...
...
Next Story

Reliance Jio : తెలుగు నేలపై 'జియో' డిజిటల్ సునామీ- టెలికాం చరిత్రలోనే అపూర్వ విప్లవం!

సెప్టెంబర్ 5, 2016న వాణిజ్య సేవలు ప్రారంభించిన రిలయన్స్ జియో.. పదేళ్లలో తెలుగు రాష్ట్రాల టెలికాం రంగాన్ని మలుపు తిప్పేసింది. డేటా అయిపోతుందేమో అన్న భయం నుంచి అపరిమిత డిజిటల్ లభ్యత వరకు జరిగిన సమగ్ర పరిణామం, పోటీ సంస్థల పరిస్థితి, 5జీ విప్లవంతో మారిన ఆర్థిక వ్యవస్థపై ప్రత్యేక కథనం..

Published on: Sep 3, 2026, 10:05:04 IST
Advertisement

పదేళ్ల క్రితం, అంటే 2016 సెప్టెంబర్ 5కు ముందు భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వాడకం అనేది ఒక లగ్జరీ విషయంగా పరిగణించాల్సి వచ్చేది. ఇక ఆ స్మార్ట్​ఫోన్స్​లో ఒక్క మెగాబైట్ డేటా కూడా వృథా కాకూడదని వినియోగదారులు పడిన ఆరాటం అంతా ఇంతా కాదు! వీడియోలు చూడటం, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు చేయడం అనేది సామాన్యుడికి పెద్దగా పరిచయం లేని విషయాలు.

టెలికాం చరిత్రలోనే అపూర్వ విప్లవం.. రిలయన్స్ జియో! (AI Generated Image)
టెలికాం చరిత్రలోనే అపూర్వ విప్లవం.. రిలయన్స్ జియో! (AI Generated Image)

ఆనాటి క్లిష్ట పరిస్థితులు గణాంకాలను పరిశీలిస్తే మరింత అర్థమవుతాయి. 2016లో ఒక భారతీయుడు నెలకు సగటున వాడిన డేటా కేవలం 0.2 జీబీ (200 ఎంబీ) కంటే తక్కువ! పైగా ఒక్క జీబీ డేటా ధర సుమారు రూ. 228గా ఉండేది. దేశమంతటా కలిపి 4జీ వాడుతున్న వారి సంఖ్య కోటి కంటే తక్కువే. ఇంటర్నెట్ వేగం సగటున 2.5 ఎంబీపీఎస్ దాటడానికి ముప్పుతిప్పలు పడేది.

అప్పుడొచ్చింది రిలయన్స్ జియో! ఈ పాత వ్యవస్థ పునాదులను కదిలించేసి, అనేక సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్​గా నిలిచింది. హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను విలాసవంతమైన వస్తువుగా కాకుండా ప్రాథమిక అవసరంగా మార్చడమే జియో ప్రధాన వ్యూహంతో దూసుకెళ్లింది.

ఫలితంగా.. ఈ దశాబ్ద కాలంలో (2016-2026) జీబీ డేటా ధర ఏకంగా 97 శాతం తగ్గి, ప్రస్తుతం కేవలం రూ. 7.9కి పడిపోయింది. దేశంలో 4జీ, 5జీ వాడే చందాదారుల సంఖ్య 93.8 కోట్లకు చేరింది. నేడు ఒక సగటు జియో వినియోగదారుడు నెలకు ఏకంగా 42.3 జీబీ డేటాను వినియోగిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు వృద్ధి: 0 నుంచి 3.25 కోట్ల చందాదారులు!

ఆగస్టు 2016 నాటికి అసలు ఒక్క చందాదారుడు కూడా లేని జియో.. సెప్టెంబర్ 2016లో సేవలు ప్రారంభించిన తొలి నెలలోనే 12.4 లక్షల కనెక్షన్లను సాధించింది. జూన్ 2026 నాటికి ఈ సంఖ్య 3.258 కోట్లకు (325.8 లక్షలు) ఎగబాకింది. అంటే పదేళ్లలో 3.134 కోట్ల మంది కొత్త వినియోగదారులు జియో నెట్‌వర్క్‌లో చేరారు. ఈ విభాగంలో జియో సాధించిన సీఏజీఆర్ 39.9 శాతంగా నమోదైంది.

జూన్ 2024 నాటికి ఏపీ, తెలంగాణలో జియో గరిష్ఠంగా 3.307 కోట్ల చందాదారుల మైలురాయిని తాకింది. జూన్ 2026 నాటికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 8.83 కోట్ల వైర్‌లెస్ కనెక్షన్లలో 36.9 శాతం వాటాతో జియో బలమైన రెండో పెద్ద టెలికాం వ్యవస్థగా అవతరించింది.

2016లో జియో గురించి ప్రకటన చేస్తున్న ముకేశ్ అంబానీ

పోటీ కంపెనీలపై పడిన ప్రభావం: ట్రాయ్ అధికారిక గణాంకాలు..

