Dhanteras 2026 : ధన్​తేరస్ స్పెషల్- ఇండియాలో అధిక లాభాలు ఇస్తున్న టాప్ గోల్డ్ ఈటీఎఫ్​లు ఇవి..

నవంబర్ 6న వచ్చే ధన్​తేరస్ పండుగ సందర్భంగా బంగారం కొనాలనుకునే వారికి గోల్డ్ ఈటీఎఫ్‌లు అద్భుత ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. భౌతిక బంగారం తయారీ ఛార్జీలు, భద్రత, స్వచ్ఛత వంటి ఇబ్బందులు లేకుండా అత్యుత్తమ రాబడులు ఇస్తున్న టాప్ గోల్డ్ ఈటీఎఫ్‌ల వివరాలు, నిపుణుల సలహాలు ఇవే..

Published on: Oct 27, 2026, 16:30:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలుగువారికి పండుగల సీజన్ వచ్చిందంటే బంగారం దూకాణాలు కళకళలాడతాయి. ముఖ్యంగా రాబోయే నవంబర్ 6, 2026న వచ్చే ధనత్రయోదశి (ధన్​తేరస్) నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతో కొంత బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం ఆనవాయితీ. అయితే ఈసారి బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ, కేవలం ఆభరణాలు లేదా నాణాలు రూపంలోనే కాకుండా డిజిటల్ రూపంలో ఉన్న ‘గోల్డ్ ఈటీఎఫ్‌ల’ వైపు ఇన్వెస్టర్లు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు.

బెస్ట్ గోల్డ్ ఈటీఎఫ్​ల లిస్ట్ చూసేయండి..
బెస్ట్ గోల్డ్ ఈటీఎఫ్​ల లిస్ట్ చూసేయండి..

భౌతిక రూపంలో బంగారం కొనుగోలు చేస్తే నాణ్యతపై సందేహాలు, మేకింగ ఛార్జీలు, తరుగు, ఇంట్లో దాచుకోవడానికి లాకర్ల భద్రత భయం ఉంటాయి. కానీ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో అలాంటి సమస్యలేమీ ఉండవు. స్టాక్ మార్కెట్ ద్వారా తక్కువ అమౌంట్​తోనే డిజిటల్ పసిడిలో పెట్టుబడి పెట్టవచ్చు.

రికార్డు రాబడులు ఇస్తున్న గోల్డ్ ఈటీఎఫ్‌లు!

వాల్యూ రీసెర్చ్ గణాంకాల ప్రకారం.. అక్టోబర్ 26, 2026 నాటికి గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్లు ఇన్వెస్టర్లకు మతిపోయే రాబడులను అందించాయి.

ఈ ఏడాది (వైటీడీ): 6.94% రాబడి

1 సంవత్సరంలో: 18.64% రాబడి

3 సంవత్సరాలలో: 31.90% వార్షిక రాబడి (సీఏజీఆర్)

5 సంవత్సరాలలో: 23.15% వార్షిక రాబడి (సీఏజీఆర్)

పసిడి మార్కెట్ ఒడిదుడుకుల్లోనూ ఈటీఎఫ్‌లు ఎంత స్థిరమైన ప్రయోజనాన్ని ఇచ్చాయో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

టాప్ పర్ఫార్మింగ్ గోల్డ్ ఈటీఎఫ్‌లు ఇవే..

వివిధ కాలపరిమితుల్లో అత్యుత్తమ రాబడులు అందించిన టాప్ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ల జాబితా ఇక్కడ చూడవచ్చు:

1 సంవత్సరం వ్యవధిలో:

Gold ETFs1-year return (%)
Tata Gold ETF15.82
ABSL Gold ETF15.81
Zerodha Gold ETF15.77
DSP Gold ETF15.75
LIC MF Gold ETF15.44

*సోర్సు- వాల్యూ రీసెర్చ్ (అక్టోబర్ 26 వరకు ఉన్న డేటా)

