండ్లను బీపీఎంఎస్ సమర్పించింది. ఆ వివరాలను ఇక్కడ చూడండి..

Published on: Nov 21, 2026, 15:16:04 IST
Advertisement

8వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. వేతనాలు, పెన్షన్లు, అలవెన్సులు, ఇతర సర్వీస్ ప్రయోజనాల్లో భారీ మార్పులు కోరుతూ రక్షణ రంగ ఉద్యోగుల జాతీయ సమాఖ్య 'భారతీయ ప్రతిరక్షా మజ్దూర్ సంఘ్' (బీపీఎంఎస్) కమిషన్ ఛైర్మన్‌కు తాజా డిమాండ్ల జాబితాను సమర్పించింది.

8వ వేతన సంఘం లేటెస్ట్ అప్డేట్స్..
8వ వేతన సంఘం లేటెస్ట్ అప్డేట్స్..

2025 జనవరిలో 8వ వేతన సంఘాన్ని ప్రకటించిన కేంద్రం, అదే ఏడాది నవంబర్ 3న అధికారికంగా ఏర్పాటు చేసింది. సిఫార్సులు అందించడానికి కమిషన్‌కు 18 నెలల గడువు ఇచ్చింది. సవరించిన వేతన నిర్మాణం 2026 జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, తుది అమలు తేదీని విడిగా నిర్ణయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో నవంబర్ 18, 2026న కమిషన్‌తో జరిగిన రెండో విడత చర్చల్లో బీపీఎంఎస్ ప్రతినిధులు తమ ప్రతిపాదనలను అందజేశారు.

8వ వేతన సంఘం- వేతనాలు, పెన్షన్లపై ప్రధాన డిమాండ్లు ఇలా..

ప్రస్తుత వేతన, పెన్షన్ నిర్మాణంలో సమూల మార్పులు చేయాలని బీపీఎంఎస్ కోరింది. కుటుంబ వినియోగ అవసరాలు, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిబంధనలు, ఆక్రాయిడ్ ఫార్ములా ఆధారంగా ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకుని కనీస వేతనాన్ని నిర్ణయించాలని సూచించింది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని కొనుగోలు శక్తిని కాపాడేలా సరైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫార్సు చేయాలని, వివిధ పే లెవల్స్ మధ్య సహేతుకమైన వ్యత్యాసం ఉండేలా చూస్తూ గరిష్ట-కనిష్ట వేతన నిష్పత్తిని 1:10కి పరిమితం చేయాలని డిమాండ్ చేసింది.

ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం కవరేజీని రూ. 30,000 నుంచి కనీసం రూ. 15 లక్షలకు, డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను రూ. 10 లక్షలకు పెంచాలని బీపీఎంఎస్ సూచించింది. జీపీఎఫ్ వడ్డీ రేటు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈపీఎఫ్వడ్డీ కంటే తక్కువగా ఉండకూడదని, గతంలో నిలిపివేసిన వడ్డీ లేని అడ్వాన్సులను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేసింది.

8వ వేతన సంఘం- సెలవులు, ఇతర ఉద్యోగ ప్రయోజనాల్లో మార్పుల కోసం పట్టు!

వేతనాలతో పాటు సెలవులు, సంక్షేమ పథకాల్లోనూ వెసులుబాటు కల్పించాలని సమాఖ్య కోరింది. ఏటా క్యాజువల్ లీవ్స్ (సీఎల్) సంఖ్యను 12 రోజులకు పెంచాలని, అర్హత ఉన్న ప్రతి ఎల్‌టీసీ సందర్భంలో 20 రోజుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అనుమతించడంతో పాటు ఎల్‌టీసీ స్పెషల్ క్యాష్ ప్యాకేజీని మళ్లీ తీసుకురావాలని ప్రతిపాదించింది. పిల్లలను దత్తత తీసుకునే సందర్భాల్లోనూ వర్తించేలా పితృత్వ సెలవులను 45 రోజులకు పెంచాలని, చైల్డ్ కేర్ లీవ్‌ను పూర్తి వేతనంతో రెండేళ్లకు పొడిగించాలని కోరింది.

సైనిక సర్వీసు తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరిన మాజీ సైనికులకు గత సైనిక సర్వీసులోని లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ను మినహాయించకుండా 300 రోజుల వరకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అవకాశం ఇవ్వాలని సూచించింది. మహిళా ఉద్యోగులకు నెలకు ఒక రోజు రుతుక్రమ సెలవు ప్రవేశపెట్టాలని, ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల కోసం ఆఫీస్ బేరర్లకు 60 రోజులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు 30 రోజుల ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని కోరింది. విధి నిర్వహణలో అనారోగ్యం లేదా గాయాలకు గురైనప్పుడు పూర్తి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయడంతో పాటు ఉద్యోగుల పరిహార చట్టం కింద నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసింది.

8వ వేతన సంఘం- ప్రమోషన్లు, సర్వీస్ నిబంధనల్లో సంస్కరణలు

ఖాళీల ఆధారిత పదోన్నతుల స్థానంలో డైనమిక్ ప్రమోషన్ విధానాన్ని తీసుకురావాలని, 30 ఏళ్ల సర్వీసులో ఎంఏసీపీ కింద కనీసం 5 ఫైనాన్షియల్ అప్​గ్రెడేషన్స్ కల్పించాలని బీపీఎంఎస్ కోరింది. ఆలస్యమైన డీపీసీ సిఫార్సులకు వెనుకటి తేదీ నుంచి వర్తింపు ఇవ్వాలని, ఫీడర్ గ్రేడ్‌లలో గరిష్టంగా ఐదేళ్ల రెసిడెన్సీ పీరియడ్ ఉండాలని, ఉమ్మడి నియామక నిబంధనలు అమలు చేయాలని సూచించింది. గ్రూప్-సీ ఉద్యోగులను ఒకే స్టేషన్ పరిధిలో బదిలీ చేయడం, సున్నితమైన పోస్టులను గుర్తించే ముందు జేసీఎం ప్రతినిధులతో సంప్రదించడం వంటి అంశాలను ప్రస్తావించింది.

అంతర్-మంత్రిత్వ శాఖల కారుణ్య బదిలీల కోసం కేంద్రీకృత పోర్టల్ ఏర్పాటు చేయాలని, 2026 జనవరి 1కి ముందు, ఆ తర్వాత పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు సమాన స్థాయిలో పెన్షన్ సవరణ చేయాలని కోరింది. పునర్నియామకం పొందిన మాజీ సైనికులకు న్యాయమైన పే ఫిక్సేషన్, రీడిప్లాయ్‌మెంట్ సమయంలో వేతన రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. ఒకే రకమైన విధులు నిర్వర్తించే సివిలియన్, యూనిఫాం సిబ్బందికి ప్రత్యేక అలవెన్సుల్లో సమానత్వం ఉండాలని, జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (జేసీఎం) వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరింది.

అయితే ఇవన్నీ ఉద్యోగ సంఘం.. కమిషన్ ముందు ఉంచిన ప్రతిపాదనలు మాత్రమేనని, వీటిని పరిశీలించిన తర్వాతే 8వ వేతన సంఘం తన తుది సిఫార్సులను ప్రభుత్వానికి అందజేస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

 

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks