...
...
Next Story

Passport : పాస్​పోర్ట్​ కూడా పౌరసత్వాన్ని నిర్ధరించదు! మరి భారతీయులం అని నిరూపించుకునేదెలా?

passport citizenship : భారతదేశంలో పాస్‌పోర్ట్ లేదా ఓటర్ ఐడీ కార్డులు పౌరసత్వానికి పూర్తి స్థాయి నిరూపణలు కావని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ వివరణతో సాధారణ పౌరుల్లో సరికొత్త చర్చ మొదలైంది. అసలు దేశంలో పౌరసత్వాన్ని నిరూపించే అసలైన పత్రం ఏది? అనే ప్రశ్న ఇప్పుడు న్యాయపరంగా తెరపైకి వచ్చింది.

Published on: Jun 25, 2026, 09:58:47 IST
Advertisement

ఒక భారతీయ పౌరుడు అంతర్జాతీయ సరిహద్దులు దాటాలన్నా, విదేశాల్లో రాయబార కార్యాలయాల రక్షణ పొందాలన్నా, ఇమ్మిగ్రేషన్ అధికారుల ముందు తన జాతీయతను నిరూపించుకోవాలన్నా అత్యంత కీలకమైన పత్రం ‘పాస్‌పోర్ట్’. అయితే, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం.. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పాస్‌పోర్ట్ కూడా సదరు వ్యక్తి ‘భారత పౌరసత్వానికి ఖచ్చితమైన నిరూపణ’ కాదని తేలింది. బుధవారం కేంద్రం ఇచ్చిన ఈ సాంకేతిక వివరణ దేశంలో ఒక పెద్ద చట్టపరమైన చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఓటర్ల జాబితాల సవరణలు, పౌరసత్వ ధృవీకరణ ప్రక్రియల నేపథ్యంలో.. "పాస్‌పోర్ట్ కూడా పౌరసత్వాన్ని నిరూపించలేకపోతే, మరి ఏ పత్రం నిరూపిస్తుంది?" అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది.

పౌరసత్వ నిరూపణకు పాస్​పోర్ట్​ కూడా చెల్లదు! మరి ఇంకేవి? (AI-generated image)
పౌరసత్వ నిరూపణకు పాస్​పోర్ట్​ కూడా చెల్లదు! మరి ఇంకేవి? (AI-generated image)

సాధారణంగా చూస్తే ఈ స్పష్టీకరణ చట్టానికి భిన్నంగా అనిపించవచ్చు. ఎందుకంటే 1967 నాటి 'పాస్‌పోర్ట్ చట్టం' ప్రకారం.. ఈ పత్రాన్ని కలిగి ఉన్న వ్యక్తి భారతీయ పౌరుడు అనే ప్రాథమిక నమ్మకంపైనే ఇది జారీ అవుతుంది.

చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం.. ఒక దరఖాస్తును పూర్తిగా పరిశీలించి, అవసరమైన విచారణ చేసిన తర్వాతే పాస్‌పోర్ట్ అధికారులు దానిని జారీ చేయాలి.

సెక్షన్ 6(2)(ఏ) ప్రకారం.. దరఖాస్తుదారుడు భారత పౌరుడు కాకపోతే అధికారులు పాస్‌పోర్ట్‌ను తిరస్కరించాల్సి ఉంటుంది.

అంటే, ప్రభుత్వం ఒక వ్యక్తి పౌరసత్వంపై పూర్తి సంతృప్తి చెందిన తర్వాతే పాస్‌పోర్ట్ ఇస్తుందని చట్టం చెబుతోంది. ఇందుకోసం పోలీస్ వెరిఫికేషన్, పలు ప్రభుత్వ రికార్డుల పరిశీలన కూడా జరుగుతుంది. కానీ, విదేశాంగ శాఖ ఇక్కడ ఒక సూక్ష్మ చట్టపరమైన తేడాను చూపిస్తోంది. పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వానికి ఒక ‘ఆధారం’ మాత్రమే కానీ, అది 'తిరుగులేని నిరూపణ' (కన్లూజివ్ ప్రూఫ్) కాదని పేర్కొంటోంది.

ఒకవేళ ఎవరైనా తప్పుడు సమాచారంతో లేదా తప్పుగా పౌరసత్వాన్ని క్లెయిమ్ చేసి పాస్‌పోర్ట్ పొందారని తెలిస్తే, దానిని రద్దు చేసే లేదా స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

ఓటర్ ఐడీ కార్డు పరిస్థితి కూడా ఇంతేనా?

భారతీయ చట్టాల ప్రకారం.. ఒక ఓటర్ ఐడీ కార్డు అనేది కేవలం ఆ వ్యక్తి ఓటరుగా నమోదయ్యారని మాత్రమే నిరూపిస్తుంది. అది స్వతంత్రంగా పౌరసత్వాన్ని ధృవీకరించలేదు. 1950 నాటి 'ప్రజా ప్రాతినిధ్య చట్టం' ప్రకారం కేవలం భారత పౌరులు మాత్రమే ఓటర్లుగా నమోదు కావడానికి అర్హులు. అయినప్పటికీ, ఓటర్ల జాబితాలో ఉన్న ఒక వ్యక్తి పౌరసత్వంపై విచారణ జరిపే అధికారం రిజిస్ట్రేషన్ అధికారులకు ఉంటుంది. అందువల్ల, పాత ఓటర్ కార్డు ఉన్నంత మాత్రాన పౌరసత్వ ప్రశ్నలకు అది పూర్తి సమాధానం కాలేదు. ఇప్పుడు విదేశాంగ శాఖ క్లారిటీతో.. అటు ఓటర్ కార్డు, ఇటు పాస్‌పోర్ట్ రెండూ పౌరసత్వానికి అంతిమ నిరూపణలు కావని తేలిపోయింది.

భారత చట్టాలు ఏం చెబుతున్నాయి?

ప్రపంచంలోని అనేక దేశాల మాదిరిగా భారతదేశంలో పుట్టగానే ప్రతి ఒక్కరికీ స్వయంచాలకంగా ఇచ్చే ఏకైక 'జాతీయ పౌరసత్వ ధృవీకరణ పత్రం' అంటూ ఏదీ లేదు. 2020 ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. గుర్తింపు కార్డులు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు లేదా బర్త్ సర్టిఫికేట్‌లలో దేనినైనా పౌరసత్వానికి ఖచ్చితమైన పత్రంగా పరిగణించవచ్చా అని అడగ్గా.. కేంద్ర హోం శాఖ దేనినీ ఖచ్చితమైన ఆధారంగా పేర్కొనలేదు. పౌరసత్వం అనేది 1955 నాటి ‘పౌరసత్వ చట్టం’, దాని నిబంధనల ప్రకారమే నిర్ణయిస్తారని తెలిపింది.

మన దేశంలో పౌరసత్వం అనేది పుట్టుక, వంశపారంపర్యం, రిజిస్ట్రేషన్, సహజీకరణ లేదా భూభాగాల విలీనం ద్వారా లభిస్తుంది. కాబట్టి పౌరసత్వ నిరూపణ అనేది ఆయా వ్యక్తులు ఏ మార్గం ద్వారా పౌరసత్వం పొందారనే దానిపై ఆధారపడి ఉంటుంది!

బర్త్ సర్టిఫికేట్: ఇది భారతదేశంలో పుట్టినట్లు నిరూపిస్తుంది కానీ మారుతున్న చట్టాల ప్రకారం పౌరసత్వానికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు.

పాన్ కార్డు: ఇది కేవలం పన్ను చెల్లింపుదారుల గుర్తింపు మాత్రమే.

గుర్తింపు కార్డులు (ఇతర పత్రాలు): నివాసితులకు ఇచ్చే ఇతర కార్డులు పౌరసత్వానికి నిరూపణ కావని చట్టంలోనే స్పష్టంగా ఉంది. రేషన్ కార్డు అనేది కేవలం సంక్షేమ పథకాల లబ్ధికి మాత్రమే ఆధారం.

చివరగా, 1955 పౌరసత్వ చట్టం కింద జారీ చేసే 'సిటిజన్‌షిప్ సర్టిఫికేట్' మాత్రమే పౌరసత్వాన్ని అధికారికంగా ధృవీకరిస్తుంది! కానీ ఈ సర్టిఫికేట్లు కేవలం రిజిస్ట్రేషన్ లేదా సహజీకరణ ద్వారా పౌరసత్వం పొందిన వారికి మాత్రమే అవసరమవుతాయి. పుట్టుకతోనే పౌరులైన దేశంలోని అత్యధిక శాతం మంది భారతీయులకు ఇవి ఉండవు. కోర్టులు కూడా ఏదో ఒకే ఒక్క పత్రాన్ని అంతిమ ఆధారంగా తీసుకోకుండా, అన్ని రికార్డులను సమగ్రంగా పరిశీలించి పౌరసత్వాన్ని నిర్ధారిస్తాయి. అందువల్ల, ఒక వ్యక్తి వద్ద పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ వంటి అన్ని పత్రాలు ఉన్నప్పటికీ, చట్టపరమైన వివాదం తలెత్తినప్పుడు పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి అదనపు ఆధారాలు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe