Pronto : భారత స్టార్టప్ రంగంలో సంచలనం! ఏడాదిలోనే రూ. 930 కోట్ల సామ్రాజ్యం- ఎవరీ అంజలి సర్దానా?

Anjali Sardana : గ్రాడ్యుయేషన్ ముగిసిన 12 నెలల లోపే అంజలి సర్దానా తన స్టార్టప్ ‘ప్రాంటో’ను 100 మిలియన్​ డాలర్ల విలువైన కంపెనీగా మార్చారు. గురుగ్రామ్‌లో చిన్నగా మొదలై, నేడు దేశవ్యాప్తంగా రోజుకు దూసుకుపోతున్న ఈ హోమ్ సర్వీసెస్ కంపెనీ ప్రస్థానం, అంజలి సర్దానా సామర్థ్యం గురించి ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 4, 2026, 08:15:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాధారణంగా కాలేజీ చదువు పూర్తయిన ఏడాది తర్వాత కూడా.. చాలామంది ‘నెక్ట్స్​ ఏంటి?’ అనే ఆలోచిస్తూ ఉంటారు. కానీ, ఒక 23ఏళ్ల మహిళ మాత్రం అసాధారణ వేగంతో దూసుకుపోయారు. కేవలం 12 నెలల లోపే తన స్టార్టప్ ‘ప్రాంటో’ను దాదాపు 100 మిలియన్ డాలర్ల (9,29,78,50,000) విలువైన కంపెనీగా తీర్చిదిద్ది అందరినీ ఆశ్చర్యపరిచారు. అమె.. అంజలి సర్దానా! గురుగ్రామ్‌లో ఒకే ఒక హబ్‌తో ప్రారంభమైన ఈ హోమ్ సర్వీసెస్ కంపెనీ, నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో వేల సంఖ్యలో రోజువారీ బుకింగ్స్‌తో రికార్డులు సృష్టిస్తోంది.

అంజలి సర్దానా
అంజలి సర్దానా

సాధారణ స్టార్టప్ ఫౌండర్ కాదు!

అంజలి నేపథ్యం ఏమాత్రం సాధారణమైనది కాదు. 2024లో జార్జ్‌టౌన్ యూనివర్శిటీ నుంచి బయోలజీ విభాగంలో అత్యుత్తమ అకడమిక్ రికార్డుతో పట్టా పొందారు. తన బ్యాచ్‌లోనే నంబర్ వన్ స్టూడెంట్‌గా నిలిచారు. పేపర్‌పై ఆమె సైన్స్ విద్యార్థిని అయినప్పటికీ, ఆచరణలో మాత్రం ఫైనాన్స్, ఇన్వెస్టింగ్ రంగాల్లో అపార అనుభవం గడించారు. జార్జ్‌టౌన్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీస్‌లో పని చేస్తూ బిలియన్ డాలర్ల నిధులను విశ్లేషించడం, గ్లోబల్ ఫండ్స్, మార్కెట్లను అధ్యయనం చేయడం ఆమెకు డిగ్రీ పూర్తి కాకముందే అలవడింది.

ఆ తర్వాత న్యూయార్క్‌లోని మోర్గాన్ స్టాన్లీలో ఇంటర్న్‌షిప్ చేయడం, 8వీసీ, బేన్ క్యాపిటల్ వంటి ప్రైవేట్ ఈక్విటీ సంస్థల్లో పని చేయడం ఆమెకు ఇన్వెస్టర్ల ఆలోచనా విధానంపై పూర్తి అవగాహన కల్పించాయి. అందుకే స్టార్టప్ ప్రారంభించినప్పుడు ఆమె కేవలం ఊహలతో కాకుండా, వ్యాపార విస్తరణపై స్పష్టమైన అవగాహనతో అడుగుపెట్టారు.

క్లిక్ అయిన ఐడియా: ‘ప్రాంటో’ ప్రస్థానం..

2025 ప్రారంభంలో అంజలి 'ప్రాంటో'ను ప్రారంభించారు. భారతదేశంలో ఇంటి పనుల కోసం నమ్మకమైన వ్యక్తులను కనుగొనడం ఇప్పటికీ అసంఘటితంగానే ఉంది. పని మనుషులు దొరకడం అనేది కేవలం పరిచయాలు లేదా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈ అయోమయాన్ని తొలగించడమే ప్రాంటో లక్ష్యం.