తాజా నివేదికల ప్రకారం టాటా గోల్డ్ ఈటీఎఫ్ ఏకంగా 15.82% రాబడితో అగ్రస్థానంలో నిలవగా, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్ 15.81%, జీరోధా గోల్డ్ ఈటీఎఫ్ 15.77% రాబడులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

3 సంవత్సరాల వ్యవధిలో:

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్, యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ రెండు ఫండ్లు ఏటా 31.20% సీఏజీఆర్ రాబడితో సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాయి. ఆదిత్య బిర్లా గోల్డ్ ఈటీఎఫ్ 31.18%తో వీటి వెనుకే ఉంది.

Gold ETFs3-year CAGR (%)
ICICI Prudential Gold ETF31.20
UTI Gold ETF31.20
ABSL Gold ETF31.18
LIC MF Gold ETF31.12
Kotak Gold ETF31.09

*సోర్సు- వాల్యూ రీసెర్చ్ (అక్టోబర్ 26 వరకు ఉన్న డేటా)

5 సంవత్సరాల సుదీర్ఘ వ్యవధిలో:

ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ గోల్డ్ ఈటీఎఫ్ 23.29% ఏటికేడాది రాబడితో టాప్‌లో నిలిచింది. యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ 23.07%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఈటీఫ్‌లు చెరో 22.98% సీఏజీఆర్‌ అందించాయి.

Gold ETFs5-year CAGR (%)
LIC MF Gold ETF23.29
UTI Gold ETF23.07
ICICI Prudential Gold ETF22.98
Invesco India Gold ETF22.98
ABSL Gold ETF22.94

*సోర్సు- వాల్యూ రీసెర్చ్ (అక్టోబర్ 26 వరకు ఉన్న డేటా)

ఈ విశ్లేషణను పరిశీలిస్తే.. ఎల్ఐసీ ఎంఎఫ్, ఏబీఎస్‌ఎల్ గోల్డ్ ఈటీఫ్‌లు 1, 3, 5 ఏళ్ల కాలపరిమితుల్లో నిలకడగా టాప్ పర్ఫార్మర్లుగా కొనసాగుతున్నాయి.

ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడి పెట్టవచ్చా?

పసిడి ధరలు రికార్డు స్థాయిలకు చేరిన వేళ ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆర్థిక విశ్లేషణ సంస్థ 'లెమన్' రీసెర్చ్ హెడ్ గౌరవ్ గర్గ్ వివరించారు.

"ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం గోల్డ్ ఈటీఎఫ్‌లు ఎంతో ఆకర్షణీయమైన మార్గం. అయితే, ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నందున కొత్తగా పెట్టుబడి పెట్టేవారు కాస్త నిలకడగా ఆలోచించాలి," అని గౌరవ్ గర్గ్ అభిప్రాయపడ్డారు.

బంగారం ధరలు నేరుగా అమెరికా వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్ సూచీ కదలికలు, గ్లోబల్ భౌగోళిక రాజకీయాలు, రూపాయి-డాలర్ మారకం విలువపై ఆధారపడి ఉంటాయి. గరిష్ట ధరల వద్ద ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే స్వల్పకాలికంగా నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది.

పైగా బంగారం ద్వారా స్థిరమైన వడ్డీ లేదా డివిడెండ్ ఆదాయం రాదు.

ఇన్వెస్టర్లకు నిపుణుల సలహా!

మధ్యస్థ లేదా సుదీర్ఘ కాలపరిమితితో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఒకేసారి కాకుండా ఎస్‌ఐపీ పద్ధతిలో విడతల వారీగా గోల్డ్ ఈటీఎఫ్‌లలో క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ఈ ధనత్రయోదశికి మీ మొత్తం పెట్టుబడిని పసిడిలోనే పెట్టకుండా, మీ పోర్ట్‌ఫోలియోలో 5 నుంచి 10 శాతం వరకు మాత్రమే బంగారానికి కేటాయించడం సమంజసమని నిపుణులు సూచిస్తున్నారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More