...
...
Next Story

8th Pay Commission : 2.75 వర్సెస్ 3.5 ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్.. బేసిక్ పే ఎంత పెరుగుతుంది? లెక్కలివే..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు రాబోయే రోజుల్లో భారీగా జీతాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 8వ వేతన సంఘం పరిశీలనలో ఉన్న 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' ఆధారంగా బేసిక్ పే ఏ ఏ స్థాయిలో ఎంతగా మారుతుందో తెలిపే సమగ్ర విశ్లేషణ మీకోసం..

Published on: Sep 19, 2026, 09:59:55 IST
Advertisement

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం పనులు వేగంగా ముందుకుసాగుతున్నాయి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిషన్ గడువు 18 నెలలు కాగా, ఇప్పటికే 10 నెలల కాలం పూర్తయింది. తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే, డిఫెన్స్, పోస్టల్, బ్యాంకింగ్ రంగాల సిబ్బందితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కోటి మందికి పైగా సిబ్బంది భవిష్యత్ వేతనాలను ఈ కమిషన్ నిర్ణయించనుంది.

8th Pay Commission salary hike: Illustrative calculations show how 2.75 and 3.5 fitment factors could change basic pay for central government employees across different pay matrix levels. (AI-generated image for representational purposes only.)
8th Pay Commission salary hike: Illustrative calculations show how 2.75 and 3.5 fitment factors could change basic pay for central government employees across different pay matrix levels. (AI-generated image for representational purposes only.)

అయితే, పే కమిషన్ సిఫార్సుల్లో ఉద్యోగుల ప్రాథమిక వేతనాన్ని (బేసిక్ పే) పెంచడంలో 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో అసలేంటి ఈ ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్? ఎంత మాత్రం పెరిగితే, జీతాలు ఎలా ఉంటాయి?

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి?

కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు ఉద్యోగుల పాత బేసిక్ పేను నూతన బేసిక్ పేగా మార్చడానికి ఉపయోగించే మల్టిప్లయర్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటారు. గతంలో 6వ వేతన సంఘం 1.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను, 7వ వేతన సంఘం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేశాయి.

నిత్యావసర ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటానికి ఈ పెంపు తోడ్పడుతుంది.

ఇక 8వ వేతన సంఘం ఈ ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​ని ఎంత నిర్ణయిస్తుందనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఉద్యోగ సంఘాల డిమాండ్ ఏంటి?

ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత ఎక్కువ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కేటాయించాలని ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.0 నుంచి 4.0 మధ్యలో నిర్ణయించాలని పలు సంఘాలు గట్టిగా ఒత్తిడి తెస్తున్నాయి.

2.75, 3.5 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉంటే జీతాలు ఎలా మారతాయి?

పే మ్యాట్రిక్స్ లెవల్7వ వేతన సంఘం బేసిక్ శాలరీ (రూ.)2.75 ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్ వద్ద బేసిక్ పే (రూ.)3.5 ఫిట్​మెంట్​ ఫ్యాక్టరీ వద్ద బేసిక్ పే (రూ.)
Level 118,00049,50063,000
Level 219,90054,72569,650
Level 321,70059,67575,950
Level 425,50070,12589,250
Level 529,20080,3001,02,200
Level 635,40097,3501,23,900
Level 744,9001,23,4751,57,150
Level 1056,1001,54,2751,96,350
Level 131,23,1003,38,5254,30,850
Level 182,50,0006,87,5008,75,000
View All

లెక్కింపు సూత్రం: ప్రస్తుత బేసిక్ పే × ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ = సవరించిన బేసిక్ పే

లెవెల్ 1 (ప్రస్తుత బేసిక్ పే రూ. 18,000):

2.75 ఫ్యాక్టర్ వర్తిస్తే: సవరించిన బేసిక్ పే రూ. 49,500 అవుతుంది.

3.5 ఫ్యాక్టర్ వర్తిస్తే: సవరించిన బేసిక్ పే రూ. 63,000కు చేరుకుంటుంది.

లెవెల్ 6 (ప్రస్తుత బేసిక్ పే రూ. 35,400):

2.75 ఫ్యాక్టర్ వర్తిస్తే: సవరించిన బేసిక్ పే రూ. 97,350 అవుతుంది.

3.5 ఫ్యాక్టర్ వర్తిస్తే: సవరించిన బేసిక్ పే రూ. 1,23,900గా మారుతుంది.

లెవెల్ 10 (ప్రస్తుత బేసిక్ పే రూ. 56,100):

2.75 ఫ్యాక్టర్ వర్తిస్తే: సవరించిన బేసిక్ పే రూ. 1,54,275 అవుతుంది.

3.5 ఫ్యాక్టర్ వర్తిస్తే: సవరించిన బేసిక్ పే రూ. 1,96,350కి పెరుగుతుంది.

పదేళ్లకు ఒకసారి వచ్చే గొప్ప అవకాశం..

బేసిక్ పే పెరిగినంత మాత్రాన దాన్నే పూర్తి జీతంగా పరిగణించలేము. ఈ ప్రాథమిక వేతనం ఆధారంగానే కరవు భత్యం (డీఏ), ఇంటి అద్దె భత్యం (హెచ్​ఆర్​ఏ), రవాణా భత్యం (టీఏ) వంటి ఇతర అలవెన్సులను లెక్కిస్తారు. పదేళ్లకు ఒకసారి మాత్రమే వేతన సవరణ జరుగుతుంది కాబట్టి, రాబోయే పదేళ్ల పాటు ఉద్యోగుల ఆర్థిక స్థితికి ఈ కొత్త బేసిక్ పే పునాదిగా మారుతుంది.

తుది నివేదిక ఎప్పుడు రావచ్చు?

కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. దిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, లద్దాఖ్ వంటి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కమిషన్ ఇప్పటికే వాటాదారులతో చర్చలు ఇప్పటికే పూర్తి చేసింది. 18 నెలల కాలపరిమితి ప్రకారమే పనిచేస్తే, 2027 మే-జూన్ నాటికి ఈ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశముంది.

కాగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతే తుది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, పెరిగే జీతాలపై అధికారిక స్పష్టత వస్తుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks