...
...
Next Story

Heatwave : అక్టోబర్​లో హీట్​ వేవ్! ముంబై ప్రజలకు ఐఎండీ తీవ్ర హెచ్చరికలు..

నైరుతి రుతుపవనాలు నిష్క్రమించిన వారం రోజుల వ్యవధిలోనే ముంబై నగరాన్ని తీవ్రమైన వేడిగాలులు కమ్మేస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు చేరుకోవడంతో వాతావరణ శాఖ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేయగా, మరోవైపు గాలి నాణ్యత పడిపోవడం పౌరుల్లో ఆందోళన కలిగిస్తోంది.

Published on: Oct 9, 2026, 09:10:59 IST
Advertisement

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరాన్ని ఒక్కసారిగా ఉష్ణోగ్రతల తీవ్రత ముంచెత్తుతోంది. నైరుతి రుతుపవనాలు వీడ్కోలు పలికి వారం రోజులు కూడా గడవకముందే నగరంలో పగటి పూట తీవ్రమైన కాక పుడుతోంది. అక్టోబర్ నెల అనేది ట్రాన్సీషన్ పీరియడ్ (వర్షాలు- శీతాకాలం మధ్య) కావడంతో భానుడి ప్రతాపానికి నగరవాసులు అల్లాడిపోతున్నారు. సబర్బన్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌కు, దక్షిణ ముంబైలో 37 డిగ్రీలకు చేరే అవకాశం ఉందన్న అంచనాలతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హీట్​వేవ్ హెచ్చరిక జారీ చేసింది.

సాధారణం కన్నా 4.5 డిగ్రీలు ఎక్కువ..

అక్టోబర్​లో ముంబైకి హీట్​ వేవ్​ హెచ్చరికలు.. (HT Photo/Praveen Kumar)
అక్టోబర్​లో ముంబైకి హీట్​ వేవ్​ హెచ్చరికలు.. (HT Photo/Praveen Kumar)

ముంబైలో బుధవారంతో పోలిస్తే గురువారం నుంచే వేడి తీవ్రత పెరిగింది. సాంటాక్రూజ్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 4.5 డిగ్రీలు ఎక్కువగా నమోదై 37.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. అలాగే కులాబాలో సాధారణం కంటే 3.9 డిగ్రీలు ఎక్కువగా 36.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

"వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ నమోదు నమోదైతే దానిని 'హీట్ వేవ్'గా పరిగణిస్తాం. ఈ శుక్రవారం ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నందున హెచ్చరికలు జారీ చేశాం," అని ఐఎమ్‌డీ ముంబై రీజినల్ మెటీరోలాజికల్ సెంటర్ (ఆర్​ఎంసీ) అధిపతి బిక్రమ్ సింగ్ తెలిపారు.

అయితే ఈ ఏడాది మే, జూన్ నెలల్లో లాగా హ్యుమిడిటీ ఎక్కువగా లేకపోవడం కొంత ఉపశమనం కలిగించే అంశం. తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ తీవ్రమైన ఉక్కపోత, అసౌకర్యం కొద్దిగా తక్కువగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

'సూపర్ ఎల్ నినో' ప్రభావం..

ఈ అకస్మాత్తు వేడి వెనుక బహుళ వాతావరణ కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (ఎన్​ఐఏఎస్) ప్రొఫెసర్, సఫర్ వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ గుఫ్రాన్ బేగ్ ఈ పరిస్థితిని అంతర్జాతీయ వాతావరణ మార్పులతో ముడిపెట్టారు.

మరోవైపు ప్రాంతీయ వాతావరణ అంచనా కేంద్రం శాస్త్రవేత్త సుష్మా నాయర్ మాట్లాడుతూ, "ప్రాంతీయంగా ఏర్పడిన ఆంటి-సైక్లోనిక్ సర్క్యులేషన్ వల్ల గాలి పైకి వేగంగా వెళ్లలేకపోతోంది. దీనివల్ల చల్లటి సముద్ర గాలులు నిలిచిపోయి, పగటివేళ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా భూ ఉపరితలానికి దగ్గరలోనే కాలుష్య కారకాలు చిక్కుకుపోవడానికి ఇది కారణమవుతోంది," అని వివరించారు.

పడిపోతున్న గాలి నాణ్యత.. శ్వాసకోశ బాధితులకు తిప్పలు

ఉష్ణోగ్రతల పెంపుతో పాటు ముంబైలో వాయు కాలుష్యం మళ్లీ చుట్టుముడుతోంది. గురువారం నగర సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 120కి పడిపోయి 'మోడరేట్' (మధ్యస్థం) కేటగిరీకి చేరింది. ఈ నెలలో కాలుష్యం ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. గాలిలో పీఎం2.5, పీఎం10 కాలుష్య కారకాల మోతాదు అధికంగా ఉంది.

నగరంలోని 20 వాయు నాణ్యత పరిశీలన కేంద్రాల్లో 14 కేంద్రాలు 'మోడరేట్' స్థాయిని నమోదు చేశాయి. వర్లిలో అత్యధికంగా 159 ఎస్క్యూఐ నమోదవ్వగా, దేవ్‌నార్‌లో 153, సిద్ధార్థ్ నగర్‌లో 152గా పడిపోయింది. కాండివ్లీ (వెస్ట్) ప్రాంతంలో అత్యల్పంగా 74 ఎస్‌క్యూఐ నమోదైంది.

గాలి నాణ్యత క్షీణించడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదముందని 'సఫర్' యాప్ హెచ్చరించింది. గ్రాంట్ రోడ్ నివాసి, 79 ఏళ్ల ఆస్తమా బాధితుడు ఏవీ శెనాయ్ మాట్లాడుతూ.. "మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో సీ లింక్ నుంచి చూస్తే సౌత్ ముంబై భవనాలు పొగమంచు వల్ల సరిగ్గా కనిపించలేదు. మునుపటి కంటే ఇప్పుడు రోజుకు రెండుసార్లు ఇన్హేలర్ వాడాల్సి వస్తోంది," అని తన వేదనను వ్యక్తం చేశారు.

వాతావరణ మార్పులు, పొగమంచు వ్యాప్తి నేపథ్యంలో వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks