...
...
Next Story

Khamenei funeral : ఖమేనీ మృతదేహాన్ని 125 రోజుల పాటు ఇరాన్ ఎలా భద్రపరిచింది?

Ayatollah Ali Khamenei : అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల ప్రక్రియ టెహ్రాన్‌లో ప్రారంభమైంది. దాదాపు 4 నెలల (125 రోజులు) సుదీర్ఘ కాలం పాటు ఆయన భౌతికకాయాన్ని ఇరాన్ ఎలా భద్రపరిచిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Published on: Jul 5, 2026, 11:08:44 IST
Advertisement

ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అధికారిక ప్రభుత్వ అంత్యక్రియల కార్యక్రమాలు టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా వేదికగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భీకర వైమానిక దాడుల్లో ఖమేనీ హతమయ్యారు. ఆయన మరణించిన తర్వాత భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం అధికారికంగా ఉంచడానికి దాదాపు 125 రోజులు, అంటే 4 నెలలకు పైగా సమయం పట్టింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం నడుమ.. కఠినమైన ఇస్లామిక్ సాంప్రదాయాలను పాటిస్తూనే శవాన్ని ఇన్నాళ్ల పాటు చెడిపోకుండా ఉంచడం అంతర్జాతీయ ఫోరెన్సిక్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది! మరి ఇరాన్ దీనిని ఎలా సాధించింది?

కెమికల్స్ లేకుండా ‘మెడికల్ కోల్డ్ స్టోరేజ్’ పద్ధతి

అలీ ఖమేనీ అంత్యక్రియల్లో భారీగా తరలివెళ్లిన ఇరాన్ ప్రజలు..
అలీ ఖమేనీ అంత్యక్రియల్లో భారీగా తరలివెళ్లిన ఇరాన్ ప్రజలు..

సాధారణంగా మృతదేహాలు ఎక్కువ కాలం పాడవకుండా ఉండటానికి రసాయనాలను ఉపయోగించి ‘ఎంబాల్మింగ్’ ప్రక్రియను చేస్తారు. కానీ, ఖమేనీ, ఆయనతో పాటు మరణించిన నలుగురు కుటుంబ సభ్యుల శరీరాలకు ఎలాంటి కెమికల్స్ వాడలేదు. దీనికి బదులుగా అత్యాధునిక 'రెఫ్రిజరేటెడ్ మెడికల్ కోల్డ్ స్టోరేజ్' సాంకేతికతను మాత్రమే ఇరాన్ ఉపయోగించింది.

ఇందుకు గల ప్రధాన కారణాలు :

ఇస్లామిక్ చట్టాల ఆంక్షలు: సున్నీ, షియా ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం మృతదేహాలకు రసాయనాలు ఎక్కించడం పూర్తిగా నిషిద్ధం. ఎంబాల్మింగ్ ప్రక్రియలో సహజ శారీరక ద్రవాలను తొలగించి ఫార్మాల్డిహైడ్ ఆధారిత రసాయనాలను నింపుతారు. దీనిని మృతుల పవిత్రతను దెబ్బతీయడంగా ఇస్లామిక్ ధర్మశాస్త్రం భావిస్తుంది.

కచ్చితమైన ఉష్ణోగ్రత నియంత్రణ: రసాయనాలు లేకుండా 125 రోజుల పాటు శరీరం కుళ్లిపోకుండా ఉండేందుకు హై-ప్రిసిషన్ మెడికల్ రిఫ్రిజరేషన్ యూనిట్లను ఉపయోగించారు. ఈ యంత్రాల ద్వారా ఉష్ణోగ్రతను 2°C నుంచి 4°C మధ్య స్థిరంగా ఉంచారు. అలాగే కణజాలం ఎండిపోకుండా, కణాలు విచ్ఛిన్నం కాకుండా ఉండేలా హ్యుమిడిటీ (తేమ) స్థాయిలను అత్యంత కచ్చితత్వంతో నియంత్రించారు.

ఈ దాడిలోనే మరణించిన ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, 14 నెలల మనవరాలి శరీరాలను కూడా ఇదే పద్ధతిలో భద్రపరిచారు.

4 నెలల ఆలస్యంపై షియా చట్టాల సవరణ..

ప్రస్తుతం టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా మైదానంలో జరుగుతున్న వీడ్కోలు సభల్లోనూ భౌతికకాయం పాడవకుండా ఉండేందుకు అత్యాధునిక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. టెహ్రాన్‌లో ప్రస్తుతం ఉన్న తీవ్రమైన హీట్​వేవ్, లక్షలాదిగా తరలివచ్చిన జనాల ఉష్ణోగ్రత వల్ల మృతదేహం దెబ్బతినకుండా, ఖమేనీ శవపేటికను ఒక ప్రత్యేకమైన క్లైమేట్ కంట్రోల్డ్ గ్లాస్ ఎన్‌క్లోజర్ (ఏసీ అమర్చిన అద్దాల పెట్టె) లో ఉంచారు. దీనివల్ల ఇరాన్ జాతీయ జెండా, నల్లటి తలపాగా ఉంచిన శవపేటికను అభిమానులు దూరం నుంచి సందర్శించడానికి వీలు పడటంతో పాటు లోపల వాతావరణం చల్లగా ఉండి శరీరం స్థిరంగా ఉంటుంది.

ఇరానియన్ల కన్నీళ్లు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలకు ఇరాన్ ప్రజలు భారీ స్థాయిలో తరలివెళుతున్నారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. వాస్తవానికి అలీ ఖమేనీ ఒక నియంత అని, ఆయన పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారని గత కొన్నేళ్లుగా వార్తలు విపరీతంగా వినిపించాయి.

ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. టెహ్రాన్ వీడ్కోలు సభలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘలీబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కన్నీరు పెట్టుకోవడంపై ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఖమేనీని అసహ్యించుకుంటారని తాను భావించానని, ఇవి బహుశా “నకిలీ కన్నీళ్లు” అయి ఉండొచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు, అంత్యక్రియల వేదికపై ఇరాన్ నాయకత్వం అంతా ఒకేచోట ఉందని, “ఒకే ఒక్క షాట్”తో మిగిలిన ఇరాన్ లీడర్లను కూడా ఖతం చేయగలనని, కానీ భవిష్యత్తులో చర్చలు జరపడానికి ఎవరూ మిగలరనే ఉద్దేశంతో తాను ఆ పని చేయడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe