...
...
Next Story

Multiple Income Streams: ఒక్క జీతాన్నే నమ్ముకుంటే కొంప మునుగుతుంది… మేల్కోవాల్సిన సమయం ఇది

Multiple Income Streams: ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని అనిశ్చిత స్థితిలో, కేవలం నెల జీతంపైనే ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఒరాకిల్ లేఆఫ్స్ మరోసారి గుర్తుచేశాయి. మీ ఆర్థిక భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా రెండో ఆదాయ మార్గాలను (Multiple Income Streams) ఎలా సృష్టించుకోవాలో ఈ కథనంలో చూడండి.

Published on: Apr 18, 2026 09:49 AM IST
Advertisement

Multiple Income Streams: మార్చి 31, 2026.. తెల్లవారుజామున 6 గంటలు. అందరూ నిద్రలేచి రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యే సమయం. కానీ, సాఫ్ట్‌వేర్ దిగ్గజం 'ఒరాకిల్' (Oracle) ఇండియాలోని సుమారు 12,000 మంది ఉద్యోగులకు ఆ ఉదయం ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. "మీ సేవలు ఇక అవసరం లేదు, ఆఫీసు సిస్టమ్స్‌కు మీ యాక్సెస్ నిలిపివేస్తున్నాం" అనే ఒక చిన్న ఈమెయిల్ వారి జీవితాలను తలకిందులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా సుమారు 30,000 మందిని తొలగించగా, అందులో భారతీయ ఉద్యోగుల సంఖ్యే ఎక్కువ.

ఒక్క జీతాన్నే నమ్ముకుంటే కొంప మునుగుతుంది… మేల్కోవాల్సిన సమయం ఇది
ఒక్క జీతాన్నే నమ్ముకుంటే కొంప మునుగుతుంది… మేల్కోవాల్సిన సమయం ఇది

హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే ఒకప్పుడు లైఫ్ సెటిల్ అనుకునేవారు. కానీ, ఈ తాజా పరిణామాలు చూస్తుంటే ఒక్క జీతం మీదే ఆధారపడి బ్రతకడం అంటే, పడవకు ఒకటే తెడ్డు ఉండటం లాంటిదని అర్థమవుతోంది. మరి ఇలాంటి ఆకస్మిక షాక్‌ల నుంచి కోలుకోవాలంటే మనం ఏం చేయాలి? మన దగ్గర ఎన్ని ప్లాన్లు ఉండాలి?

'అత్యవసర నిధి' (Emergency Fund) - మీ మొదటి రక్షణ కవచం

ఉద్యోగం పోగానే చాలామందిని వేధించే మొదటి ప్రశ్న.. "వచ్చే నెల ఇంటి అద్దె ఎలా? పిల్లల స్కూల్ ఫీజులు, హోమ్ లోన్ EMIల పరిస్థితి ఏంటి?" అని. అందుకే, ప్రతి ఉద్యోగికి తన నెలవారీ ఖర్చులకు కనీసం 3 నుంచి 12 రెట్లు ఎక్కువ మొత్తంతో కూడిన 'ఎమర్జెన్సీ ఫండ్' ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మీ ఉద్యోగం స్థిరంగా ఉంటే 6 నెలల ఖర్చులను, ఒకవేళ మీ రంగంలో అనిశ్చితి ఎక్కువగా ఉంటే ఏడాదికి సరిపడా ఖర్చులను సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ నిధి ఉంటే, ఉద్యోగం పోయినప్పుడు ఆందోళన చెందకుండా, మన నైపుణ్యానికి తగ్గ సరైన ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి కావలసిన సమయం దొరుకుతుంది. లేదంటే, చేతిలో చిల్లిగవ్వ లేక దొరికిన చిన్న ఉద్యోగంలోనే చేరాల్సి వస్తుంది.

జీతం కాకుండా మరో సంపాదన.. ఎలా?

ఆర్థిక పెట్టుబడులు ఒక ఎత్తు అయితే, మీలోని ప్రతిభను ఆదాయ వనరుగా మార్చుకోవడం మరో ఎత్తు. కంటెంట్ రైటింగ్, ట్రైనింగ్, లేదా కన్సల్టేషన్ వంటి ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా అదనపు ఆదాయం సంపాదించవచ్చు.