జియో రాకతో పాత తరం టెలికాం దిగ్గజాలు తీవ్ర ఊగిసలాటకు గురయ్యాయన్నది అందరికి తెలిసిన విషయమే. 2016లో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్, టాటా టెలిసర్వీసెస్, ఆర్‌కామ్, ఎయిర్‌సెల్, టెలినార్, వీడియోకాన్ వంటి 8కి పైగా కంపెనీలు ఉండేవి. 2019 నాటికి వొడాఫోన్ ఐడియాను, ఆ తర్వాత ఎయిర్‌టెల్‌ను దాటేసి జియో కొద్దికాలం ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ మొదటి స్థానంలో నిలవగా, జియో తీవ్ర పోటీనిస్తూ రెండో స్థానంలో ఉంది.

ట్రాయ్ అధికారిక గణాంకాల ప్రకారం పదేళ్ల మార్కెట్ మార్పులు (ఆగస్టు 2016 - జూన్ 2026):

ఆపరేటర్ఆగస్టు 2016 (లక్షల్లో)జూన్ 2026 (లక్షల్లో)మార్పు (లక్షల్లో)10ఏళ్ల సీఏజీఆర్​
రిలయన్స్ జియో-325.8+313.839.9శాతం
ఎయిర్​టెల్241.7394.1+152.45.1శాతం
వొడాఫోన్ ఐడియా228.687.3-141.3-9.3శాతం
బీఎస్​ఎన్​ఎల్​97.575.8-21.7-.25శాతం
ఇతరులు164.10.0-164.1-
View All

తెలుగు మార్కెట్‌ను మార్చేసిన 3 ప్రధాన అంశాలు..

మార్కెట్ కన్సాలిడేషన్ : 8 కంటే ఎక్కువ కంపెనీలు ఉన్న మార్కెట్, కేవలం నలుగురు ప్లేయర్ల రంగాలుగా మారింది. చిన్న కంపెనీలన్నీ మూతపడ్డాయి లేదా విలీనమయ్యాయి.

విలీన సంస్థ వైఫల్యం: జియోను ఎదుర్కొనేందుకు వొడాఫోన్, ఐడియా కలిసినా ప్రయోజనం లేకపోయింది. జూలై 2018లో 2.47 కోట్ల చందాదారులతో గరిష్ఠ స్థాయికి చేరిన వీఐ, ఆ తర్వాత నిరంతరం కస్టమర్లను కోల్పోయి జూన్ 2026 నాటికి 87.3 లక్షలకు పడిపోయింది.

మార్కెట్ విస్తరణ: జియో కేవలం ఇతరుల కస్టమర్లను పొందడమే కాకుండా, కొత్తగా కోట్లాది మందికి ఇంటర్నెట్ అందించింది. ఏపీ సర్కిల్ మొత్తం కనెక్షన్లు 7.47 కోట్ల నుంచి 8.83 కోట్లకు (18.1 శాతం పెరుగుదల) పెరిగాయి.

వీధి వ్యాపారి నుంచి స్వదేశీ సాంకేతికత వరకు..

విజయవాడ వీధి పండ్ల వ్యాపారి, వరంగల్ టీ కొట్టు యజమాని ఫోన్‌లో యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వెనుక.. ఉచిత, చౌకైన డేటా విప్లవమే ఉంది. గ్రామీణ విద్యార్థుల ఆన్‌లైన్ విద్య, యూట్యూబ్ ద్వారా క్రియేటర్ల సంపాదన, చిన్న వ్యాపారాల విస్తరణ సాధ్యమయ్యాయి. దేశంలో డిజిటల్ వాలెట్ వాడేవారి సంఖ్య 2016లో నామమాత్రంగా ఉంటే, 2026 నాటికి 55.6 కోట్లకు చేరింది. ఓటీటీ ప్రేక్షకులు 3 కోట్ల నుంచి 60.1 కోట్లకు పెరిగారు.

సాంకేతికత పరంగా గతంలో 4జీ భారత్‌కు రావడానికి 8 ఏళ్లు పడితే, 5జీ విషయంలో ఆ జాప్యం లేకుండా రిలయన్స్ జియో చూసుకుంది! కేవలం 15 నెలల్లోనే దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ నిర్మించి, 26.8 కోట్ల మంది 5జీ కస్టమర్లను దక్కించుకుంది.

విదేశీ పరికరాలపై ఆధారపడకుండా జియో తన 11,303 మంది పరిశోధకుల సాయంతో స్వదేశీ 'క్లౌడ్-నాటివ్ స్టాండ్‌అలోన్ 5జీ' సాంకేతికతను తయారుచేసింది. 4జీ, 5జీ, 6జీ, ఏఐ విభాగాల్లో ఏకంగా 6,817 పేటెంట్లను ఫైల్ చేసింది.

జియో సిమ్​ కోసం క్యూ కట్టిన ప్రజలు

స్మార్ట్‌ఫోన్ ధరల భారాన్ని అధిగమించే దిశగా..

