...
...
Next Story

Mutual fund : బిగినర్స్ గైడ్- మొదటి మ్యూచువల్​ ఫండ్​ని ఎంచుకోవడం ఎలా? ఇవి తెలిస్తే ఈజీ..

మ్యూచువల్ ఫండ్స్​లో తొలిసారి ఇన్వెస్ట్ చేసేవారు కేవలం గత రాబడులను చూసి నిర్ణయం తీసుకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యానికి తగిన ఫండ్‌ను ఎంచుకునేందుకు ఆర్థిక నిపుణులు తెలిపిన కీలక సూత్రాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Oct 8, 2026, 09:59:05 IST
Advertisement

భారతదేశంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా యువత, ఉద్యోగులు తమ దీర్ఘకాలిక ఆర్థిక అవసరాల కోసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న వందలాది స్కీములలో ఏ ఫండ్ ఎంచుకోవాలో తెలియక కొత్త మదుపర్లు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, హైబ్రిడ్, డెట్ కేటగిరీల రూపంలో ఎన్నో రకాలు ఉండటంతో చాలామంది ఒక సులువైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అదేంటంటే.. గడిచిన ఏడాది లేదా కొద్ది నెలల కాలంలో అత్యధిక రాబడులు ఇచ్చిన ఫండ్‌ను బ్లైండ్‌గా ఎంపిక చేసుకోవడం. ఇది సరైన పద్దతి కాదు!

మొదటి మ్యూచువల్​ ఫండ్​ని ఎంచుకోవడం ఎలా?
మొదటి మ్యూచువల్​ ఫండ్​ని ఎంచుకోవడం ఎలా?

గతంలో ఏ మ్యూచువల్ ఫండ్ ఎలాంటి రాబడి ఇచ్చిందనేది ఆ ఫండ్ భవిష్యత్తు పనితీరుకు హామీ ఇవ్వదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మార్కెట్ ఒడిదుడుకులకు గురై పడిపోతున్న సమయంలో సదరు ఇన్వెస్టర్ ఆ ఫండ్‌ను విక్రయించకుండా ఓపికగా ఉండగలడా లేదా అనేదే అసలైన ప్రశ్న. కేవలం తాత్కాలికంగా వచ్చిన లాభాలను చూసి ఇన్వెస్ట్ చేస్తే, మార్కెట్ కరెక్షన్‌లో నష్టపోయే ముప్పు ఉంది.

ఈ అంశంపై 'ఫండ్స్ ఇండియా' (FundsIndia.com) సీఈఓ రిషభ్ గార్గ్ మాట్లాడుతూ.. కొత్త ఇన్వెస్టర్లు గందరగోళం చెందకుండా సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎలా ఎంచుకోవచ్చో వివరంగా పంచుకున్నారు.

ముందుగా మూడు అంశాలను స్పష్టం చేసుకోవాలి..

ఆర్థిక లక్ష్యం, కాలపరిమితి: రాబోయే రెండేళ్లలో విహారయాత్ర కోసం కావాల్సిన నిధులు, 20 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ కోసం దాచుకునే సొమ్ము రెండూ ఒకే రకమైన ఫండ్‌లో పెట్టకూడదు. డబ్బు ఎప్పుడు అవసరమో దానికి తగిన సమయం లెక్కించాలి.

రిస్క్ టాలరెన్స్: మార్కెట్ క్షీణించినప్పుడు 20 నుంచి 25 శాతం దాకా పోర్ట్‌ఫోలియో విలువ పడిపోతే ఇన్వెస్టర్ మానసికంగా ఎలా స్పందిస్తారు అనేది విశ్లేషించుకోవాలి. మొదటి కరెక్షన్ చూడగానే భయపడి పెట్టుబడులను ఉపసంహరించుకునే మనస్తత్వం ఉంటే, అటువంటి ఫండ్ మీకు ఎంత లాభసాటిగా అనిపించినా అది సరిపడదు.

మీ ఆర్థిక లక్ష్యాల నుంచి వెనుకకు లెక్కించుకుంటూ ఫండ్ ఎంపిక చేసుకోవాలని రిషభ్ గార్గ్ సూచించారు.

1 నుంచి 2 ఏళ్ల లక్ష్యాలు: అతి స్వల్పకాలిక అవసరాలకు డెట్ ఫండ్లు అనుకూలంగా ఉంటాయి. ఇవి మూలధనానికి రక్షణ ఇస్తూ స్థిరమైన రాబడి అందిస్తాయి.

3 ఏళ్ల లక్ష్యాలు: ఉదాహరణకు కారు లేదా ఇంటి డౌన్​పేమెంట్ కోసం నిధులు సమకూర్చుకోవాలంటే డెట్ లేదా షార్ట్ డ్యూరేషన్ ఫండ్లలో ఎక్కువ భాగాన్ని ఉంచి, స్వల్ప మొత్తాన్ని హైబ్రిడ్ ఫండ్లలో కేటాయించవచ్చు.

5 ఏళ్ల లక్ష్యాలు: పిల్లల పాఠశాల అడ్మిషన్ల వంటి మధ్యకాలిక అవసరాలకు హైబ్రిడ్ లేదా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లతో పాటు డెట్ కేటాయింపులు చేయాలి. లక్ష్య సమయం దగ్గర పడుతున్న కొద్దీ లాభాలను డెట్ విభాగంలోకి మళ్లించడం శ్రేయస్కరం.

10 ఏళ్లకు పైబడిన లక్ష్యాలు: రిటైర్మెంట్, పిల్లల ఉన్నత చదువుల వంటి దీర్ఘకాలిక ప్రణాళికలకు ఈక్విటీ ఫండ్లలో అధిక కేటాయింపులు చేయవచ్చు. సుదీర్ఘ సమయం ఉండటం వల్ల మార్కెట్ పతనాల నుంచి కోలుకునే అవకాశం లభిస్తుంది.

ఈక్విటీ విభాగంలో లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లు కొత్త వారికి ప్రధాన పునాదిగా నిలుస్తాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్లు అధిక వృద్ధిని ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ, వాటిలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి వీటిని ప్రారంభంలోనే ఎక్కువగా కాకుండా పరిమిత శాతంలో ఎంచుకోవాలి.

గత ఏడాది రాబడుల మాయలో పడకండి..

ఒకే ఒక్క ఏడాది ప్రదర్శన పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఫండ్, ఆ సమయంలో నడిచిన నిర్దిష్ట మార్కెట్ ట్రెండ్ వల్ల లాభపడి ఉండవచ్చు. మార్కెట్ పరిస్థితులు మారగానే ఆ ఫండ్ స్థానం కూడా పడిపోవచ్చు.

అందుకే 1-సంవత్సరం రాబడులకు బదులుగా 3, 5, 10 ఏళ్ల కాలపరిమితితో పాటు మార్కెట్ పతనమైనప్పుడు ఆ ఫండ్ ఏ మేరకు నిలదొక్కుకుందో పరిశీలించాలి. ఇండెక్స్ బెంచ్‌మార్క్, తోటి ఫండ్స్​తో పోల్చి చూడాలి. "ఒకే ఒక్క ఏడాది బంపర్ లాభాలు ఇచ్చి మరుసటి ఏడాది పడిపోయే ఫండ్ కంటే, ప్రతీ ఏటా స్థిరమైన రాబడులు ఇచ్చే ఫండ్‌తో కొనసాగడమే ఇన్వెస్టర్లకు సురక్షితం," అని గార్గ్ తెలిపారు.

సులువైన ఎంపిక కోసం 'గోల్, కేటగిరీ, చెక్' సూత్రం..

గందరగోళాన్ని నివారించడానికి 'Goal, Category, Check' అనే మూడంచెల సూత్రాన్ని ఉపయోగించవచ్చు:

గోల్ : ఎంత డబ్బు అవసరం, ఎప్పటికి కావాలో స్పష్టంగా రాసుకోండి.

కేటగిరీ : మీ సమయం, రిస్క్‌కు సరిపోయే కేటగిరీని ఎంచుకుంటే వందలాది స్కీములు కొన్నింటికి తగ్గిపోతాయి.

చెక్ : ఆ కేటగిరీలోని 3 లేదా 4 మంచి ఫండ్ల స్థిరత్వం, ఖర్చులు, ఫండ్ హౌస్ ప్రతిష్టను పోల్చి చూసి 1 లేదా 2 ఫండ్లను ఖరారు చేసుకోండి.

తొలిసారి మార్కెట్లోకి వచ్చే వారు ఐదారు ఫండ్లలో కొద్దిమొత్తాలు చెల్లించడం కంటే, స్పష్టమైన ప్రణాళికతో ఒకే డైవర్సిఫైడ్ ఫండ్‌తో ప్రారంభించి ముందుకు సాగడం అత్యుత్తమ విధానం.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించాలి.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks