Polo Electric : ఎలక్ట్రిక్​ వర్షెన్​లో వోక్స్​వ్యాగన్ ‘పోలో’- రేంజ్​ కూడా ఎక్కువే..

Volkswagen polo electric car :" ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన 'పోలో' ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ రూపంలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ వోక్స్‌వ్యాగన్.. తన ఐకానిక్ మోడల్ పోలోకు ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ ఐడీ. పోలోను ఇటీవలే ప్రదర్శించింది. ఆ వివరాలు..

Published on: May 1, 2026, 10:58:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 కోట్ల యూనిట్లకు పైగా అమ్ముడైన వోక్స్​వ్యాగన్ పోలో బ్రాండ్‌కు ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీతో కొత్త అధ్యాయం మొదలైంది! జర్మనీలో ఈ కారు ప్రీ-సేల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీని బేస్ వేరియంట్ ధర 24,995 యూరోలు (సుమారు రూ. 27.65 లక్షలు) కాగా, హై-ఎండ్ వేరియంట్ 'ఐడీ. పోలో లైఫ్' ధర 33,795 యూరోలు (సుమారు రూ. 37.38 లక్షలు)గా నిర్ణయించారు.

ఎలక్ట్రిక్ పోలో ఇదే..
ఎలక్ట్రిక్ పోలో ఇదే..

ఈ నేపథ్యంలో భారతీయులకు ఎంతో ఇష్టమైన ఈ పోలోకు సంబంధించిన ఎలక్ట్రిక్​ వర్షెన్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వోక్స్​వ్యాగన్ ఐడీ. పోలో- పవర్​ఫుల్ బ్యాటరీ, అద్భుతమైన రేంజ్..

ఐడీ. పోలోను ఎంఈబీ+ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. ఇది ప్రధానంగా మూడు రకాల పవర్ అవుట్‌పుట్‌లలో (114 హెచ్​పీ, 132.7 హెచ్​పీ, 208 హెచ్​పీ) లభించనుంది.

బ్యాటరీ: తక్కువ ధరలో వచ్చే వేరియంట్లలో 37 కేడబ్ల్యూహెచ్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీని అందించారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 329 కిలోమీటర్ల (డబ్ల్యూఎల్​టీపీ) రేంజ్ ఇస్తుంది.

హై-రేంజ్ వెర్షన్: 155 కేడబ్ల్యూ మోటార్ ఉన్న వేరియంట్‌లో 52 కేడబ్ల్యూహెచ్ ఎన్‌ఎమ్‌సీ (ఎన్​ఎంసీ) బ్యాటరీ ఉంటుంది. ఇది గరిష్టంగా 454 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

ఫాస్ట్ ఛార్జింగ్: డీసీ ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 23 నుంచి 24 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు. అన్ని వేరియంట్లలో డీసీ క్విక్ ఛార్జింగ్ సదుపాయం ఉండటం విశేషం.

వోక్స్​వ్యాగన్ ఐడీ. పోలో- కాంపాక్ట్ సైజు, లగ్జరీ ఇంటీరియర్..

చూడటానికి కాంపాక్ట్ కారులా అనిపించినా, ఈ వోక్స్​వ్యాగన్ ఐడీ. పోలో ఎలక్ట్రిక్​ హ్యాచ్​బ్యాక్ లోపల స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది.

బూట్ స్పేస్: సాధారణ పోలో కంటే ఇందులో 25 శాతం ఎక్కువ బూట్ స్పేస్ (441 లీటర్లు) ఉంది. సీట్లు ఫోల్డ్ చేస్తే అది 1,240 లీటర్ల వరకు పెరుగుతుంది.

టెక్నాలజీ: డ్రైవర్ ముందు 26 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్, డ్యాష్‌బోర్డ్ మధ్యలో 33 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఉన్నాయి.

రెట్రో లుక్: వింటేజ్ కార్ల ప్రియుల కోసం పాత 'గోల్ఫ్ 1' ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తరహాలో కనిపించే రెట్రో డిస్‌ప్లే మోడ్ కూడా ఈ ఈవీలో ఉంది.

వోక్స్​వ్యాగన్ ఐడీ. పోలో- సేఫ్టీ, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు..

ఐడీ. పోలో మూడు వేరియంట్లలో (ట్రెండ్, లైఫ్, స్టైల్) అందుబాటులో ఉంటుంది.

ఫీచర్లు: అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి సౌకర్యాలు ఉన్నాయి.

స్మార్ట్ లైటింగ్: 'స్టైల్' వేరియంట్‌లో IQ.LIGHT ఎల్‌ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్లు, డోర్ తెరిచే ముందు ఎవరైనా పక్కనుంచి వస్తుంటే హెచ్చరించే ప్రత్యేక ఐడీ లైట్ స్ట్రిప్ ఉన్నాయి.

విలాసం: 425-వాట్ హర్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, 12-వే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు (మసాజ్ ఫంక్షన్‌తో) అదనపు ఆకర్షణలు.

ఈవీలో వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్) ఛార్జింగ్ ఫీచర్ ఉంది. దీనివల్ల కారు లోపల ఉన్న 230వీ సాకెట్ ద్వారా ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే ప్రయాణంలో మీ కారు ఒక పవర్ బ్యాంక్ లాగా పనిచేస్తుందన్నమాట.

జర్మనీలో ఈ వేసవి నాటికి ఈ కారు పూర్తిస్థాయి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత యూరప్ మార్కెట్లలోకి, తదనంతరం ఇతర దేశాల్లోకి అడుగుపెట్టనుంది.

ఈ మోడల్​ ఇండియా లాంచ్​, ధర, ఫీచర్లు వంటి వివరాలపై సంస్థ స్పందించాల్సి ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More