IND vs WI : ‘బాబా అమీర్ ఎక్కడ?'- పాక్ మాజీ ప్లేయర్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న టీమిండియా ఫ్యాన్స్..
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కోల్‌కతాలో జరిగిన కీలక పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. సంజూ శాంసన్ (97*) వీరోచిత పోరాటంతో భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లగా.. టీమ్ ఇండియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్‌ను నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు!
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది టీమిండియా. వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో భారత్ సెమీస్‌లో అడుగుపెట్టడమే కాకుండా, పాత రికార్డులను తిరగరాసింది. ఈ నేపత్యంలో, ఈసారి టీమిండియా అసలు సెమీస్‌కి కూడా వెళ్లదని పదేపదే చెప్పుకొచ్చిన పాకిస్థామ్ మాజీ క్రికెటర్ మహమ్మద్ఆమీర్పై ఇప్పుడు ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.
అమీర్ నోటికి.. భారత్ బ్యాట్‌తో సమాధానం!
టీ20 వరల్డ్ కప్ 2026 ఆరంభంలో పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అతనికే ఇబ్బందిగా మారాయి. ఒక టీవీ షోలో మాట్లాడుతూ.. "పాకిస్థాన్ క్వాలిఫై అవుతుందో లేదో తెలియదు కానీ, భారత్ మాత్రం కచ్చితంగా టాప్-4లోకి చేరదు," అని అమీర్ జోస్యం చెప్పారు. అతని మాటలకు యాంకర్ సైతం ఆశ్చర్యపోయారు.
అనంతరం, సౌతాఫ్రికాపై భారత్ ఓడిపోతుందని ముందే చెప్పిన అమీర్‌ని పాకిస్థాన్‌లో అందరు “ఆస్ట్రాలజర్” అని పిలవడం మొదలుపెట్టారు.
కానీ వెస్టిండీస్‌పై ఘన విజయంతో ఆ ఆస్ట్రాలజర్కి టీమిండియా గట్టి సమాధానం ఇచ్చింది.
అయితే, భారత్ మైదానంలో తన ఆటతోనే అమీర్‌కు గట్టి సమాధానం ఇచ్చింది. సూపర్-8 ఆరంభంలో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడినప్పటికీ, భారత్ అద్భుతంగా పుంజుకుంది. ముంబైలో జింబాబ్వేను ఓడించి, ఇప్పుడు కోల్‌కతాలో వెస్టిండీస్‌ను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది.
భారత్ విజయంతో సోషల్ మీడియాలో అభిమానులు అమీర్‌ను ఒక రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.
“టీమిండియా క్వాలిఫై అవ్వదని మహమ్మద్ అమీర్ చెప్పాడు. కానీ ఇండియా క్వాలిఫై అయ్యింది, డామినేట్ చేసింది, ఒక్క మాట కూడా మాట్లాడకుండా జవాబిచ్చింది, కొన్నిసార్లు మాటల కన్నా నిశ్శబ్ధమే ఎక్కువగా వినిపిస్తుంది,” అని ఒకరు ట్వీట్ చేశారు.
“టీమిండియా సెమీఫైనల్‌కి వెళ్లదు, పాకిస్థానే వెళుతుందని జోస్యం చెప్పిన మహమ్మ్ అమీర్‌ని చూసి కాసేపు నవ్వుకుందాము,” అని ఇంకొకరు అన్నారు.
“టీమిండియా సెమీస్‌కి వెళ్లదని జోస్యం చెప్పిన ఆ బాబా మహమ్మద్ అమీర్ ఎక్కడ?” అని ఇంకొకరు అడిగారు.
ఈడెన్ గార్డెన్స్‌లో రికార్డు ఛేజ్..
ఈడెన్ గార్డెన్స్‌లో ఇది టీ20 చరిత్రలోనే అత్యధిక రన్ ఛేజ్ కావడం విశేషం. 2016 ప్రపంచకప్ సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. ఒత్తిడిలోనూ భారత్ కనబరిచిన తెగువ, బ్యాటింగ్ లోతు టీమ్ ఇండియా సత్తాను మరోసారి చాటిచెప్పాయి.
సంజూ శాంసన్ ది గ్రేట్!
ఈ హై-ప్రెషర్ మ్యాచ్‌లో సంజూ శాంసన్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ఛేజింగ్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వికెట్లు కోల్పోయి 41 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో శాంసన్ క్రీజులోకి వచ్చాడు.
విధ్వంసకర ఇన్నింగ్స్: కేవలం 50 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్సర్లతో శాంసన్ అజేయంగా 97 పరుగులు చేశాడు.
ముఖ్యమైన భాగస్వామ్యాలు: సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబేల సహకారంతో ఛేజింగ్‌ను ముగించాడు.
విజయం ఇలా: చివరి ఓవర్లో 7 పరుగులు కావాల్సి ఉండగా, రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో శాంసన్ లెగ్ సైడ్ భారీ సిక్సర్ బాది, ఆపై మిడ్-ఆన్ మీదుగా విన్నింగ్ షాట్ కొట్టి భారత్‌ను గెలిపించాడు.
ముంబైలో ఇంగ్లాండ్‌తో పోరు..
సెమీఫైనల్ చేరిన సూర్యకుమార్ సేన, మార్చ్ 5 (గురువారం) ముంబైలోని వాంఖడే స్టేడియంలో హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్‌తో తలపడనుంది. సంజూ శాంసన్ తన ఫామ్‌ను సెమీస్‌లోనూ కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ నెలకొల్పిన సరికొత్త రికార్డు ఏమిటి?
వెస్టిండీస్‌పై 97 (నాటౌట్) పరుగులు చేయడం ద్వారా, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన భారతీయ బ్యాటర్‌గా సంజూ శాంసన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ (82* పరుగులు) పేరిట ఉండేది. అలాగే, ఈడెన్ గార్డెన్స్‌లో టీ20ల్లో ఇదే అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్ (196 పరుగులు).
2. సెమీఫైనల్లో భారత్ ఎవరితో, ఎక్కడ తలపడనుంది?
సూపర్-8లో వెస్టిండీస్‌పై ఘనవిజయంతో సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్న భారత్.. మార్చి 5, గురువారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