క్లీనింగ్, గిన్నెలు కడగడం, లాండ్రీ వంటి పనుల కోసం శిక్షణ పొందిన, వెరిఫై చేసిన వర్కర్లను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇందులో ప్రధాన ఆకర్షణ 'వేగం'. స్థానిక హబ్‌ల నెట్‌వర్క్ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే సేవలను అందించడం ఈ స్టార్టప్ ప్రత్యేకత.

రోజుకు 170 నుంచి 18,000 బుకింగ్స్ వరకు..

ప్రారంభంలో గురుగ్రామ్‌లో ఒకే ఒక హబ్‌తో రోజుకు కేవలం 170 బుకింగ్స్ మాత్రమే నిర్వహించేవారు. కానీ కొద్ది నెలల్లోనే ఆ సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. 2026 ప్రారంభం నాటికి ప్రాంటో రోజుకు 18,000 బుకింగ్స్‌ను దాటేసింది. ప్రస్తుతం దిల్లీ ఎన్​సీఆర్, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. అసంఘటితంగా ఉన్న ఈ రంగంలో వేల సంఖ్యలో మహిళలకు శిక్షణ ఇచ్చి, వారికి గౌరవప్రదమైన ఉపాధి, స్థిరమైన ఆదాయ మార్గాన్ని చూపడం ఈ స్టార్టప్ సాధించిన గొప్ప విజయం.

పెట్టుబడుల వెల్లువ..

కంపెనీ అద్భుతమైన వృద్ధిని చూసి ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. మార్చి 2026లో ఎపిక్ క్యాపిటల్ నేతృత్వంలో జరిగిన ఫండింగ్ రౌండ్‌లో ప్రాంటో ఏకంగా 25 మిలియన్ డాలర్లు సేకరించింది. ఇందులో గ్లేడ్ బ్రూక్ క్యాపిటల్, జనరల్ క్యాటలిస్ట్, బేన్ క్యాపిటల్ వెంచర్స్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. దీంతో కంపెనీ వాల్యుయేషన్ ఏడాదిలోనే 100 మిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకుముందు 2025లోనే కంపెనీ తన కార్యకలాపాల విస్తరణ కోసం 11 మిలియన్​ డాలర్లను సేకరించింది.

అంజలి సర్దానా విజయం కేవలం ఒక ఐడియా వల్ల వచ్చింది కాదు, ఆమె పక్కా ప్రిపరేషన్ దీనికి ప్రధాన కారణం. పెట్టుబడులు ఎలా వస్తాయి, కంపెనీని ఎలా విస్తరించాలి అనే విషయాలపై ఆమెకు ఉన్న ముందస్తు అవగాహన ప్రాంటోను ఇంత వేగంగా ముందుకు నడిపించింది. నేడు ప్రాంటో కేవలం ఒక యాప్ మాత్రమే కాదు, అసంఘటిత రంగాన్ని సాంకేతికతతో క్రమబద్ధీకరిస్తున్న ఒక వినూత్న వేదిక.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. ప్రాంటో స్టార్టప్ ప్రత్యేకత ఏంటి?

ఇది శిక్షణ పొందిన, వెరిఫై చేసిన వర్కర్ల ద్వారా క్లీనింగ్, లాండ్రీ వంటి గృహ సేవలను కేవలం 10 నిమిషాల్లోనే కస్టమర్లకు అందిస్తుంది.

2. అంజలి సర్దానాకు ఫైనాన్స్ రంగంలో ఉన్న అనుభవం ఏంటి?

ఆమె మోర్గాన్ స్టాన్లీ, 8వీసీ, బేన్ క్యాపిటల్ వంటి ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థల్లో ఇన్వెస్ట్‌మెంట్ అనలిస్ట్‌గా, ప్రైవేట్ ఈక్విటీ రంగంలో పనిచేశారు.

3. ప్రస్తుతం ప్రాంటో ఏ నగరాల్లో అందుబాటులో ఉంది?

ప్రస్తుతం ప్రాంటో దిల్లీ ఎన్​సీఆర్, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో తన సేవలను అందిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More