Cyclone Montha : ఆంధ్రపై అధిక ప్రభావం .. 11 రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్​!

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీవ్రరూపం దాల్చింది. తీరం దాటిన అనంతరం ఈ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై అధిక ప్రభావం చూపించనుంది! ఈ నేపథ్యంలో ఏపీతో పాటు మొత్తం 11 రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్​లు జారీ చేసింది.

Published on: Oct 28, 2025 10:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బంగాళాఖాతంలో మొంథా తుపాను తీవ్ర రూపం దాల్చింది! దీని ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు.. తీర ప్రాంతాల వెంబడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం.. తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉంది.

ఒడిశాలో తుపాను సన్నద్ధం.. (ANI)
ఒడిశాలో తుపాను సన్నద్ధం.. (ANI)

థాయ్ భాషలో "సువాసనగల పువ్వు" అని అర్థం వచ్చే ఈ మొంథా తుపాను.. అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం- కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది!

మొంథా తుపాను- ఆంధ్రప్రదేశ్‌లో హై అలర్ట్..

మొంథా తుపాను తీవ్ర ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది! వాతావరణ శాఖ అధికారుల వివరాల ప్రకారం.. తీర ప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, గంటకు 90–110 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంచనాల ప్రకారం.. తుపాను తీరం దాటే సమయంలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి 2 నుంచి 4.7 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడవచ్చు. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉంది.

తుపాను నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభావితమయ్యే తీర ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని, అక్కడ తగినంత సురక్షితమైన త్రాగునీరు, ఆహారాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ప్రతి గంటకు తుపాను కదలికలను పర్యవేక్షించాలని, సహాయక, పునరుద్ధరణ పనులను పర్యవేక్షించాలని ఆయన సూచించారు.

ఒడిశాలోనూ తరలింపులు ప్రారంభం..

మొంథా తుపాను నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కూడా ఎనిమిది దక్షిణ జిల్లాల్లో పెద్ద ఎత్తున తరలింపు ప్రయత్నాలను ప్రారంభించింది. మల్కన్‌గిరి, కోరాపుట్, నవరంగ్‌పూర్, రాయగడ, గజపతి, గంజాం, కలహండి, కంధమాల్ జిల్లాలకు అత్యంత భారీ వర్షాల కోసం "రెడ్ వార్నింగ్" జారీ చేశారు.

"మా మొదటి ప్రాధాన్యత 'జీరో క్యాజువాలిటీ' (ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఉండటం). గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, దివ్యాంగులపై ప్రత్యేక దృష్టి సారించి తరలింపులు జరుగుతున్నాయి," అని రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి సురేష్ పూజారి తెలిపారు.

ఎన్డీఆర్‌ఎఫ్, ఓడీఆర్‌ఏఎఫ్, ఒడిశా ఫైర్ సర్వీస్‌తో సహా 128 కంటే ఎక్కువ సహాయక బృందాలను మోహరించారు. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున అక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

మొంథా తుపాను- తమిళనాడులోనూ భారీ వర్షాలు..

తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, రాణిపేట్, కాంచీపురం సహా ఉత్తర జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ తుపాను ఉత్తర-వాయువ్య దిశగా కదులుతున్నందున వర్షాలు కొనసాగవచ్చని, అయినప్పటికీ "తుపాను వల్ల తమిళనాడుకు పెద్ద నష్టం కలిగే అవకాశం లేదు," అని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ రాష్ట్రం "పూర్తిగా సన్నద్ధంగా" ఉందని చెప్పారు. చెన్నై చుట్టుపక్కల ప్రమాదకర ప్రాంతాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.

బలమైన గాలులు, సముద్రం అల్లకల్లోలంగా ఉండటం వల్ల అక్టోబర్ 29 వరకు ఎవరూ వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ఐఎండీ హెచ్చరించింది.

మహారాష్ట్ర విదర్భలోనూ భారీ వర్షాలు..

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కూడా అక్టోబర్ 28 నుంచి 30 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చంద్రాపూర్, గడ్చిరోలి, వార్ధా, వాషిమ్, యావత్మాల్, భండారా, గోండియా, నాగ్‌పూర్ జిల్లాల్లో ఉరుములు, గంటకు 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలకు 'ఎల్లో అలర్ట్' జారీ అయింది.

ఇతర రాష్ట్రాలకు కూడా హెచ్చరిక..

మొంథా తుపను తీరం దాటిన తర్వాత దాని ప్రభావం లోపలికి కదులుతుంది కాబట్టి.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, గోవాలోని కొన్ని ప్రాంతాలకు కూడా యెల్లో అలర్ట్‌ను జారీ చేసింది ఐఎండీ. ఈ రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More