"మన విలువలు మనల్ని ఇతరుల కంటే భిన్నంగా చూపిస్తాయి తప్ప, గొప్పవారిని చేయవు. అలాగే మన ఆదాయ మార్గాలు ఎన్ని ఎక్కువగా ఉంటే, మన స్వేచ్ఛ అంత ఎక్కువగా ఉంటుంది" అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

ఒక్కటి మాత్రం నిజం.. నేటి వేగవంతమైన ప్రపంచంలో ఉద్యోగం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. అందుకే, మనం సంపాదించే కాలంలోనే పొదుపును పెంచుకుని, అదనపు ఆదాయ మార్గాలను వెతుక్కోవడం ముఖ్యం. అప్పుడే ఏ ఈమెయిల్ వచ్చినా భయపడకుండా ఎదుర్కోగలం.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ప్ర: ఒరాకిల్ సంస్థలో ఎంతమందిని తొలగించారు?

జ: మార్చి 2026లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిని తొలగించగా, అందులో భారత్‌కు చెందిన 12,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

ప్ర: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి?

జ: సాధారణంగా 3 నుండి 6 నెలల ఇంటి ఖర్చులకు సరిపడా ఉండాలి. ఒకవేళ మీ ఉద్యోగం అంత స్థిరంగా లేదనిపిస్తే, 12 నెలల వరకు సరిపోయేంత మొత్తాన్ని అత్యవసర నిధిగా దాచుకోవడం ఉత్తమం.

ప్ర: REITs అంటే ఏమిటి?

జ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (REITs) ద్వారా మనం నేరుగా పెద్ద ఆస్తులను కొనకుండానే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ సంస్థలు తమకు వచ్చే అద్దె ఆదాయాన్ని పెట్టుబడిదారులకు డివిడెండ్‌గా పంచుతాయి.

ప్ర: ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు కంపెనీ అనుమతి అవసరమా?

జ: అవును, మీరు పని చేసే సంస్థ నిబంధనలను ఒకసారి సరిచూసుకోవాలి. మీ ప్రస్తుత ఉద్యోగానికి లేదా సంస్థ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండకూడదు.

ప్ర: అనిశ్చితిలో ఉన్నప్పుడు ఇంకా ఏం చేయొచ్చు?

జ: సేవింగ్స్ ఆర్ ఎర్నింగ్స్ అనే నానుడి ఉంది. అంటే పొదుపు చేయడమే సంపాదించడం అని అర్థం. అర్థం పర్థం లేని ఖర్చులు వెంటనే తగ్గించేయాలి. అనవసరమైన సబ్‌స్క్రిప్షన్లు, సమాజ మెప్పు కోసం ఆడంబరాలు, అడ్డగోలు ఫంక్షన్లు వంటివాటిని తగ్గించాలి. బయట తినడాలు, ఇబ్బడి ముబ్బడిగా షాపింగ్‌లు తగ్గించాలి. లగ్జరీ ప్రయాణాలకు బదులు సాధారణ తరగతిలో ప్రయాణాలు చేయొచ్చు.

ప్ర: రుణాలు, ఈఎంఐల పరిస్థితి ఏంటి?

జ: ఉద్యోగం ఎప్పుడు అనిశ్చితిలో పడుతుందో చెప్పలేం. ఈ నేపథ్యంలో మనం ఏవైనా రుణాలు, అంటే హోం లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ తీసుకోవాల్సి వస్తే, మన ఉద్యోగం పోయినా ఆ లోన్ తీర్చుకోగలమని భావించినప్పుడే తీసుకోవాలి. ఉద్యోగం కోల్పోతే మన వద్ద ఉన్న ఇతర వనరులను (నగలు, స్థలాలు వంటివి) అమ్మి వాటిని తీర్చుకోవచ్చు.

(గమనిక: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుకు లోబడి ఉంటాయి. పెట్టుబడులు పెట్టేముందు మీ ఆర్థిక సలహాదారులను, స్టాక్ మార్కెట్ నిపుణులను సంప్రదించాలి)

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe