శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.
Stock market investing : అప్పు చేసి మరీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఊహకు మించిన నష్టం..
స్టాక్ మార్కెట్లో అధిక లాభాల ఆశతో అప్పు చేసి పెట్టుబడి పెట్టడం అత్యంత ప్రమాదకరమని దిగ్గజ ఇన్వెస్టర్ చార్లీ ముంగర్ ఎప్పుడో హెచ్చరించారు. మార్కెట్ పతనమైతే నష్టాలు ఏ స్థాయిలో రెట్టింపు అవుతాయో, రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నవారికి ఇది ఎలా శాపమవుతుందో గణాంకాలతో సహా ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్లో విజయం సాధించాలంటే మంచి షేర్లను ఎంచుకోవడం ఎంత అవసరమో, భారీ తప్పిదాలకు దూరంగా ఉండటం కూడా అంతే కీలకం. వారెన్ బఫెట్ దీర్ఘకాలిక వ్యాపార భాగస్వామి, బెర్క్‌షైర్ హాత్‌వే మాజీ వైస్ ఛైర్మన్ దివంగత చార్లీ ముంగర్ తన జీవితకాలంలో ఇన్వెస్టర్లకు పదేపదే చెప్పిన సూత్రం ఇదే! పెట్టుబడిదారులు చేసే అతిపెద్ద పొరపాట్లలో 'అప్పు చేసి షేర్లు కొనడం' అత్యంత ప్రమాదకరమని ఆయన గట్టిగా హెచ్చరించారు. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు అప్పుతో కొన్న షేర్లు లాభాలను రెట్టింపు చేసినట్లు కనిపిస్తాయి; కానీ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలితే నష్టాలను అంతకంటే వేగంగా పెంచి, చేతిలోని అసలు పెట్టుబడిని కరిగించడమే కాకుండా నెత్తిన అప్పుల భారాన్ని మిగులుస్తాయి.

అప్పు చేసి పెట్టుబడి పెడితే నష్టం 45 శాతానికి ఎలా పెరుగుతుంది?
అప్పు తీసుకొని షేర్లు కొంటే నష్టాలు ఏ స్థాయిలో భయపెడతాయో ఒక చిన్న ఉదాహరణ ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు ఇన్వెస్టర్ల వద్ద చెరో రూ. 5 లక్షల సొంత డబ్బు ఉందనుకుందాం. మొదటి ఇన్వెస్టర్ ఎలాంటి అప్పు చేయకుండా తన వద్ద ఉన్న రూ. 5 లక్షలను మాత్రమే ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టారు. రెండో ఇన్వెస్టర్ అధిక లాభాల ఆశతో మరో రూ. 2.5 లక్షలు అప్పు తెచ్చి, మొత్తం రూ. 7.5 లక్షలను మార్కెట్లో పెట్టారు.
ఒకవేళ స్టాక్ మార్కెట్ 30 శాతం పతనమైందనుకుందాము.. అప్పుడు మొదటి ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియో విలువ రూ. 3.5 లక్షలకు తగ్గుతుంది. అంటే ఆయన అసలు పెట్టుబడిలో రూ. 1.5 లక్షలు (30 శాతం) నష్టపోయారు. కానీ రెండో ఇన్వెస్టర్ పరిస్థితి పూర్తిగా తలకిందులవుతుంది! 30 శాతం పతనంతో ఆయన రూ. 7.5 లక్షల పోర్ట్‌ఫోలియో విలువ రూ. 5.25 లక్షలకు పడిపోతుంది. అందులో నుంచి ఆయన తీసుకున్న రూ. 2.5 లక్షల అప్పును తీసివేస్తే, చేతిలో మిగిలే నికర ఈక్విటీ విలువ కేవలం రూ. 2.75 లక్షలు మాత్రమే.
దీనిని బట్టి చూస్తే వడ్డీ, ఇతర రుణ ఖర్చులను కలపకముందే రెండో ఇన్వెస్టర్ తన అసలు పెట్టుబడి రూ. 5 లక్షల్లో ఏకంగా 45 శాతం నష్టపోయారు. ఈ మొత్తానికి రుణంపై చెల్లించాల్సిన వడ్డీని కూడా కలిపితే నష్టం తీవ్రత మరింత పెరుగుతుంది. భవిష్యత్తులో మార్కెట్ తిరిగి కోలుకున్నప్పటికీ, ఆ మధ్యకాలంలో ఇన్వెస్టర్ ప్రతి నెలా క్రమం తప్పకుండా అప్పు వాయిదాలు, వడ్డీ చెల్లిస్తూనే ఉండాలి.
మార్కెట్ పతనమైతే బలవంతంగా షేర్లు అమ్మాల్సిన దుస్థితి!
అప్పు చేసి పెట్టుబడి పెట్టడం వల్ల కేవలం నష్టాలు పెరగడమే కాకుండా మరో తీవ్రమైన చిక్కు వచ్చి పడుతుంది. మార్జిన్ సదుపాయాన్ని వాడుకునే ఇన్వెస్టర్లు తమ ఖాతాలో నిర్ణీత కొలేటరల్ (హామీ), మార్జిన్ నిల్వలను ఎల్లప్పుడూ కొనసాగించాలి. మార్కెట్ పడిపోయి షేర్ల విలువ తగ్గినప్పుడు, ఆ మార్జిన్ లోటును భర్తీ చేయడానికి ఇన్వెస్టర్లు తక్షణమే అదనపు నగదును జమ చేయాల్సి ఉంటుంది.
భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ (సెబీ) మార్జిన్ ట్రేడింగ్ నిబంధనల ప్రకారం.. బ్రోకరేజీ సంస్థలు తప్పనిసరిగా నిర్దేశిత మార్జిన్ ప్రమాణాలను పాటించాలి. ఇన్వెస్టర్లు 'మార్జిన్ కాల్స్'కు స్పందించి అదనపు డబ్బు చెల్లించలేకపోతే, నిబంధనల ప్రకారం బ్రోకర్లు వారి ఖాతాలోని షేర్లను విక్రయించే అధికారం కలిగి ఉంటారు. మార్కెట్ భారీగా పతనమైన సమయంలో అప్పటికే పోర్ట్‌ఫోలియో అంతా నష్టాల్లో కూరుకుపోయి ఉంటుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అదనపు నిధులు సర్దుబాటు చేయలేని ఇన్వెస్టర్ల షేర్లను బ్రోకర్లు అత్యంత తక్కువ ధరలకే అమ్మేస్తారు.
ఇలా తక్కువ ధర వద్ద షేర్లు అమ్ముడుపోవడం వల్ల ఇన్వెస్టర్ శాశ్వతంగా నష్టాన్ని మూటగట్టుకుంటారు. ఆ తర్వాత మార్కెట్ మళ్లీ పుంజుకున్నా, మళ్లీ కొత్తగా డబ్బు పెడితే తప్ప ఆ లాభాలను అందుకునే అవకాశం ఉండదు. అంటే మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని దీర్ఘకాలం వేచి చూసే వెసులుబాటును అప్పు పూర్తిగా లాగేసుకుంటుంది. దీనికి తోడు లెవరేజ్ పొజిషన్‌ను ఎక్కువ కాలం కొనసాగించిన కొద్దీ వడ్డీ భారం పెరిగి, అసలు షేర్లు లాభాలు ఇచ్చినా ఆ ఫలితాన్ని వడ్డీ రూపంలో బ్రోకర్లే తినేస్తారు.
అంశాలు | అప్పు చేయకుండా | అప్పు చేస్తే |
| సొంత పెట్టుబడి | రూ. 5లక్షలు | రూ. 5లక్షలు |
| అప్పు చేసిన డబ్బు | 0 | రూ. 2.5 లక్షలు |
| మార్కెట్లో పెట్టిన డబ్బు | రూ. 5లక్షలు | రూ. 7.5లక్షలు |
| 30శాతం పతనం తర్వాత విలువ | రూ. 3.5లక్షలు | రూ. 5.25లక్షలు |
| ఔట్‌స్టాండింగ్ లోనే | 0 | రూ. 2.5లక్షలు |
| మిగిలిన ఈక్విటీ | రూ. 3.5లక్షలు | రూ. 2.75లక్షలు |
| క్యాపిటల్ నష్టం | 30% | 45% |
రిటైర్మెంట్ దగ్గరపడుతున్న వారికి ఇది పెను ప్రమాదం!
పదవీ విరమణకు దగ్గరవుతున్న ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లకు అప్పుతో కూడిన పెట్టుబడులు కోలుకోలేని దెబ్బ తీస్తాయి. యువతతో పోలిస్తే వీరికి భారీ నష్టాల నుంచి మళ్లీ సంపదను నిర్మించుకోవడానికి తగినంత సమయం ఉండదు. పైగా పదవీ విరమణ తర్వాత నెలవారీ జీవన వ్యయాల కోసం పొదుపు నిధుల నుంచి క్రమం తప్పకుండా డబ్బు విత్‌డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మార్కెట్ పతనంతో పాటు రుణ చెల్లింపుల ఒత్తిడి తోడైతే, ప్రతికూల ధరల వద్దే విలువైన షేర్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా తక్కువ ధరలకు విత్‌డ్రా చేయడం వల్ల భవిష్యత్తులో మార్కెట్ కోలుకున్నప్పుడు రాబడిని ఇచ్చే మూలధనం తగ్గిపోతుంది. కాబట్టి ఇన్వెస్టర్లు తమ ఈక్విటీ షేర్లను అమ్మకుండా, అత్యవసర నిధిని ముట్టుకోకుండా అప్పు వాయిదాలను చెల్లించగలమా లేదా అన్నది ముందే లెక్కవేసుకోవాలి. మార్కెట్ 20 నుంచి 30 శాతం పడిపోయినా తమ పోర్ట్‌ఫోలియో తట్టుకోగలదా, అదనపు మార్జిన్ డబ్బులు కట్టగలమా అన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
ముంగర్ సూత్రం నుంచి ఇన్వెస్టర్లు నేర్చుకోవాల్సిన పాఠాలు..
సంపదను శాశ్వతంగా నాశనం చేసే రిస్క్‌లకు దూరంగా ఉండటమే చార్లీ ముంగర్ పెట్టుబడి తత్వశాస్త్రం ప్రధాన సారాంశం. అప్పు చేసి షేర్లు కొనడం వల్ల ఆ షేర్ల విలువ పడిపోయినా, మీరు చెల్లించాల్సిన అప్పు బాధ్యత మాత్రం ఏమాత్రం తగ్గకుండా అలాగే నిలిచి ఉంటుంది.
ఇన్వెస్టర్లు తమ వద్ద మిగులు ఉన్న డబ్బుతో పెట్టుబడి పెట్టడానికి, ఎక్కువ రాబడి కోసం అప్పు తెచ్చి మార్కెట్లో పెట్టడానికి మధ్య ఉన్న స్పష్టమైన తేడాను గుర్తించాలి. లెవరేజ్ తీసుకునే ముందే వడ్డీ రేటు, తిరిగి చెల్లించే గడువు, మార్జిన్ కాల్స్ ముప్పు, సుదీర్ఘ కాలం మార్కెట్ మందగమనాన్ని తట్టుకునే ఆర్థిక శక్తిని బేరీజు వేసుకోవాలి.
రిటైర్మెంట్‌కు చేరువలో ఉన్నవారు అప్పులతో మార్కెట్ రిస్క్ పెంచుకోవడం కంటే, ఇప్పటివరకు కూడబెట్టిన పొదుపును కాపాడుకోవడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. తగినంత అత్యవసర నిధిని సిద్ధంగా ఉంచుకుని, సమీప భవిష్యత్ అవసరాలకు కావాల్సిన డబ్బును సురక్షితమైన, స్థిరమైన పథకాల్లో ఉంచడం వల్ల మార్కెట్ పతనమైనప్పుడు ఈక్విటీలను అమ్ముకోవాల్సిన అవసరం తప్పుతుంది.
అంతిమంగా మార్కెట్లో ఎక్కువ డబ్బు పెట్టడం వల్లే దీర్ఘకాలంలో భారీ లాభాలు రావు! ర్యాలీలలో లాభాలు ఆర్జించడం ఎంత అవసరమో, పతనాల్లో మూలధనాన్ని కాపాడుకుంటూ మార్కెట్లో నిలకడగా కొనసాగడం కూడా అంతే ముఖ్యమని ముంగర్ హెచ్చరిక మనకు గుర్తుచేస్తోంది.

E-Paper
