హెచ్​-1బీ వీసా లాటరీ వ్యవస్థ రద్దుతో భారతీయులపై పెను ప్రభావం- ఇదే కారణం..

దశాబ్దాలుగా ఉన్న హెచ్​-1బీ వీసా లాటరీ వ్యవస్థను రద్దు చేసింది ట్రంప్​ ప్రభుత్వం. ఇకపై నైపుణ్యం- జీతం ఆధారంగానే వీసాలు ఇచ్చేలా నిబంధనలు తీసుకొచ్చింది. దీనివల్ల అమెరికా కలలు కంటున్న భారతీయలపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Published on: Dec 24, 2025, 09:10:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దశాబ్దాల పాటు ఉన్న హెచ్​-1బీ వీసా లాటరీ వ్యవస్థకు స్వస్తి చెబుతూ డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం గట్టి షాక్​ ఇచ్చింది! ఇప్పటివరకు ఉన్న లాటరీ వ్యవస్థకు బదులు కేవలం నైపుణ్యం, అధిక వేతనాల ప్రాదిపదికన ఇక నుంచి హెచ్​-1బీ వీసాలు జారీ చేస్తామని అమెరికా ప్రకటించింది. అమెరికాలో ఉద్యోగం చేస్తూ, అక్కడే స్థిరపడాలని భావిస్తున్న లక్షలాది మంది భారతీయులను ప్రభావితం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ట్రంప్​ షాకింగ్​ నిర్ణయంతో భారతీయులపై పెను ప్రభావం! (AI-generated image)
ట్రంప్​ షాకింగ్​ నిర్ణయంతో భారతీయులపై పెను ప్రభావం! (AI-generated image)

హెచ్​-1బీ వీసా కొత్త నిబంధన ఏంటి?

అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం డీహెచ్​ఎస్) ప్రకటించిన తాజా నిబంధనల ప్రకారం.. ఇకపై హెచ్​-1బీ వీసా కావాలంటే కేవలం అదృష్టం ఉంటే సరిపోదు, భారీ జీతం కూడా ఉండాలి.

అత్యధిక నైపుణ్యం ఉండి, ఎక్కువ వేతనం పొందే దరఖాస్తుదారులకు వీసా కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

ఈ కొత్త విధానం 2026 ఫిబ్రవరి 27 నుంచి అమలులోకి వస్తుంది. 2027ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బీ క్యాప్ రిజిస్ట్రేషన్ల నుంచి ఇది వర్తిస్తుంది.

కొత్త నిబంధనల కారణంగా.. తక్కువ వేతనాలు ఇచ్చి విదేశీయులను తెచ్చుకునే కంపెనీలకు ఇకపై వీసాలు దక్కడం కష్టమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

హెచ్​-1బీ వీసా లాటరీ వ్యవస్థ రద్దు- భారతీయులపై ప్రభావం ఎందుకు ఎక్కువ?

అమెరికా ప్రస్తుతం ఏటా 65,000 సాధారణ హెచ్​-1బీ వీసాలు, అమెరికాలో ఉన్నత చదువులు చదివిన వారికి అదనంగా మరో 20,000 వీసాలను జారీ చేస్తోంది.

అయితే, ఈ మొత్తం హెచ్-1బీ వీసాల్లో 70 శాతానికి పైగా భారతీయులే పొందుతున్నారు. ప్రస్తుతం సుమారు 3 లక్షల మంది భారతీయ నిపుణులు అమెరికాలో ఈ వీసాపైనే పని చేస్తున్నారు. దీని బట్టి భారతీయులకు ఇది ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు.

ఈ మార్పు వల్ల పెద్ద టెక్ కంపెనీల్లో భారీ జీతాలకు పని చేసే సీనియర్లకు ఇబ్బంది లేకపోయినా.. కెరీర్ ఆరంభంలో ఉన్న యువ ఇంజనీర్లు, చిన్న కంపెనీల్లో పని చేసే వారు, కన్సల్టెన్సీల ద్వారా వెళ్లే వారి అవకాశాలు భారీగా దెబ్బతినే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హెచ్​-1బీ వీసా లాటరీ వ్యవస్థను ఎందుకు తొలగించారు?

అమెరికన్ల కన్నా అంతర్జాతీయ ఉద్యోగుల జీతాలు తక్కువగా ఉంటాయి. దీనినే అదునుగా చూసుకుని తక్కువ జీతాలకు వచ్చే అంతర్జాతీయ ఉద్యోగులను ఎక్కువగా తీసుకుని, అమెరికన్లకు జాబ్స్​ ఇవ్వడం లేదనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి.

హెచ్​-1బీ వీసా లాటరీ వ్యవస్థను రద్దూ చేస్తూ ట్రంప్​ ప్రభుత్వం కూడా ఈ విషయాన్నే పునరుద్ఘటించింది.

"ప్రస్తుతం ఉన్న లాటరీ విధానాన్ని అనేక కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయి. తక్కువ జీతాలకే విదేశీయులను దిగుమతి చేసుకుంటూ అమెరికన్ల ఉద్యోగాలకు గండికొడుతున్నాయి," అని అమెరికా పౌరసత్వ, వలస సేవల (యూఎస్​సీఐఎస్​) ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ పేర్కొన్నారు.

ఫీజుల భారం.. సోషల్ మీడియా తనిఖీలు!

హెచ్​-1బీ వీసా ప్రక్రియను ట్రంప్​ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా టైట్​ చేస్తోంది! వీసా నిబంధనలు మార్చడమే కాకుండా, ఒక్కో కొత్త హెచ్-1బీ దరఖాస్తుపై 100,000 డాలర్ల (సుమారు రూ. 84 లక్షలు) అదనపు ఫీజును కూడా ప్రభుత్వం విధించింది. ఇంత భారీ మొత్తాన్ని భరించడం చిన్న కంపెనీలకు సాధ్యం కాకపోవచ్చు.

దీనికి తోడు డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. హెచ్-1బీ దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా వివరాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ తీవ్రమైన తనిఖీల వల్ల వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడుతున్నాయి. దీనివల్ల ఇండియాకు సెలవులపై వచ్చి, తిరిగి వెళ్లలేక వేలాది మంది టెక్కీలు చిక్కుకుపోయారు. కొందరికి 2026 లేదా 2027 వరకు కూడా అపాయింట్‌మెంట్లు దొరకని పరిస్థితి నెలకొంది.

మలుపు తిరుగుతున్న ఐటీ రంగం?

దశాబ్దాలుగా భారత ఐటీ రంగాన్ని నడిపిస్తున్న 'ఆన్‌సైట్' కల ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ కఠిన నిబంధనల వల్ల భారతీయ ప్రతిభావంతులు కెనడా లేదా యూరప్ వైపు చూడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. లేదా కంపెనీలే తమ సేవలను భారత్‌లోనే మరింతగా విస్తరించే అవకాశం ఉంది.

ఏది ఏమైనా, "డాలర్ల" వేటలో ఉన్న భారతీయులకు అమెరికా ఇప్పుడు ఒక కఠినమైన పరీక్షను పెట్టిందనే చెప్పాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More