దేశవ్యాప్తంగా అత్యాధునిక నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చినా, దాన్ని వినియోగించుకునేందుకు స్మార్ట్‌ఫోన్ కొనుగోలు శక్తి లేకపోవడం ఇప్పటికీ కోట్లాది మందికి ప్రధాన సమస్యగా నిలుస్తోంది. భారతదేశంలో నేటికీ దాదాపు 25 కోట్ల మంది వినియోగదారులు పాత తరం 2జీ నెట్‌వర్క్‌లోనే చిక్కుకుపోయారు. దీనికి నెట్‌వర్క్ సిగ్నల్స్ లేకపోవడం ఎంతమాత్రం కారణం కాదు; స్మార్ట్‌ఫోన్ల ప్రారంభ ధరలు సామాన్యుడి బడ్జెట్‌కు మించిపోవడమే అసలు అడ్డంకి.

డిజిటల్ వ్యత్యాసాన్ని చెరిపేసేందుకు రిలయన్స్ జియో ‘జియోభారత్’ ఫోన్‌ను రంగంలోకి దించింది. ఫిజికల్ 'కీ'లు, మెరుగైన బ్యాటరీ లైఫ్, ప్రాంతీయ భాషా సదుపాయాలతో కూడిన ఈ చౌక డివైజ్ ద్వారా సామాన్యులకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో డిజిటల్ కెమెరా, హెచ్‌డీ వాయిస్ కాలింగ్, స్ట్రీమింగ్ మీడియాతో పాటు యూపీఐ ద్వారా నేరుగా డబ్బులు పంపే సౌకర్యాన్ని కల్పించి 2జీ వినియోగదారులను వేగంగా 4జీ వైపు నడిపిస్తోంది.

వైర్‌లెస్ సాంకేతికతతో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ విప్లవం..

మరోవైపు గృహాలకు అందించే బ్రాడ్‌బ్యాండ్ సేవల రూపరేఖలను కూడా జియో మార్చేసింది. ప్రధాన నగరాల వెలుపల ప్రతీ ఇంటికి ఫైబర్ ఆప్టికల్ కేబుళ్లు వేయడం అత్యంత శ్రమతో, భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఈ భౌతిక పరిమితులను దాటేసేందుకు జియో 'అన్‌లైసెన్స్​డ్​ బ్యాండ్ రేడియో' (యూబీఆర్​) పేరుతో ఫిక్స్​డ్​-వైర్‌లెస్ సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఇది వైర్లతో పనిలేకుండా గాలిలోనే నేరుగా గృహాలకు వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను అందజేస్తుంది.

మార్చి 31, 2026 నాటికి జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య ఏకంగా 2.7 కోట్లను దాటింది. దీనితో భారతదేశంలోనే అతిపెద్ద హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవా సంస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తన సమీప పోటీదారు కంటే జియో బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల సంఖ్య దాదాపు 1.9 రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. ఈ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ పునాదితో హెచ్‌డీ టెలివిజన్, క్లౌడ్ గేమింగ్, స్మార్ట్-హోమ్ ఐఓటీ పరికరాలు ఒకే నెట్‌వర్క్ కింద నిరంతరాయంగా పనిచేస్తున్నాయి.

రూ.1.46 లక్షల కోట్ల ఆదాయంతో రికార్డులు

పదేళ్ల ప్రయాణంలో జియో సాధించిన ఆర్థిక పురోగతి టెలికాం రంగంలో దాని ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జియోకు 52.44 కోట్ల మంది యాక్టివ్ చందాదారులు ఉన్నారు. మార్చి 31, 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (ఎఫ్​వై2026) గాను ఈ డిజిటల్ దిగ్గజం రూ.1,46,885 కోట్ల కార్యాచరణ ఆదాయాన్ని సాధించింది. ఎబిట్​డా రూ. 76,255 కోట్లుగా నమోదైంది.

సమగ్ర డిజిటల్ వ్యవస్థగా రూపాంతరం..

2016 సెప్టెంబర్‌లో కేవలం చౌకైన ఇంటర్నెట్ కనెక్షన్‌తో ప్రారంభమైన జియో, పదేళ్లలో టెలికాం ఆపరేటర్ నిర్వచనాన్నే మార్చింది. హై-స్పీడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, తక్కువ ధర డివైజ్లు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌ప్రైజ్ ఆపరేటింగ్ నెట్‌వర్క్​ల నుంచి కృత్రిమ మేధస్సు (ఏఐ), నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్స్ వరకు తన సామర్థ్యాన్ని విస్తరించుకుంది.

ఎక్కువ మంది ఆన్‌లైన్‌లోకి రావడం ద్వారా నెట్‌వర్క్ విస్తరణ ఖర్చులు తగ్గడం, సాఫ్ట్‌వేర్ ఆటోమేషన్ ద్వారా నిర్వహణ వ్యయం పడిపోవడం, ఏఐ సాంకేతికతతో నెట్‌వర్క్‌లోని అంతరాయాలను వినియోగదారులకు తెలియక ముందే గుర్తించి సరిచేయడం వంటివి సాధ్యమవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశమంతటా డిజిటల్ స్వావలంబనకు (సెల్ఫ్ రిలయన్స్) జియో ఒక బలమైన పునాదిగా నిలిచింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe