...
...
Next Story

CJP protests : ఇంకా పోలీసుల అదుపులోనే దీప్కే, ధ్రువ్​ రాఠీ- ఈరోజు కూడా నిరసనలకు సీజేపీ పిలుపు

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో సీజేపీ జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసనతో దేశ రాజధాని దిల్లీ రణరంగంగా మారింది. ఈరోజు కూడా నిరసనలు కొనసాగుతాయని సీజేపీ ప్రకటించింది.

Published on: Oct 11, 2026, 06:06:19 IST
Advertisement

ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) శనివారం జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన ప్రదర్శన దేశ రాజధాని దిల్లీలో తీవ్ర కలకలం రేపింది. కేంద్ర ప్రభుత్వం, పోలీసులు ఈ ఆందోళనను అణచివేసేందుకు విధించిన ఆంక్షలు, చేపట్టిన అరెస్టులతో నగరం అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఒక్కరోజేదిల్లీ నగరవ్యాప్తంగా దాదాపు 3,000 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రులు, ప్రముఖ నేతల డిటైన్..

దిల్లీ నిరసనల్లో ప్లకార్డులతో ప్రజలు.. (Bloomberg)
దిల్లీ నిరసనల్లో ప్లకార్డులతో ప్రజలు.. (Bloomberg)

పోలీసుల ముందస్తు ముట్టడి, అరెస్టుల పర్వంలో దేశంలోని ప్రముఖ విపక్ష నేతలు, నలుగురు మాజీ ముఖ్యమంత్రులు చిక్కుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్‌లను పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు సీపీఎం నేతలు ఎంఏ బేబీ, బృందా కరత్, దిపాంకర్ భట్టాచార్య, ఆప్ నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రియన్, డోలా సేన్, సాకేత్ గోఖలే, సామాజిక కార్యకర్తలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత భూషణ్, ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీలను భద్రతా బలగాలు డిటైన్ చేశాయి.

అధికారికంగా అనుమతి లేదనే నెపంతో నిరసనకారులను జంతర్ మంతర్ వైపు రాకుండా మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. దిల్లీ హాట్ సమీపంలో ఐసా విద్యార్థి సంఘం నేత నేహా బొరా నేతృత్వంలో ధర్నాకు యత్నించగా, పోలీసులు లాఠీలతో నిరసనకారులను నెట్టివేసి పోలీస్ వ్యాన్లలోకి తోసేశారు.

కాగా శనివారం అర్ధరాత్రి వేళకు సీనియర్ సిటిజన్లు, మహిళలతో పాటు దాదాపు 3వేల మందిని విడుదల చేసినప్పటికీ, సీజేపీ అగ్రనాయకత్వం, ధ్రువ్ రాఠీ (అర్ధరాత్రి 12:15 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం) పోలీసుల కస్టడీలోనే ఉన్నారు.

విమానం దిగకుండానే సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్!

ఢిల్లీ అరెస్టుల పర్వంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెన్నై వేదికగా తీవ్రస్థాయిలో స్పందించారు. "నాయకులందరినీ అరెస్ట్ చేయండి.. యువతను అరెస్ట్ చేయండి.. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయండి. మేము మిమ్మల్ని నలువైపులా చుట్టుముడుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నరేంద్ర మోదీ నాశనం చేస్తున్నారు. ఆయన 15 ఏళ్ల రాజకీయ నాటకం ముగింపునకు వచ్చింది," అని రాహుల్ ఎక్స్​లో హెచ్చరించారు.

మోదీ, షా భయపడుతున్నారు: సీజేపీ నేత అజింక్యా షిండే

వాస్తవానికి సీజేపీ నిరసనలు శనివారం ఒక్కరోజే ఉండాలి. కానీ తాజా పరిస్థితుల దృష్ట్యా ఆదివారం కూడా ఆందోళనలు చేపట్టాలని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది.

అరెస్టులకు తాము భయపడేది లేదని, ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ వైపు మార్చ్ నిర్వహిస్తామని సీజేపీ జాతీయ సంస్థాగత బాధ్యుడు అజింక్యా షిండే స్పష్టం చేశారు.

"అరెస్టులు చేయగానే అందరూ ఇళ్లకు వెళ్లిపోతారని ప్రభుత్వం భావించింది. నరేంద్ర మోదీ, అమిత్ షాలలో కనిపిస్తున్న ఈ భయమే మేము సగం యుద్ధం గెలిచామని నిరూపిస్తోంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకు మా పోరాటం ఆగదు," అని ఆయన తేల్చిచెప్పారు. ఇక కాంగ్రెస్ నాయకత్వంలోని ‘ఇండియా’ కూటమి కూడా ఆదివారం దిల్లీలో భారీ నిరసనకు పిలుపునిచ్చింది.

దిల్లీ ప్రజల అవస్తలు..

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు సీజేపీ, ఇండియా కూటమి నిరసనలు, ప్రభుత్వం భారీ స్థాయి ఆంక్షలతో దిల్లీ ప్రజలు అల్లాడిపోతున్నారు. రూట్ల​ మళ్లింపు నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో వాహనాలు తీవ్ర ట్రాఫిక్​ జామ్​లో చిక్కుకున్నాయి. భారీ పోలీసు బలగాల మోహరింపుతో సున్నిత ప్రాంతాల్లో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

ఆదివారం కూడా నగరవ్యాప్తంగా మెట్రో ఆంక్షలు, పారామిలటరీ బలగాల పహారా కొనసాగుతుండటంతో దిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

"అరాచకం ఓడిపోయింది": బీజేపీ తిరుగుబాట

మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. "భారతదేశం బనానా రిపబ్లిక్ కాదు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఏనాడూ తలవంచలేదు, ఇకపై కూడా వంచదు. నిరసనల పేరుతో అరాచకం సృష్టించాలనుకున్న ప్రతిపక్షాల కుట్రలు ఓడిపోయాయి," అని ఆయన వ్యాఖ్యానించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks